గాంధీ భవన్ లో ఈ కుమ్ములాటలు ఆగవా?
ఏ పార్టీ అయినా ఓటమి తర్వాత గుణపాఠం నేర్చుకుంటుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో నేతల్లో మరింత ఐక్యత పెంచాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో [more]
ఏ పార్టీ అయినా ఓటమి తర్వాత గుణపాఠం నేర్చుకుంటుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో నేతల్లో మరింత ఐక్యత పెంచాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో [more]
ఏ పార్టీ అయినా ఓటమి తర్వాత గుణపాఠం నేర్చుకుంటుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడంతో నేతల్లో మరింత ఐక్యత పెంచాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటిది కనపడదు. గాంధీభవన్ ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందనే చెప్పాలి. సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన సీనియర్ నేతలు ఇప్పటికీ హోదా కోసం ప్రయత్నాలు చేస్తుండం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.
గ్రూపు రాజకీయాలు….
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఎవరికి వారే గ్రూపులు కట్టి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో క్యాడర్ లో కూడా అయోమయం నెలకొంది. సర్కార్ పై ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు పార్టీ పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. చివరకు డీసీసీల నియామకంలో కూడా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి.
రేవంత్ వర్గానికి…..
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడాన్ని సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. కవ్వంపల్లి సత్యనారాయణకు డీసీసీ పదవి ఇవ్వడాన్ని సీనియర్ నేత వి.హనుమంతరావు తప్పుపడుతున్నారు. సత్యనారాయణ రేవంత్ రెడ్డి వర్గం కావడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్త వారికి పదవులను ఎలా కట్టబెడతారని వీహెచ్ సూటిగానే పీసీసీ చీఫ్ ను ప్రశ్నించారు. అలాగే ముఖ్యమైన అఖిలపక్ష సమావేశాలకు జూనియర్ అయిన సంపత్ కుమార్ ను ఎలా పంపుతారన్న ప్రశ్న కూడా సీనియర్ల నుంచి వస్తుంది.
అవకాశాలు ఇవ్వరా?
ఇక పీవీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్ గా గీతారెడ్డిని నియమించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గీతారెడ్డి కొన్నాళ్లుగా యాక్టివ్ గా లేరని, అటువంటి వారికి పదవి ఎలా ఇస్తారంటున్నారు. జలదీక్ష కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమంటున్నారు. కొమ్మిరెడ్డి రాములు వంటి వారిపై సస్పెన్షన్ లు ఎత్తివేయకపోవడాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. వీటిపై సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో నేతలు ప్రభుత్వంపై పోరాటం కంటే సొంత పార్టీ నేతలపై వార్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుంది.