ట్రబుల్ షూటర్ నే ఎందుకు….?

తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేస్తే పెద్దగా ఆందోళన కన్పించలేదు. తమిళనాడులో ఎక్కడా నిరసనలు కూడా ఆ పార్టీ శ్రేణులు [more]

Update: 2019-09-04 17:30 GMT

తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేస్తే పెద్దగా ఆందోళన కన్పించలేదు. తమిళనాడులో ఎక్కడా నిరసనలు కూడా ఆ పార్టీ శ్రేణులు చేయలేదు. కానీ కర్ణాటకలో మాజీ మంత్రి డీకే శివకుమార్ ను అరెస్ట్ చేస్తే మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు తమ అసంతృప్తిని తెలియజేశాయి. బస్సు అద్దాలు పగులకొట్టాయి. కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో నిరసనలు పెద్దయెత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టారు. ఒక్కోప్రాంతంలో ప్రభుత్వం అదనపు బలగాలను దించాల్సి వచ్పింది.

మనీ లాండరింగ్ కేసులో…..

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. రెండు రోజుల పాటు డీకేను విచారించిన అనంతరం 8.59 కోట్ల కు సంబంధించిన కేసులో తమ వద్ద ఆధారాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డీకే శివకుమార్ ను అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఢిల్లీకి విచారణ నిమిత్తం పిలిచి మరీ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

సంక్షోభం వస్తే చాలు…..

డీకే శివకుమార్ పై ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ డీకే శివకుమార్ కు నోటీసులు జారీ చేసింది. అయినా శివకుమార్ ఏ మాత్రం బెదరలేదంటారు. పార్టీలోనూ, అధిష్టానం వద్ద పట్టున్న నేత కావడంతో ఎన్నికల సమయంలో ఆయన జోలికి వెళ్లలేదంటారు. ఆయనకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగి దానిని పరిష్కరించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తారు. అన్ని సార్లు కాకున్నా కొన్నిసార్లు విజయవంతమవుతారు.

ఎన్నికల అనంతరం కూడా….

2017లో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన సమయంలో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకలో ఉంచి ఆయన గెలుపునకు డీకే శివకుమార్ దోహదపడ్డారు. అంతేకాదు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ సభ్యులను క్యాంపులకు తరలించే బాధ్యత డీకే తన భుజాలపైనే వేసుకున్నారు. నిన్న గాక మొన్న కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలి పోక ముందు అసంతృప్త ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు డీకే శివకుమార్ అనేక ప్రయత్నాలు చేశారు. ఇలా కర్ణాటకలోనే కాదు దేశంలో ఎక్కడ కాంగ్రెస్ సంక్షోభంలో పడినా అధిష్టానం డీకే వైపు చూడటం మామూలయింది. అలా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను అరెస్ట్ రాజకీయకోణంలోనే జరిగిందన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ, కానీ ఈడీ పూర్తి ఆధారాలుండటంతోనే అరెస్ట్ చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News