రెండేళ్ల పాలన …..ఫిఫ్టీ….ఫిఫ్టీ

ప్రభుత్వం ఎంత గొప్పగా అయినా చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు. సంక్షేమ మంత్రంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరిపోయామని ఉత్సాహపడిపోవచ్చు. వైసీపీ రెండేళ్ల పాలనపై భిన్నమైన [more]

Update: 2021-05-31 06:30 GMT

ప్రభుత్వం ఎంత గొప్పగా అయినా చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు. సంక్షేమ మంత్రంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరిపోయామని ఉత్సాహపడిపోవచ్చు. వైసీపీ రెండేళ్ల పాలనపై భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూసే విపక్షాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచికి, చెడుకు మధ్య తేడాను సైతం గుర్తించడానికి నిరాకరించే దుస్తితికి ప్రతిపక్షాలు దిగజారిపోయాయి. ప్రజావిశ్వాసాన్ని కోల్పోయాయి. అంతమాత్రాన ప్రభుత్వం ప్రగతిదాయకమైన బాటలో పయనిస్తోందని చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవ దృష్టితో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి నూటికి యాభై శాతం మార్కులే పడతాయి. సంక్షేమం సర్వ రోగ నివారిణిగా నడుస్తున్న పాలనలో దీర్ఘకాలిక దృష్టి లోపించిందనేది నిష్టుర సత్యం. అలాగని పూర్తిగా ప్రభుత్వ పరిపాలన అటకెక్కేసిందని చెప్పడమూ అబద్ధమే అవుతుంది. ఆసుపత్రులు, పాఠశాలలకు జవసత్తువలు కల్పించడానికి ఉద్దేశించిన నాడు-నేడు ఒక మహతర్త కార్యకల్పన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వైద్యరంగాన్ని చేరువ చేయాలన్న ప్రయత్నమూ హర్షించదగినదే. మానవ వనరుల కు సంబంధించి ఈ రెండు మాత్రమే నిర్మాణాత్మకమైన పనులుగా మేధావులు విశ్లేషిస్తున్నారు.

అపాత్ర దానం..

రాష్ట్రంలో కోటి అరవై లక్షల గృహాలు ఉంటే అందులో కోటి నలభై లక్షల గృహాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. 86శాతం ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా సాయం అందుకుంటున్నారు. రెండేళ్లలో నేరుగా ప్రజల ఖాతాల్లో 95 వేలకో్ట్ల రూపాయలు జమ చేశాం. మరో 31వేల కోట్లు పరోక్షంగా వారిసంక్షేమానికి ఖర్చు పెట్టామంటూ ప్రభుత్వం చాలా గొప్పగా చెబుతోంది. నిజంగా రాష్ట్రంలో 86 శాతం ప్రజలు ప్రభుత్వ సాయం లేకుండా బ్రతకలేని పరిస్థితి ఉంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఆప్రికాదేశాల్లోని కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ప్రాంతాల్లో సైతం ఇంతటి దుస్థితి ఉండదు. భారత దేశంలో అందులోనూ దక్షిణాదిలో ఎంతో కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఆర్థికంగా మధ్యతరగతి రాష్ట్రం. ఇంకా ఇక్కడి ప్రజల్లో 86శాతం ప్రజలు సర్కారీ సాయం పైనే ఆధారపడుతున్నారంటే విచిత్రంగా కనిపిస్తుంది. ఒడిసా వంటి పేద రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు 50శాతం లోపు ప్రజలకే పరిమితమవుతున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా 30శాతం పేదరికం , ప్రభుత్వ సాయం ఆశించడం సహజం. 40 శాతం ప్రజలు ప్రభుత్వం పై ఆధారపడితే వెనకబడిన రాష్ట్రాలుగా పరిగణించాలి. ఈ సంఖ్య 50శాతం దాటిందంటే ఇక ఆ రాష్ట్రం దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రజలజీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థితి కనిపించదు. అయినా 86శాతం ప్రజలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తోందంటే విచ్చలవిడిగా అపాత్ర దానం చేస్తున్నట్లే లెక్క.

అనవసర గందరగోళం..

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అందులోనూ వెల్ఫేర్ బడ్జెట్ ను రెండింతలు చేసి పరిపాలన సాగిస్తోంది వైసీపీ. ఈ స్థితిలో సాధ్యమైనంత వరకూ పరిపాలన సాఫీగా సాగేలా చూసుకోవాలి. చిన్నరాష్ట్రానికి ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చు. మూడు రాజధానులంటూ గందరగోళానికి తెర తీశారు. పోనీ అది చేసి చూపించలేకపోయారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదో రూపంలో మూడు రాజధానుల కల సాకారం అయి ఉండేది. విశాఖలో కనీసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తెరవడం ద్వారా అయినా తమ నిర్ణయంపై వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసి ఉండవచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశించడంతో న్యాయస్తానాలు ఆటంకపరుస్తున్నాయనే నెపంతో పక్కన పెట్టేశారు. అటు అమరావతి, ఇటు కొత్తగా ప్రతిపాదించిన నగరాలు అన్నీ అయోమయంలో పడ్డాయి. ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రాష్ట్రం. నీటి వనరులే ఆర్థిక రంగానికి ఊతం. సాగునీటి ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ తో మొత్తం పనులన్నీ రెండేళ్లు వెనక్కి పోయాయి. రివర్స్ టెండరింగ్ లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీలు తర్వాత రీ ఎస్టిమేషన్ లతో కొత్త అంచనాలకు ఆమోదం పొందే పనిలో పడుతున్నాయి. అంటే సమయం వృథా తప్ప ప్రభుత్వానికి పెద్దగా మిగిలేదేమీ ఉండదు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు ఇది పెద్ద సమస్యగా మారుతోంది.

అసలు హామీ అలాగే ఉంది…

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. మిగిలిన హామీలన్నీ ఒక ఎత్తు. సంపూర్ణ మద్య నిషేధం ఒక ఎత్తు. నిజానికి మిగిలిన హామీలన్నిటి కంటే అదే అత్యంత విలువైనది. కానీ మద్యం సొమ్ముపై ఆధారపడే ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. తొలి దశ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వానికి అద్భుతమైన వరం లభించింది. దాదాపు రెండు నెలలు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. తొంభైశాతం వ్యసనపరులు మద్యానికి దూరమయ్యారు. ఆ సమయాన్ని వినియోగించుకుని సంపూర్ణ మద్య నిషేధ హామీని అమలు చేసి ఉంటే ఈ ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు పడేవి. సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు అమలు చేయకపోయినా ఫర్వాలేదు. తాము సంపాదించుకున్న సొమ్ము తాగుడుకు తగలేయకుండా సద్వినియోగం చేసుకుంటే చాలు ప్రజల జీవితాలు వాటంతట అవే బాగుపడతాయి. ఒక చేత్తో సంక్సేమం రూపంలో అందిస్తూ మరో చేత్తో రెట్టింపు సొమ్ము మద్యం రూపంలో దోపిడీ చేస్తుంటే పేదరికం శాశ్వతంగా వారి కుటుంబాల్లో తిష్ఠ వేస్తుంది. అందువల్ల సంపూర్ణ మద్యనిషేధం అమలు చేసే వరకూ రాస్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్థమూ ఉండదు. ప్రయోజనమూ నెరవేరదు. ఇది అమలయ్యే వరకూ వైసీపీ సర్కారు హామీల అమలును పిఫ్టీ..ఫిఫ్టీగానే చూడాలి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News