ట్రంప్ కు మరో అవకాశం.. అందుకేనా?

విజయం వ్యక్తిలోని పెద్ద లోపాలను సైతం కప్పి పుచ్చుతుంది. పరాజయం వ్యక్తిలోని చిన్నపాటి లోపాలనూ వెలికితీస్తుంది. ఇది సహజ పరిణామం. ప్రస్తుత అమెరికా ఎన్నికల విజేత బైడెన్, [more]

Update: 2020-11-22 16:30 GMT

విజయం వ్యక్తిలోని పెద్ద లోపాలను సైతం కప్పి పుచ్చుతుంది. పరాజయం వ్యక్తిలోని చిన్నపాటి లోపాలనూ వెలికితీస్తుంది. ఇది సహజ పరిణామం. ప్రస్తుత అమెరికా ఎన్నికల విజేత బైడెన్, పరాజితుడు ట్రంప్ ను చూసిన తరవాత ఈ విషయం మరోసారి గుర్తుకు రాకమానదు. బైడెన్ గతంలో అధ్యక్ష పదవికి ప్రయత్నించి విఫలమవ్వడం, వ్యక్తిగత జీవితంలో అనేక ఆటుపోట్లు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అంతిమంగా అమెరికా పీఠాన్ని చేరుకున్నారు. దీంతో ఆయన లోపాలన్నీ ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. ఇక ట్రంప్ గురించి చెప్పనక్కర్లేదు. అహంకారం, దురుసుతనం, దుందుడుకుతనం, లెక్కలేనితనం, అవివేకం తదితర అవలక్షణాలు ఆయనలో మూర్తీభవించి ఉంటాయి. నాలుగేళ్ల అధికారంలో ఆయన వ్యవహారశైలిని యావత్ ప్రపంచం చాలాదగ్గరగా చూసింది. ఈ లక్షణాలే ఆయనను పరాజయం పాల్జేశాయి.

పారిశ్రామికవేత్త నుంచి…..

స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన ట్రంప్ కార్పొరేట్ కార్యాలయం నుంచి నేరుగా శ్వేతసౌధాన్ని చేరుకున్నారు. కనీస రాజకీయ అనుభవం లేకపోవడం, మొండిగా ముందుకు సాగడందో దేశీయంగా, అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారు. గత నాలుగేళ్లుగా ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆధారంగా ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. దాదాపు నిర్ణయాలన్నీ వివాదాస్పదం కావడం గమనార్హం. ముఖ్యంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను ఎదుర్కోవడంలో నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక వ్యక్తిగా కూడా ట్రంప్ కనీసం మాస్క్ ధరించకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారు. దేశంలో నిరుద్యోగ సమస్య హద్దులు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్నికల విషయంలో సంయమనం కోల్పోయి ప్రత్యర్థులపై వాచాలత్వం ప్రదర్శించారు. ఫలితాల అనంతరం కూడా విజేతను అభినందించాలన్న కనీస హుందాతనాన్ని చూపలేకపోయారు. ఎన్నికల సమయంలోనే ఫలితాలపై కోర్టులకు వెళతానని ప్రకటించి ఎన్నికల వ్యవస్థను చులకన చేశారు. ఫలితాలను ఆమోదిస్తున్నట్లుప్రకటించడం ద్వారా హుందాగా వ్యవహరించాలన్న కుమారులు, అల్లుడు కుష్నర్ సూచనలను పెడచెవిన పెట్టారు.

నిర్లక్ష్యం, వివాదాస్పద నిర్ణయాలు…..

ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఒబామా కేర్ పథకాన్ని నిర్వీర్యపరిచి ప్రజల అభిమానానికి దూరమయ్యారు. చివరకు అభిశంసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. చట్టసభల్లో బలం కారణంగా అభిశంసన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అంతర్జాతీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఆరు ముస్లిం దేశాల ప్రజలను దేశంలోకి అనుమతించకుండా నిషేధం విధించి చెడ్డపేరును మూటగట్టుకున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగారు. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ఒప్పందం నుంచి వైదొలగి అంతర్జాతీయంగా అమెరికా స్థాయిని తగ్గించారు. చైనాతో వైరాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. హెచ్ 1బీ, ఇతర వీసాలకు సంబంధించి కఠినమైన ఆంక్షలను విధించి విదేశీ విద్యార్థుల అమెరికా ప్రవేశాన్ని అడ్డకున్నారు. ఇరాన్ తో అణు ఒప్పందం నుంచి వైదొలగారు. ఈ చర్యల ద్వారా అంతర్జాతీయంగా అమెరికా స్థాయిని కుదించారు.

అంత కష్టమేమీ కాదు….

అయితే ట్రంప్ ఓడిపోయినప్పటికీ గట్టిపోటీ ఇచ్చారు. చివరిదాకా ప్రత్యర్థిని వణికించారు. ఈ మెజార్టీని కాపాడుకుని వచ్చే నాలుగేళ్లలో హుందాగా వ్యవహరించి, నిర్మణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన ట్రంప్ విజయవంతమైన అధ్యక్షుడిగా నిరూపించుకోవడానికి ఆయనకు మరో అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది. ఒకసారి ఓడి రెండోసారి గెలిచిన చరిత్ర అమెరికా రాజకీయాల్లో ఉంది. 1884 ఎన్నికల్లో 22వ అధ్యక్షుడిగా పనిచేసిన గ్రోవర్ క్లీన్ లాండ్ 1888 లో ఓడిపోయారు. అయినప్పటికీ 1892లో గెలిచి 24వ అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టారు. ఈ విషయం ట్రంప్ నకు తెలియదని అనుకోలేం. ఈ దిశగా అడుగులేస్తే మరోసారి వైట్ హౌస్ కు వెళ్లడం అంత కష్టమేమీ కాదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News