పాపులారిటీ పడిపోయిందా?

కరోనా రెండో విడత ఉద్దృతిని నియంత్రించలేక భారత దేశం ఎంతగా అప్రదిష్ట పాలైనదీ అందరికీ తెలిసిందే. అనేక దేశాలు తమ దేశంలోకి భారత పౌరులు రాకుండా నిషేధాన్ని [more]

Update: 2021-06-19 16:30 GMT

కరోనా రెండో విడత ఉద్దృతిని నియంత్రించలేక భారత దేశం ఎంతగా అప్రదిష్ట పాలైనదీ అందరికీ తెలిసిందే. అనేక దేశాలు తమ దేశంలోకి భారత పౌరులు రాకుండా నిషేధాన్ని అమలు చేశాయి. గత సంవత్సరం కరోనాను సమర్థంగా నిరోధించినందుకు భారత్ ను ప్రపంచదేశాలు ప్రశంసలతో ముంచెత్తాయి. ప్రత్యేకించి ప్రధాని మోదీ కీర్తి కిరీటంలో బోలెడన్ని పొగడ్తలు జమ అయ్యాయి. కానీ అదృష్టం తిరగబడింది. ఈ ఏడాది సెకండ్ వేవ్ లో అంతగానూ దేశం అపఖ్యాతి పాలైంది. నరేంద్రమోదీ నవ్వుల పాలయ్యారు. అయినా ఇంకా మోదీ ప్రభ పూర్తిగా మసకబారలేదంటోంది అమెరికాకు డేటా ఇంటిలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్. ప్రపంచ స్థాయిలో పాపులర్ లీడర్లలో ఇంకా ఆయనదే అగ్రస్థానం అంటూ తేల్చి చెప్పింది. దౌత్య, రాజకీయ వర్గాలు చాలా వరకూ ప్రామాణికంగా తీసుకునే ఈ సర్వే భారతీయ జనతాపార్టీలో సంతోషం నింపుతోంది. అదే సమయంలో రెండేళ్లలో పాపులారిటీ తీవ్రంగా పడిపోయిన వాస్తవాన్ని సైతం అదే కన్సల్జెన్సీ అంకెలతో సహా వెల్లడించడం కమలం పార్టీకి కలవరం పుట్టిస్తోంది.

ఇంకా పాపులర్ లీడరే..?

సమయాన్ని , సందర్బాన్ని బట్టి ప్రపంచంలో నాయకత్వ శైలులు, ప్రజాదరణ వంటి అంశాలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ట్రాకింగ్ సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. శాంపిల్ నమూనా చాలా తక్కువగా ఉంటుంది. అయితే పాక్షికతకు తావులేని సాధికారికమైన శాంపుల్ ను తెప్పించుకుంటుంది. దానివల్ల ఈ సంస్థ వెల్లడించే వివరాలకు విశ్వసనీయత ఎక్కువ. తాజాగా జరిపిన సమాచార విశ్లేషణల్లో భారత ప్రధాని నరేంద్రమోదీకి అంతర్జాతీయంగా ప్రముఖ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ ఉందని తేలింది. దేశంలోని ప్రజల్లో 66 శాతం మంది ఇంకా ఆయనంటే మక్కువ చూపుతున్నారని , సమర్థునిగా పేర్కొంటున్నారనేది సంస్థ అంచనా. ఇదే సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి పదమూడు దేశాల అగ్రనాయకులు మోదీ కంటే వెనకబడి ఉన్నారు. ఈ సమాచారం బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం నింపే అంశమే. అయితే ఇది అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా జరిపే సర్వే మాత్రమే అనే భావన కూడా ఉంది. దేశీయంగా ఉండే ప్రజల మనోభావాలకు అద్దం పట్టదని , మేధో వర్గాల నుంచి సమాచార సేకరణ జరుగుతుందనే విమర్శ కూడా ఉంది.

28 శాతానికి పెరిగిన వ్యతిరేకత…

గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ లో నరేంద్ర మోదీ మంచి మార్కులు కొట్టేశారని ఆనందించి , సంబరాలు చేసుకునేందుకు వీలు లేకుండా అదే సంస్థ కొన్ని ప్రమాద సంకేతాలనూ అందించింది. 2019 ఆగస్టులో మోదీ 82 పాయింట్లతో మిగిలిన అంతర్జాతీయ నేతలెవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఆ సమయంలో దేశంలోనే కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. జమ్ము కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని పార్లమెంటు రద్దు చేసింది. ప్రజలు సెంటిమెంట్ గా ఫీలయ్యే అంశం జమ్ముకశ్మీర్. బీజేపీ అజెండాలోనూ అతి కీలకం. అప్పటికి మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయ్యింది. మొత్తం పాజిటివ్ కారణాలన్నీ కలిపి ప్రధాని ఇమేజ్ ను పతాక స్థాయికి చేర్చాయి. అప్పట్లో అభిప్రాయాలు సేకరించిన వారిలో కేవలం 11 శాతం మంది మాత్రమే మోదీని వ్యతిరేకించారు. అంతకు దాదాపు ఎనిమిది రెట్ట మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. అప్పటి ఆదరణతో పోలిస్తే ప్రస్తుతం 66శాతం మంది మోడీ సమర్థతపై నమ్మకం తో ఉండగా 28శాతం వ్యతిరేకత కనబరచడం విశేషం.

ఇంకా గ్రాఫ్ దిగజారితే కష్టమే..

మూడు, నాలుగు శాతం ఓటింగ్ తేడా వస్తే అధికారం తలకిందులయ్యే దేశం మనది. బీజేపీ పార్టీపరంగా దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు 2019లో తెచ్చుకోగలిగింది. 300 పైచిలుకు సీట్లతో సొంతంగా మెజార్టీ సాధించింది. అయినా దేశంలో ఓట్ల శాతాన్ని పోల్చుకుంటే 35శాతం లోపుగానే ఆపార్టీకి దక్కాయి. భిన్న కూటములు, వైరుద్ధ్యాలు, ప్రతిపక్షాల బలహీనత కలిసి వచ్చి సునాయాసంగా విజయం వచ్చి పడింది. నరేంద్ర మోదీ నాయకత్వానికి, బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రజలకు కనిపించలేదు. ప్రస్తుతం విపక్షాలు ఏదో ఒక కూటమి కట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తమ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ప్రాంతీయ పార్టీల నాయకుల్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో మోదీ ప్రతిష్ట కూడా దిగజారడం మొదలైంది. అందువల్లనే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఇచ్చిన రేటింగ గ్రాప్ బీజేపీని పూర్తిగా సంతృప్తి పరచలేకపోతోంది. ఆదరణ తగ్గుతోంది. గ్రాఫ్ తీవ్రంగా పడిపోతోందనే సంకేతాలను రాజకీయ ఇంటిలిజెన్స్ ఆధారంగా క్రోడీకరించి మరీ నిగ్గు తేల్చింది. ప్రభుత్వం ముందు పాజిటివ్ అంశాలు కనిపించడం లేదు. ఎన్నికల గడువు మరో మూడేళ్లుంది. పూర్తిగా మోదీనే నమ్ముకుని బీజేపీ ముందుకు వెళ్లుతోంది. ఆయనకు పాపులారిటీ ఇంకా తగ్గితే ఎన్నికల గండం గట్టెక్కడం కష్టమేనని అంతర్గతంగా కమలనాథులు సైతం అంగీకరిస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News