ఎవరిని కదిపినా వంద కోట్లే …?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఒక్కో అభ్యర్థి ఖర్చు వంద కోట్ల రూపాయల పైమాటేనట. ఇది వినడానికి కూడా విడ్డురంగా జనసామాన్యంలో ఆశ్చర్యం అనిపించక పోవడానికి [more]

;

Update: 2019-01-29 18:29 GMT

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఒక్కో అభ్యర్థి ఖర్చు వంద కోట్ల రూపాయల పైమాటేనట. ఇది వినడానికి కూడా విడ్డురంగా జనసామాన్యంలో ఆశ్చర్యం అనిపించక పోవడానికి కారణం ధనస్వామ్యం గా మారిన మన ప్రజాస్వామ్యం అనే చెప్పాలి. ఇంత ఖర్చు ఎలా అంటే తమ పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఖర్చు భరించాలిసి రావడమే. ఇక శాసన సభ అభ్యర్థుల ఖర్చు 20 నుంచి 30 కోట్లరూపాయలు దాటుతుందని సీనియర్ రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. నిజమైన గెలుపు గుర్రాలు అంటే ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా ఖర్చుకు వెనుకాడని వారే అని తేలిపోతుంది.

రంగంలోకి సివిల్ సర్వీస్ అధికారులు …

ఐఏఎస్, ఐపిఎస్ ల నుంచి ఒక సిఐ స్థాయి అధికారి వరకు పనిచేసి రిటైర్ అయిన వారు ఇంకా సర్వీస్ వున్నవారు కూడా రాజకీయాల్లోకి దిగిపోతున్నారు. టికెట్ గ్యారంటీ అంటే తమ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులు కోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు వీరు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత లాగా రాజకీయ నేతలనే ఆదర్శంగా తీసుకుని దోచుకో దాచుకో సిద్ధాంతం త్రికరణ శుద్ధిగా అక్రమార్కులు కొందరు ఆచరణలో పెట్టి వందల కోట్లు సముపార్జిస్తుండటం తరచూ ఎసిబి, సిబిఐ కేసుల్లో అరకొరగా చూస్తున్నాం. ఈ కేసుల్లో ఖర్మ కాలి దొరికేది ఒక్కశాతమే. 99 శాతం దుర్మార్గులు దర్జాగా తమ దందా నడిపిస్తున్నారు. ఇందులో అవినీతి సొమ్మును ఏమి చేసుకోవాలో తెలియని వారు కొందరైతే, మరికొందరు తమ డబ్బును పదింతలు పెంచుకోవాలంటే రాజకీయాన్ని మించిన వ్యాపారం లేదని గ్రహించినవారు మరికొందరు కావడం గమనార్హం. దాంతో సర్వీసులో వీరు ఏ మాత్రం వెనకేసుకొని వుంటారో తేటతెల్లం అయిపోతుంది. ప్రధాన రాజకీయ పక్షాలు వీరిని వెతికి మరీ పట్టుకుని రెడ్ కార్పెట్ లు వేసి మరీ పార్టీని నమ్ముకున్నవారిని పక్కన పెట్టి టికెట్లను పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తు ఉండటం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.

రాజకీయమే వ్యాపారంగా …

ఉద్యోగులు, వ్యాపారస్తులు, బడా పారిశ్రామికవేత్తల సంగతి అలా ఉంచితే రాజకీయమే ఊపిరి గా పీల్చేస్తున్న వారి ఆదాయానికి అంతు పొంతూ ఉండదు అనే మాట వినవస్తుంది. ఇందులో అక్కడక్కడా గంజాయి వనంలో తులసి మొక్కల్లా కొందరు వున్నా అత్యధిక శాతం ఇదే బాపతు కావడం దేశ ప్రజాస్వామ్యం పీకల్లోతు కష్టాల్లో పడిందనే సంకేతాలు పంపుతుంది. సాధారణ ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల సీట్ల ఎన్నికలు గమనిస్తే ఓటుకు నోటు తీసుకునే దౌర్బల్యానికి అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు తేడా ఏమి లేకపోవడం మరింత ఆందోళనకర పరిణామామే. రాజకీయం అనేది పక్కా వ్యాపారమని కొన్ని దశాబ్దాలుగా అందరికి తెలిసిపోవడంతో పదవిలోకి వచ్చేది సొమ్ములు సంపాదించేందుకు కనుక మీరు దోచిన సొమ్ములో మా వాటా సంగతి ఏమిటి అని ఓటరు అడిగే పరిస్థితి నడుస్తుంది. అతి చిన్న రాష్ట్రమైన కేరళలో మాత్రం ఓటర్లు అత్యంత చైతన్యవంతులు కావడం డబ్బుతో అక్కడ నేతలకు పని జరగదని తెలియడంతో కింది స్థాయినుంచి పై స్థాయి నేత వరకు ప్రజలకు జవాబుదారీగా వుంటున్నారు. ఆ పరిస్థితి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుందని మేధావులు భావిస్తున్నారు. మరి ఎప్పటికి ఆ రోజులు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News