New Year Wishes Cyber Crime: కొత్త సంవత్సరం, జర భద్రం !
మరి కొన్నిరోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. 2024కి గుడ్ బై చెప్పి.. 2025లోకి అడుగు పెట్టేందుకు మరికొన్ని రోజుల
మరి కొన్నిరోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. 2024కి గుడ్ బై చెప్పి.. 2025లోకి అడుగు పెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాదిలో సరికొత్తగా సంబరాలు జరుపుకునేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆశలు,ఉత్సాహాన్ని తెస్తుంది. కొత్త సంవత్సరంలోనైనా అదృష్టం కలిసి వచ్చి తమకు అనుకూలంగా పనులు జరుగుతాయని.. సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు.
కానీ, అమాయకులను దోచుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా, కొత్త సంవత్సర శుభాకాంక్షల పేరుతో జేబులు ఖాళీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. ఆయన తన X ఖాతా వేదిక గా అప్రమత్తంగా ఉండవలసిందిగా అందరిని హెచ్చరించారు.
ఏ సందర్భం అయినా, ఆత్మీయులు ఒకప్పుడు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు, కానీ ఇప్పుడు ఏ సందర్భం అయినా ఫోనులో విషేస్ వచ్చేస్తున్నాయి. పండగైనా, పబ్బమైనా అన్నీ ఫోనులోనే అయిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ లో. ఈ మెసేజీల్లోనే అందరూ సృజనాత్మకత ను వెతుకుతూ ఉంటారు. అందరి కంటే వైవిధ్యంగా ఎలా విష్ చెయ్యోచ్చా అని ఆలోచిస్తుంటారు.
డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల నుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఈ క్రమంలో సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకు పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని మన ఫోన్ల కి సందేశాలు వస్తాయి. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైల్స్ రూపంలో మెసేజీలు వస్తాయి. పొరపాటున కూడా వాటి మీద క్లిక్ చేస్తే మన్ ఫోనులోని సమాచారం అంతా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ లాగేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ నేరగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది అని కూడా వారు చెప్తున్నారు.
తెలంగాణలో గతేడాది తో పోలిస్తే 2024 వ సంవత్సరం సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ మోసాలలో చిక్కుకునే వారు ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగులేనని కూడా తెలుస్తోంది. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్-5లో నిలిచింది. అలాగే తెలంగాణలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల మెుదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
చాలా జిల్లాలు అంతే, వరంగల్, ఖమ్మం, కరీమ్నగర్, సిద్దిపేట్, రామగుండం, నిజామాబాద్ కమీషనరేట్లలో సైబర్ క్రైం పోలీసు స్తేషన్లు ఉన్నాయి. ఎలాంటి అనుమానం వచ్చినా, సైబర్ మోసానికి గురైనా అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు, అలాగే, నేషనల్ హెల్ప్ లైన్ నంబర్ అయిన 1930 కి కాల్ చేసి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అంతే కాకుండా, ఎలాంటి ఫ్రాడ్ ని అయినా https://cybercrime.gov.in/ వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చు. ఈ వెబ్ సైట్ లో మనం సులభంగా కంప్లెయింట్ నమోదు చేసి మంకి జరిగిన మోసాన్ని ఇతరులకు జరుగకుండా నివారించవచ్చు.
సైబర్ మోసాన్ని రిపోర్ట్ చేయడం వల్ల మనకు న్యాయం జరగడమే కాదు, నేరస్థులను పట్టుకోవడం లో అధికారులకు సహాయపడగలం. మోసగాళ్లకి భయపడి చర్య తీసుకోవడానికి వెనుకాడకూడదు. డిజిటల్ బెదిరింపుల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, ఇతరులను కూడా రక్షించవచ్చు. అయితే ముందుగా, అజాగ్రత్త తో విలువైన సమాచారాన్ని పోగొట్టుకోకుండా, ఎటువంటి అనుమానాస్పదమైన లింకుల మీదా క్లిక్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఆనందం గా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.