కండిషన్స్ కు కనెక్ట్ అవుతారా?

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు కొత్తప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్ కోరిక తీరేనా? ఆయ‌నను టీడీపీ అధినేత చంద్రబాబు క‌రుణించేనా? ఇప్పుడు ఈ విష‌యంపైనే చ‌ర్చోప‌చ‌ర్చలు జ‌రుగుతున్నా యి. [more]

Update: 2020-02-05 08:00 GMT

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు కొత్తప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్ కోరిక తీరేనా? ఆయ‌నను టీడీపీ అధినేత చంద్రబాబు క‌రుణించేనా? ఇప్పుడు ఈ విష‌యంపైనే చ‌ర్చోప‌చ‌ర్చలు జ‌రుగుతున్నా యి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ప్రభుత్వ టీచ‌ర్‌గా ఉన్న జ‌వ‌హ‌ర్‌ త‌ర్వాత చంద్రబాబు పిలుపుతో రాజ‌కీయాల్లోకి రావ‌డం ఆ వెంట‌నే ప‌శ్చిమ గోదావ‌రి ఇల్లా నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు నుంచి ఎన్నిక‌ల బరిలోకి దిగ‌డం, గెలుపు గుర్రం ఎక్కడం అన్నీ తెలిసిందే. ఆ త‌ర్వాత ఎస్సీ కోటాలో చంద్రబాబు ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఒక్కసారిగా జ‌వ‌హ‌ర్ రాజకీయాలు మారిపోయాయి.

స్థానికుడు కాదంటూ….

ఆ ఎన్నిక‌ల‌కు ముందు కొవ్వూరు టీడీపీలో జ‌వ‌హ‌ర్‌పై తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది. స్థానిక‌త‌ను ఇక్కడి నాయ‌కులు తెర‌మీదికి తెచ్చారు. జ‌వ‌హ‌ర్ స్థానికుడు కాద‌ని, ఆయ‌న‌కు ఎట్టిప‌రిస్థితిలోనూ టికెట్ ఇవ్వరాద‌ని ఇక్కడి నాయ‌కులు వాద‌న తెర‌మీద‌కి తెచ్చారు. ఒక‌వేళ త‌మ‌వాద‌న కాద‌ని జ‌వ‌హ‌ర్‌కు ఇస్తే ఓడిస్తామ‌ని అన్నారు. అదే స‌మ‌యంలో జ‌వ‌హ‌ర్‌పై వ్యక్తిగ‌త విమ‌ర్శల‌కు కూడా దిగారు. పార్టీలో ఆయ‌న గెలుపు కోసం కృషి చేసిన వారిని ప‌ట్టించుకోలేదని, వైసీపీ వారికి మేలు చేస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు.

తిరువూరు పంపినా….

ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు జ‌వ‌హ‌ర్‌ను ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌వ‌హ‌ర్ కృష్ణాజిల్లా తిరువూరు నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే, వైసీపీ హవా ముందు జ‌వ‌హ‌ర్ ఓడిపోయారు. అయిన‌ప్పటికీ పార్టీ త‌ర‌ఫున క్రియాశీలంగానే జ‌వ‌హ‌ర్ ప‌నిచేస్తున్నారు. పార్టీ వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. రాజ‌ధాని ఉద్యమం స‌హా ఇసుక పోరాటం వంటి కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ, డిబేట్లలో పాల్గొంటూ పోరాటాలు చేస్తున్నారు.

మనసులోని కోరికను….

దీంతో అధినేత చంద్రబాబు ద‌గ్గర మంచి మార్కులు వేయించుకున్నారు జవహర్. ఈ క్రమంలోనే త‌న మ‌న‌సులోని కోరిక‌ను చంద్రబాబు ద‌గ్గర‌ వెల్లడించారు. త‌ను గ‌తంలో విజ‌యం సాధించిన కొవ్వూరుకే తాను వెళ్లిపోతాన‌ని, వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో గెలిచి చూపిస్తాన‌ని జ‌వ‌హ‌ర్ కొన్నాళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, రెండేళ్లు మంత్రిగా జ‌వ‌హ‌ర్ కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి చేసిన మాట నిజం. అయితే పార్టీలో ఓ సామాజికవ‌ర్గంతో పాటు కొంత‌మంది నేత‌లు ఆయ‌న్ను గిట్టనీయ‌లేదు. నాయ‌కుల‌తో సంబంధం లేకుండా జ‌వ‌హ‌ర్‌కు కొవ్వూరులో మంచి ప‌ట్టే ఉంది.

అనిత వెళ్లిపోవడంతో….

ఈ నేప‌థ్యంలో జ‌వ‌హ‌ర్ తిరువూరులో ఉన్నా.. ఆయ‌న మ‌న‌సంతా కొవ్వూరుపైనే ఉంది. ఇక అక్కడ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన వంగ‌ల‌పూడి అనిత తిరిగి పాయ‌క‌రావుపేట‌కు వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు అక్కడ పార్టీని న‌డిపించే నేత క‌రువ‌య్యారు. దీంతో త్వర‌లోనే జ‌వ‌హ‌ర్ కోరిక తీర‌నుంద‌ని, ప్రస్తుతం చంద్రబాబు కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితుల‌పై దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News