కులం – మతం – మూర్ఖత్వం

“ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి….. ఈ బీద బిక్కి జనాలకు చదువే దండగ అనుకుంటే కొత్తగా వాళ్లకు ఇంగ్లీష్‌ చదువులు చెప్పిస్తే వాళ్లంతా [more]

Update: 2020-04-15 12:30 GMT

“ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి….. ఈ బీద బిక్కి జనాలకు చదువే దండగ అనుకుంటే కొత్తగా వాళ్లకు ఇంగ్లీష్‌ చదువులు చెప్పిస్తే వాళ్లంతా మా ముందు తలఎగరేస్తే ఎలా….. కోట్ల రుపాయలు ఖర్చుతో పెట్టిన కాన్సెప్ట్‌ స్కూళ్లు., ఒలింపియాడ్‌ బళ్లు., ఐఐటి-జెఇఇ కోచింగ్‌లు ఏమైపోవాలి. వాళ్లకంటూ పెట్టిన కప్పల బళ్ళలో పాఠాలు చెప్పే వారి దయుంటే చదువుకోవాలి లేకపోతే కూలికెళ్లాలి కానీ మన సంస్క్కతిని కాదని ఇలా అన్ని ఇంగ్లీష్ బళ్లు చేసేస్తే ఎలా…. అయినా ఇంగ్లీష్ కూలీ చదువులు పెద్దోళ్లకే కానీ మా చెప్పు చేతల్లో బతికే పాలేరు వర్గాలకు కాదనే సంగతి ఇప్పటికైనా తెలిసొస్తే మంచిది. పాఠశాలలు – విద్యా బోధన అనేది పెట్టుబడిదారి వర్గాల సొంతం. పెట్టుబడుల్లో వచ్చే ప్రయోజనాలు అధికార పీఠాన్ని కాపాడుకునే అస్త్రాలు… అందులో పాలిత వర్గాల శ్రమను పిండుకోవడమే అసలు లక్ష్యం. పాడి ఆవులాంటి విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరుస్తామంటే గుండెలు మండిపోవు….”

ఇంగ్లీష్ మీడియం పై…..?

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయంపై చాలా రోజులుగా రగడ సాగుతోంది. ఇవాల్టికి దానికో ముగింపు వచ్చింది. ప్రజలు కూడా చేరోవైపు చేరి ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో దానికి కులం రంగు., ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారం, టీటీడీలో అన్యమతస్తుల ఉద్యోగాలు ఇలా రకరకాల అభిప్రాయాలు., వాటిలో కుల దూషణలు., మతాభిప్రాయాలు కలగలసి రచ్చరచ్చగా సాగాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసి తమ భాషాభిమానాన్ని చాటుకునేందుకు పత్రికలు తమ వంతు కృషి చేశాయి. ఎప్పట్లాగే అమ్మభాష-మాతృభాష మమకారం., అంధ్రమా-అంగ్లమా ఇలా తమ పైత్యాన్ని పాఠకుల నెత్తిన ధారాళంగా కుమ్మరించాయి. చివరకు న్యాయస్థానాలు ప్రభుత్వం జారీ చేసిన జోవోలను రద్దు చేశాయి. ఏడాది నవంబర్‌లో జారీ చేసిన జీవో 81, 85లను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఈ నిర్ణయం చాలామందికి ఊరటనిస్తుంది. తమ పిల్లల్ని ఇంగ్లీష్ బళ్లలో చదివిస్తూ తెలుగు పాఠాలు చెప్పే టీచర్లు., కుటుంబ వార్షిక వేతనంలో మూడో వంతు కప్పంగా వసూలు చేసే కార్పొరేట్ బళ్ల యాజమాన్యాలు ఎగిరి గెంతేస్తాయి.

భాషకు… మతానికి సంబంధం ఉంటుందా…..

ఆంధ్రాలో ఇంగ్లీష్‌ చదువులు వ్యాపించడానికి అసలు ఎవరు కారణమనే ప్రశ్నతో ఈ చర్చ జరగాలి. కోస్తాలో దళిత కులాల అభివృద్ధి చెందడంలో క్రైస్తవ మతం కీలక పాత్ర పోషించింది. మద్రాసు ప్రెసెడెన్సీలో జరిగిన విద్యా బోధన ఇందుకు ఉదాహరణ. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆంధ్రా ప్రాంతంలో మత వ్యాప్తికి కింది కులాలు కాస్తోకుస్తో అభివృద్ధి చెందడానికి దగ్గరి సంబంధం ఉంది. అది మత వ్యాప్తిలో భాగంగా జరిగినా., ఆ మాటకొస్తే నిజాం రాజ్యం., మద్రాసు ప్రెసిడెన్సీలలో పోర్చుగీసు వాళ్లు., ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగుల్ని తయారు చేసుకునేందుకు ఇంగ్లీష్ చదువుల్ని ప్రోత్సహించారు. అదే సమయంలో తిన్నా తినకపోయినా ఇంటికొక్కరినైనా చదివించుకోవాలనే అభ్యుదయం ముందు చూపు ఉన్న కులాల్లో స్వాతంత్ర్యానికి పూర్వమే బయలుదేరింది. ఆ క్రమంలోనే కోస్తా జిల్లాల్లో భూస్వాములు ప్రత్యేకించి ఇంగ్లీష్‌ కాన్వెంట్‌ల ఏర్పాటు కోసం భారీగా భూములు విరాళాలు ఇచ్చి వాటి ఏర్పాటును ప్రోత్సహించారు. “ఇలా తొలి నాళ్లలో మతం మారిన కులాలు… ప్రస్తుతం అగ్రకుల హోదాను అనుభవిస్తున్న కులాల చెప్పు చేతల్లోనే ఈ మతం ఇప్పటికి ఉండటం విశేషం”. గ్రామాల్లో దశాబ్దాలుగా చర్చిల్లో ఉండే ఏర్పాట్లు., కుల అంతరాలు తెలిసినా వాటి గురించి బయట చర్చ జరగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. కాన్వెంట్ల ఏర్పాటుకు భూములిచ్చిన కులాలు., కులాభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్న కులాలు ఆంగ్ల విద్య ఫలాలను ధారాళంగా అందిపుచ్చుకున్నాయి. ఆంగ్లం అందించిన జ్ఞానంతో విదేశాలకు వెళ్లి మెరుగైన ఉపాధి పొంది ఆ ఫలాలను మళ్లీ సొంత ప్రాంతాల్లో సామాజిక, వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడంలో., అధికారాన్ని సుస్తిరం చేసుకోవడంలోఆంగ్ల బోధన కీలక పాత్ర పోషించింది. ప్రైవట్‌.,కార్పొరేట్‌ విద్యా బోధన ఫలితాలు కూడా మళ్లీ అలాంటి ఫలితాలనే ఇచ్చింది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో., కొత్త తరం ఉద్యోగాలను, ఐటీ ఆధారిత ఆదాయాన్ని అందుకోవడటంలో ఆంగ్లం ఆధారిత జ్ఞానమే కీలకమైంది. ఇప్పుడు మాతృభాష, అమ్మ భాష అంటూ సన్నాయి నొక్కులు నొక్కే వారి ఉద్దేశాల వెనుక చాలా ముసుగులు ఉంటాయి. అందులో తమకు పోటీ వర్గాలు మేధోపరంగా పెరగకుండా ఉండటంతో పాటు., అన్ని వర్గాలు., కులాల ప్రజలకు ఒకే రకమైన విద్యావకాశాలు లభిస్తే పోటీలో వెనుకబడి పోతామనే దుర్మార్గం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఆంగ్లంలో అందరికి బోధన అనగానే మతమార్పిడి అంశం విస్తృతంగా ప్రచారం అయ్యింది. అలా చూస్తే ఆంగ్లంలో విద్యాభ్యాసం చేసే వారంతా మతం మార్చుకున్నట్లు అవుతుందా అనేది మరో ప్రశ్న. ప్రైవేట్., కార్పొరేట్ బళ్లలో ఆంగ్ల బోధనకు లేని అభ్యంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మాత్రమే ఉండటానికి కారణమేమిటో వారే చెప్పాలి.

అందరికీ ఆంగ్లం అయితే ఎలా….

2020 నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ., మండల పరిషత్‌., జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో విద్యా బోధన ఆంగ్లంలోకి మారుస్తూ గత ఏడాది నవంబర్ ఐదున జీవో 81 జారీ అయ్యింది. 2021 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు., 2022 నుంచి పదో తరగతి వారికి ఆంగ్ల బోధన మొదలవుతుంది. ఈ జీవోకు కొనసాగింపుగా సిబిఎస్‌ఇ సిలబస్‌తో దాదాపు 6500 పాఠశాలల్లో ఆంగ్లంలో విద్యా బోధన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి తర్వాత నేరుగా ఇంగ్లీష్‌ మీడియంలోకి మారే బదులు., దశల వారీగా ఆంగ్ల మాధ్యమంలోకి విద్యార్ధులను మళ్లించడం వారికి మేలు కలిగిస్తుంది. ఇందులో ఉపాధ్యాయ సంఘాలు., రాజకీయ పార్టీలు., విద్యావేత్తలు, ప్రైవేట్ పాఠశాలలు ఇలా ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఆంగ్లంలో విద్యా బోధనతో తెలుగు భాషకు పెద్ద ఎత్తున ప్రమాదం ముంచుకొస్తుందనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరిగింది. ఆంగ్లంలో విద్యా బోధన జరగకపోయినా., విద్యాభ్యాసం చేయకపోయినా అవకాశాలలో వెనుకబడి పోతారనేది నిర్వివాదాంశం. ఈ విషయంలో చైనా., రష్యా వంటి ఉదాహరణలు మనకు వర్తించవు. మనం చదివే తెలుగు పక్కనే ఉన్న కర్ణాటక., తమిళనాడులో పనికి రాదు. మనం నేర్చుకునే తెలుగు దేశ రాజధానిలో పనికిరాదు. మన మాతృభాష వేరు… మన జాతీయ భాష వేరు… మన అవసరాలు వేరు…., మనం నేర్చుకునేది వేరు….. ఇవన్నీ కాదని నన్ను, నిన్ను, అందర్నీ ఒకేలా చూస్తామని ప్రభుత్వాలు భావిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి.

శరత్‌ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News