కోర్టులు కాదు.. వెనుకంజ వేయరా.. కారణం ఇదేనా?

రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అల్టిమేట్ గా ప్రజలకే భయపడతాయి. న్యాయస్థానాలు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం ఉన్నట్లు ప్రకటిస్తుంటాయి. కానీ సాధ్యమైనన్ని [more]

Update: 2020-08-27 15:30 GMT

రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అల్టిమేట్ గా ప్రజలకే భయపడతాయి. న్యాయస్థానాలు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం ఉన్నట్లు ప్రకటిస్తుంటాయి. కానీ సాధ్యమైనన్ని సార్లు వాటి తీర్పులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటాయి. తమకు వ్యతిరేకంగా ఉండి తప్పని సరైతే పాక్షికంగా అమలు చేసి మిన్నకుండిపోతాయి. ప్రజల్లో ఆదరణ, ప్రచారం పెరిగే అవకాశముంటే తాము విలువలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ రాజ్యాంగ వ్యవస్థల నిర్ణయాలను గౌరవిస్తుంటాయి. లేదంటే వాటినీ త్రుణీకరిస్తుంటాయి. ఇదంతా సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే చదివిందనుకోవచ్చు. న్యాయవ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలతో నిరంతరం సాగుతున్న పోరాటం లో ఇదే విషయం స్పష్టమవుతుంది. నిజానికి బహిరంగంగా చూసిన వారెవరికైనా ఎందుకీ రోజువారీ తంటా అనిపిస్తుంది. కానీ రాజకీయ పార్టీలు ఇతర వ్యవస్థలతో పోరాటం నష్టం చేస్తుందని అనుకోవు. ప్రజల దృష్టి కోణం లో పార్టీకి డ్యామేజీ జరుగుతుందని భావించినప్పుడు మాత్రమే పార్టీలు, ప్రభుత్వం వెనక్కి తగ్గుతాయి.

అదే బలం..బలహీనత…

ఏపీలో ప్రతిపక్ష పార్టీలు నిరంతరం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా న్యాయస్థానాల్లో 70 సార్ల వరకూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయనేది వాటి ఆరోపణ. తాజాగా మూడు రాజధానులపై సుప్రీం కోర్టు స్టే ఎత్తి వేయడానికి నిరాకరించడాన్ని సైతం ప్రతిపక్షాలు తమ విమర్శల కిట్టీలో చేర్చేసుకున్నాయి. అయినప్పటికీ సర్కారు వెనుకంజ వేసే సూచనలు కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించింది అధికార పార్టీ వైసీపీ. రాజధానిని మార్చాలనే నిర్ణయం ఎన్నికలకు ముందు వరకూ వైసీపీ కి లేదనే చెప్పాలి. అయితే అప్రతిహత విజయం సాధించడం తో మూడు ప్రాంతాల ప్రజల్లోనూ మరింత బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం పూర్తిగా అమరావతి రాజధానికి గట్టి మద్దతు లభించడం లేదు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో అధికారపక్షానికి అనుకూలంగానే ఉంది. ప్రతిపక్షం చేపట్టిన అమరావతి ఉద్యమానికి ఆయా ప్రాంతాల్లో మద్దతు ‘సమీకరించలేకపోయింది. అందుకే న్యాయస్థానాలు ఏం చెబుతున్నప్పటికీ ప్రజాభావననే ప్రామాణికంగా తీసుకొంటున్న వైసీపీకి ప్రతిపక్షాలు, కోర్టులు చేస్తున్న సూచనలు రుచించడం లేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.

ప్రతిపక్షం నిర్వీర్యం…

రాష్ట్రంలో ప్రతిపక్షం దాదాపు నిర్వీర్యం అయిపోయిందనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నివాసం ఉండకుండా హైదరాబాదులో ఉండటం ఆ పార్టీకి ఒక మైనస్ గా మారింది. హైదరాబాద్ నుంచి జరిపే వీడియో కాన్ఫరెన్సులు మొక్కుబడి గా మారాయి. ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు లభిస్తున్న స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. వైసీపీ ప్రభుత్వ లోపాలను బహిరంగ పరిచి పోరాటం చేసే చొరవ ప్రతిపక్షాల్లో లోపించింది. ఈ పరిణామం అధికారపార్టీకి కూడా నష్టదాయకమే. నిలదీసే పార్టీ లేకపోతే దీర్ఘకాలంలో తప్పులపై తప్పులు చేసి ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంది. సీట్లు కేవలం 23 మాత్రమే లభించడం, పదిశాతంపైగా అధికారపార్టీతో ఓట్ల వ్యత్యాసం ఉండటం నైతికంగా తెలుగుదేశాన్ని దెబ్బతీశాయి. పోరాట పటిమ ఆ పార్టీలో కనిపించడం లేదు. ఈ అవకాశాన్నే వైసీపీ తన బలంగా భావిస్తోంది.

కేంద్ర సహకారం…

తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినాలనేది బీజేపీ లక్ష్యం. అందుకుగాను వైసీపీ సర్కారుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. మూడు రాజధానుల అజెండాకు కేంద్రం సంపూర్ణ మద్దతును ప్రకటించినట్లే భావించాలి. కోర్టులకు దాఖలు చేసిన అఫిడవిట్లే కాదు. అధికారికంగా బీజేపీ ప్రతినిధులు సైతం రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి ఆటంకాలు లేవని చెప్పేస్తున్నారు. టీడీపీని రాజధాని సమస్య ముందు నుయ్యి వెనక గొయ్యి తరహాలో దెబ్బతీస్తోంది. ఉత్తరాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో టీడీపీని రాజకీయంగా వైసీపీ దెబ్బతీయగలిగింది. ఆయా ప్రాంతాలకు రాజధానుల ను తరలించకుండానే తెలుగుదేశం అడ్డుకొంటోందని సక్సెస్ పుల్ గా ప్రచారం చేయగలిగింది. ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితి వచ్చింది. దానికి వివరణ ఇచ్చుకోవడానికే తెలుగుదేశానికి సమయం సరిపోతుంది. అమరావతిని తమ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుగా తెలుగుదేశం భావిస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా కనీసం కృష్ణా, గుంటూరుల్లోనూ పూర్తి మద్దతు సమీకరించలేకపోయింది. ఈ మొత్తం పరిణామాలను గమనించిన తర్వాతనే వైసీపీ ముందుకు వెళుతోంది. మరోవైపు బీజేపీ కూడా టీడీపీని దెబ్బతీసి , ప్రధాన ప్రతిపక్ష స్థానం చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనిని బట్టి చూస్తే వైసీపీ, బీజేపీల స్నేహం కూడా శాశ్వతం కాదు. టీడీపీ ప్రజల్లో ఆదరణ కోల్పోయి వైసీపీతో పోరాటం చేయలేదని ప్రజలు బలంగా విశ్వసించే వరకే వీటి మైత్రి కొనసాగుతుంది. ఆ తర్వాత పరస్పరం ముఖాముఖి తలపడాల్సి వస్తుందని రెండు పార్టీలకూ తెలుసు. అందుకే ప్రజాభావననే దృష్టిలో పెట్టుకునే పార్టీలు తాత్కాలికంగా ఇతర అంశాలను విస్మరిస్తుంటాయి. ప్రజల మద్దతు ఉన్నంతవరకూ తమ పంతమే నెగ్గాలని చూస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు వైఖరి ఇందుకొక ఉదాహరణగా చెప్పుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News