ఎందుకంత గుండెలు బాదుకోవడం? లెక్కలు చూడండి

పప్పుబెల్లాలు అనేవాళ్ళు, పేదలను సోమరిపోతుల్ని చేస్తున్నారు అంటూ వాపోయేవాళ్ళు పేదల వ్యతిరేక ఆలోచనాధోరణి మార్చుకుంటే మంచిది. ధనవంతులు బ్యాంకులకు ఋణాలు ఎగ్గొట్టొచ్చు. పారిశ్రామిక వేత్తలు రాయితీలు పొంది [more]

Update: 2021-01-21 08:00 GMT

పప్పుబెల్లాలు అనేవాళ్ళు, పేదలను సోమరిపోతుల్ని చేస్తున్నారు అంటూ వాపోయేవాళ్ళు పేదల వ్యతిరేక ఆలోచనాధోరణి మార్చుకుంటే మంచిది. ధనవంతులు బ్యాంకులకు ఋణాలు ఎగ్గొట్టొచ్చు. పారిశ్రామిక వేత్తలు రాయితీలు పొంది అరకొర పరిశ్రమలు పెట్టి చేతులు దులిపేసుకోవచ్చు. కాంట్రాక్టర్లు భారీగా ప్రజాధనం నొక్కేయొచ్చు. బడా నేతలు కోట్లకు కోట్లు కొల్లగొట్టొచ్చు. అధికారులు, ఉద్యోగులు లంచాలు నొక్కేయొచ్చు. కానీ పేదోడికి ఏదైనా ఇస్తే గుండెలు బాదేసుకోవడం. ఏదో అయిపోతుందని గగ్గోలు, విశ్లేషణలు చేయడం ఏ పక్షం మేధావితనమో!?

ఇవి కూడా పప్పు బెల్లాలేనా?

20 నెలలు – 13.51 లక్షల ఉద్యోగాలు
గడచిన 20 నెలల కాలంలో రాష్ట్రంలో 13.51 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
1. గ్రామ/వార్డు వాలంటీర్లు – 2.50 లక్షలు @ రూ 5,000/- జీతం
2. గ్రామ సచివాలయ సిబ్బంది – 4.50 లక్షలు @ రూ 10,000/- జీతం (సగటున)
3. ఆరోగ్యశ్రీ అంబులెన్సులు – 1080 @ రూ 10,000/- జీతం (సగటున)
4. పౌరసరఫరాల వాహనాలు – 6.20 లక్షలు @ రూ 12,000/- జీతం (సగటున)

ఎన్ని పరిశ్రమలు పెడితే?

ఎన్ని పరిశ్రమలు పెడితే, వాటికి ఎన్ని రాయితీలు ఇస్తే, ఎంతకాలానికి ఇన్ని ఉద్యోగాలు వచ్చేవి!? ఇవేం గొప్ప ఉద్యోగాలా అంటూ దీర్ఘాలు తీయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా దొరక్క ఆటోలు నడుపుతున్నారు. మెకానిక్ పని, పెయింట్ పని, హోటల్లో వెయిటర్ పని, గుమస్తా పని… ఇలా రకరకాలుగా బతుకుబండి లాగిస్తున్నారు. వాళ్ళని అడగండి ఇవి ఉద్యోగాలో కావో చెపుతారు. ఆర్ధిక శాస్త్రం చదివితే, మార్క్స్ రాసిన క్యాపిటల్ చదివితే పప్పుబెల్లాల అర్ధం తెలుస్తుంది.

అదే ఆర్థిక వ్యవస్థకు….

అయినా స్వాతంత్య్రం వచ్చిన 70 యేళ్ళ తర్వాత కూడా ఇంకా 70 శాతం మంది పేదలుగా ఉన్న దేశంలో, లాకర్లలో, దిండుల్లో, ఇంటి గోడల్లో దాచుకునే సొమ్ముకంటే పోపుల పెట్టెల్లో దాచిన చిల్లరే (పప్పుబెల్లాలే) ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా ఉంచిందని తెలియకపోతే ఎలా!? ప్రపంచాన్ని రెండుసార్లు కుదిపేసిన ఆర్ధిక సంక్షోభాన్ని ఈ దేశం తట్టుకోగలిగిందంటే అది పేదోళ్ళు దాచుకునే పప్పుబెల్లాల వల్లనే. భారత చిన్నమొత్తాల పొదుపు సంస్థ పనితీరుపై దృష్టి పెడితే, పోస్టాఫిసుల్లో పొదుపు పుస్తకాలు చూస్తే ఈ దేశ ఆర్థిక పునాదులు తెలుస్తాయి. దేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినప్పుడు, 70 శాతం మంది సగటు నెలజీతం పదివేలకు మించనప్పుడు నడిచేది అంతా పప్పుబెల్లాలే.

నాదేశంలో 70 శాతం మంది జీతం పప్పుబెల్లాలే.
నా దేశంలో 70 శాతం మంది జీవితం పప్పుబెల్లాలే.
నా దేశంలో 70 శాతం ఎకానమీ పప్పుబెల్లాలే.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News