లద్దాఖ్ లో అతిపెద్ద ఆపరేషన్…అంతా సిద్ధం

లద్దాఖ్… ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అదేవిధంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు గురించి తెలియని వారు కూడా ఉండరు, నడివేసవిలోనే ఎముకలు కొరికే చలి ఉంటుంది. [more]

Update: 2020-12-03 16:30 GMT

లద్దాఖ్… ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అదేవిధంగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు గురించి తెలియని వారు కూడా ఉండరు, నడివేసవిలోనే ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇక శీతాకాలంలో పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. అక్టోబరు నుంచి జనవరి వరకు పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంటుంది. రాత్రివేళల్లో పెనువేగంతో శీతల గాలులు వీస్తుంటాయి. మనిషిని నిలువునా గడ్డ కట్టించేస్తాయి. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంటుంది. శీతాకాలంలో ఇక్కడ విధి నిర్వహణ సైనికులకు కత్తిమీద సామే. అయినప్పటికీ అనుక్షణం భారత బలగాలు సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుతుంటాయి. తూర్పు లడ్డాఖ్ లో గత ఆరు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇక్కడ భారత బలగాల మోహరింపు ఎక్కువగా ఉంది. దాదాపు 50వేల మంది సైనికులు పహరా కాస్తుంటారని అంచనా. ఈ చలికాలంలో వీరందరికి తగిన వసతులు కల్పించడం క్లిష్టతరమైన కార్యక్రమమే. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీనిని ఒక సవాల్ గా తీసుకుని ముందుకు సాగింది.

అన్ని వసతులు.. అవసరాలు…..

టి-90, టి-72 ట్యాంకులు, శతఘ్నులు, పదాతిదళ పోరాట శకటాలను సరిహద్దుల్లోని చుషుల్, దెమ్ చౌక్ ప్రాంతాలకు తరలించింది. సైన్యం ధరించే శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల టన్నుల ఆహార పదార్థాలు, ఇంధనం, కమ్యూనికేషన్ సాధనాలు, విద్యుత్ హీటర్లను పంపింది. ఈ ట్యాంకులు అతి శీతల వాతావరణంలోనూ సమర్థంగా పని చేయగలవు. స్వాతంత్ర్యం అనంతరం భారత సైన్యం చేపట్టిన అతి పెద్ద ఆపరేషన్ ఇదేనని మాజీ సీనియర్ సైనికాధికారులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కఠోర వాతావరణంలో సాయుధ శకటాలను మోహరించిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం. సైనికులు ధరించే శీతల దుస్తులను ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. తీవ్ర చలిగాలులను తట్టుకునేందుకు సరికొత్త ఆవాసాలు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను భారత సేన యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. వీటికి పెద్దగా సిమెంటు, ఇసుక అవసరం లేదు. వీటిని వేగంగా వినియోగానికి సిద్ధం చేయవచ్చు. బలమైన గాలులు, చలి నుంచి రక్షించేందుకు ఈ ఆవాసాల్లో ఇన్సులేషన్ ఉంటుంది. హీటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వంటగది, మరుగుదొడ్లు వంటివి ఇందులో ఉంటాయి. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు.

దేశ రక్షణే థ్యేయంగా…..

సరైన శిక్షణ, శీతాకాలాన్ని ఎదుర్కొనే ప్రత్యేక దుస్తుల సరఫరా కారణంగా సైనికుల పోరాట సన్నద్ధత పటిష్టంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సింధు నది ప్రవహిస్తోంటోంది. నదులు దాటడం, అడ్డంకులను అధిగమించడంలో భారత సైనికులు పట్టుదలతో పనిచేస్తారు. సైనికులు కుటుంబాలకు దూరంగా, ప్రతికూల వాతావరణంలో పని చేస్తుంటారు. కఠోర పరిస్థితుల్లో పనిచేసే దళాలకు కాస్తంత ఆటవిడుపు కోసం టీవీలు, సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. సైనికులకు అధిక కేలరీలు గల పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని సైన్యాధిపతి జనరల్ ముకుంద్ మనోజ్ నరవణె దగ్గరుండి పర్యవేక్షించారు. సైనికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. భారత సైన్యం కూడా సౌకర్యాల విషయాన్ని పక్కనబెట్టి దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సైనికులకు అవసరమైన ఆయుధాలు, ఆహార పదార్థాలు సమకూర్చేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా భారత ప్రభుత్వం వెనకాడటం లేదు. దేశ ప్రజానీకం కూడా సైన్యానికి దన్నుగా నిలుస్తోంది. వారికి మానసికంగా, నైతికంగా అవసరమైన మద్దతు అందజేస్తోంది. దీంతో మనసైన్యం మరింత ఉత్సాహంగా, రెట్టించిన పట్టుదలతో పనిచేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News