కాంగ్రెస్ లో మరో అసంతృప్తి.. కారణమిదేనట?

వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే ఈ పార్టీలో అసమ్మతి, అసంతప్తి [more]

Update: 2021-08-29 16:30 GMT

వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే ఈ పార్టీలో అసమ్మతి, అసంతప్తి సహజంగానే అనివార్యం. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా కుమ్ములాటలకు తక్కువేమీ కాదు. రాష్ర్ట స్థాయిలో, జాతీయ స్థాయిలోనూ ఉంటాయి. పరిస్థితి సాఫీగా ఉన్నా కొన్నిసార్లు అధిష్టానమే అసమ్మతిని రాజేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, యువ నాయకుడు నవజ్యోతి సింగ్ వర్గాల మధ్య రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే. బలమైన నాయకుడైన అమరీందర్ పై అధిష్టానమే సిద్ధూను ప్రయోగించినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.

పదవులన్నీ ఒక ప్రాంతానికే…?

ఏడేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నప్పటికీ జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు యథాతథంగా కొనసాగుతున్నాయి. సంస్థాగత పదవులన్నీ ఒక ప్రాంత నాయకులే చేజిక్కించుకుంటున్నారన్న వాదనను ఉత్తర, పశ్చిమ భారతానికి చెందిన కొంతమంది నేతలు వినిపిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని ఉదాహరణలను కూడా చూపెడుతున్నారు. తాజాగా రాజ్యసభలో పార్టీ విప్ గా కర్ణాటకకు చెందిన నసీర్ హస్సేన్ ను నియమించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదే రాష్రానికి చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ దళితనేత గుల్బర్గా నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. అయి నప్పటికీ ఆయనను అధిష్టానం అనుగ్రహించింది. ఇదే రాష్రానికి చెందిన మరో నేత, మేధావిగా పేరుగాంచిన జైరాం రమేష్ పార్టీ ఉప నేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మళ్లీ కర్ణాటకకు చెందిన నసీర్ కు పదవి కట్టబెట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

దక్షిణాది వారికే….?

లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా పశ్చిమ బెంగాల్ కు చెందిన అధీర్ రంజన్ చౌధరి (బెర్హంపూర్ ఎంపీ), ఉప నేతగా గౌరవ్ గొగొయి (కలియాబార్ ఎంపీ) ఉన్నారు. గౌరవ్ గొగొయి అస్సాం మాజీ ముఖ్యమంత్రి దివంగత తరుణ్ గొగొయి కుమారుడు. చీఫ్ విప్ గా కె. సురేష్ (కేరళ, మావెలికర ఎంపీ), విప్ గా మాణికం ఠాగూర్ (తమిళనాడు, విరుదునగర్ ఎంపీ) ఉన్నారు. ఠాగూర్ ఇప్పటికే తెలంగాణ పార్టీ రాష్ర్ట ఇన్ ఛార్జిగా ఉన్నారు, కీలకమైన పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కె.సి.వేణుగోపాల్, ప్రధాన సలహాదారుగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ తమిళనాడు నేతలేనని అసమ్మతి నాయకులు గుర్తు చేస్తున్నారు. వేణుగోపాల్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇలా సంస్థాగత పదవులన్నీ దక్షిణాదికే దక్కుతున్నాయని ఉత్తరాది, పశ్చిమ నాయకులకు మొండిచేయి ఎదురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే అక్కడంటున్న హైకమాండ్….

2019 పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడు, కేరళల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిన మాట వాస్తవమే. అందుకే ఆ రాష్టానికి చెందిన నేతలకు పదవులుకట్టబెట్టడంలో తప్పేమీ లేదు. కానీ కర్ణాటకలో పార్టీ పరాజయం పాలైంది. స్వయంగా ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన మల్లిఖార్జున ఖర్గే గుల్బర్గా నుంచి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు పార్టీ పెద్దపీట వేసిందని అసమ్మతి నాయకులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర, పశ్చిమ భారతాల్లో పార్టీక్షేత్రస్థాయిలో బలంగా లేని మాట వాస్తవమే. అయినప్పటికీ ఈ ప్రాంత నాయకులకు కనీసం సంస్థాగత పదవుల్లో అయినా ప్రాధాన్యం ఇస్తే పార్టీ కోసం ఉత్సాహంగా పని చేయడానికి అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. లేనట్లయితే పార్టీ మరింతగా బలహీనపడే ప్రమాదమందని ఆ ప్రాంత నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనను తోసిపుచ్చడం కష్టమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News