షాను మరింత బలవంతుడిని చేశారా?

జులై 7న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాష్రాల అధికారంలోకి చొరబడటమేనని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. సహకార సంఘాలు [more]

Update: 2021-07-21 16:30 GMT

జులై 7న జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాష్రాల అధికారంలోకి చొరబడటమేనని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. సహకార సంఘాలు రాష్రాల పరిధిలోని అంశమని రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ స్పష్టం చేస్తోందని కాంగ్రెస్, సీపీపీ, సీపీఎం తదితర ప్రధాన ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇది సమాఖ్య విధానానికి గండికొట్టడమేనని అవి విమర్శిస్తున్నాయి. నిపుణుల నుంచి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మంత్రిత్వశాఖ ఏర్పాటుతోపాటు దానికి సారథిగా కరడుగట్టిన అమిత్ షా ను సారథిగా నియమించడం వెనక భారతీయజనతా పార్టీకి రహస్య అజెండా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని, సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, తద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని భారతీయ జనతా పార్టీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.

అందరూ అక్కడి నుంచే..?

సహకార రంగంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది దానిని బలోపేతం చేయడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో సహకార రంగం, రాజకీయ రంగం కలగాపులగంగా ఉన్నాయి. కొన్ని రాష్రాల్లో సహకార రంగం శక్తిమంతంగా ఉంది. రాష్ట్ర రాజకీయాలపైనా అది ప్రభావం చూపుతోంది. ప్రధాని మోదీ సొంత రాష్ర్టమైన గుజరాత్ లో సహకార రంగంలోని పాల డెయిరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితమే ఈ రాష్ట్రంలోని ‘ఆనంద్’లో డెయిరీ రంగానికి కురియన్ పునాదులు వేశారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఏపీలోని సంగం డెయిరీ రాజకీయంగా ఎంత శక్తిమంతమైనదో తెలిసిందే. మహారాష్ర్టలో బలంగా ఉన్న సహకార చక్కెర రంగం రాజకీయాలను పరోక్షంగా శాసిస్తోంది. ఈ రంగం నుంచి వచ్చిన నాయకులు కొంతమంది రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన మేనల్లుడైన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహకార రాజకీయాల్లో అరంగ్రేటం చేసి ఎదిగిన వారే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఒకప్పుడు అహమ్మదాబాద్ సహకార బ్యాంకు ఛైర్మన్ గా పనిచేసి పైకొచ్చిన వారే కావడం గమనార్హం.

వారిని దెబ్బతీసేందుకేనా?

మహారాష్ర్ట లోని శివసేన, కాంగ్రెస్, ఎన్ సీపీ సంకీర్ణ సర్కారును దెబ్బతీసేందుకే కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మహారాష్ర్ట సహకార రంగ రాజకీయాల్లో బీజేపీ వెనకబడి ఉందన్నది వాస్తవం. దీన్ని సరిదిద్దికోవడమే తాజా ప్రయత్నమన్నది విశ్లేషకుల అంచనా. సహకార రంగంలో చేనత, బ్యాంకులు, డెయిరీలు విస్తరించి ఉన్నాయి. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల ద్వారా ఆ రంగంపై పట్టు పెంచుకోవాలన్నది కేంద్రం వ్యూహం. అదే విదంగా తాజా మంత్రిత్వశాఖ ఏర్పాటు ద్వారా విభిన్న రంగాలపై నియంత్రణ సాధించాలన్నది బీజేపీ పెద్దల వ్యూహం గా కనపడుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 1,94, 195 పాల సంఘాలు ఉన్నాయి. దాదాపు 330 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. నాబార్డ్ (నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్) అంచనాల ప్రకారం 95,238 గ్రామ స్థాయిలో వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. 363 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లు, పెద్దసంఖ్యలో రాష్ర్ట సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీలకు…?

రాష్టాల సహకార బ్యాంకుల్లో రమారమి రూ.1,35,393 కోట్ల డిపాజిట్లున్నాయి. ఇంతకన్నా పెద్ద మొత్తంలో రుణాలను ఇవి అందజేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికీ కిందిస్థాయిలో సహకార రంగం శక్తిమంతంగా ఉంది. ఇందులో బీజేపీ ప్రమేయం తక్కువే. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలకే వీటిపై పట్టుంది. ఈ పరిస్థితిని అధిగమించి క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా బలోపేతమయ్యేందుకు భాజపా పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే కొత్తగా సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు. దానికి ప్రధాని తరవాత అంతటి శక్తిమంతుడైన, ఆయనకు కుడిభుజంగా పేరొందిన అమిత్ షా ను సారథిని చేయడమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనిని తోసిపుచ్చడం కష్టమే మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News