ఆయన్ని వదిలేసారు..ఈయన్ని పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గత ఆరేళ్ళుగా ఓట్ల, సీట్ల రూపంలో పెద్దగా ఉనికిలో లేకపోయినా పోటీ చేస్తోంది కాబట్టి [more]

Update: 2020-02-22 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గత ఆరేళ్ళుగా ఓట్ల, సీట్ల రూపంలో పెద్దగా ఉనికిలో లేకపోయినా పోటీ చేస్తోంది కాబట్టి ఈవీఎం ల మీద ఆ సింబల్ ఉంటోంది కాబట్టి కాంగ్రెస్ ఉన్నట్లే. ఇక కాంగ్రెస్ లో ముగ్గురు నాయకులు పీసీసీ బాధ్యతలు చూస్తూంటే మరో జంబోజెట్ కార్యవర్గాన్ని కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది. ఎందరో ఉపాధ్యక్షులు, మరెందరో ప్రధాన కార్యదర్శులతో పెద్ద బాడీయే నియమించారు. జిల్లా స్థాయిలో తృతీయ శ్రేణి నాయకులు కూడా ఏకంగా పార్టీ ఉపాధ్యక్షులైపోయారు. అంటే మొత్తంగా ఉన్నవారందరికీ వెతికి మరీ పదవులు ఇచ్చేశారన్నమాట.

ఆయన లేరు….

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా రెండేళ్ళ పాటు పదవిని నిర్వహించి ఆరేళ్ళ పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కడా ఈ కమిటీల్లో కనిపించకపోవడం విశేషం. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తమ వాడు కాదనుకుని వదిలేసినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి ఇప్పటికీ టెక్నికల్ గా మా పార్టీ వారేనని నిన్నటిదాకా భజాయించిన కాంగ్రెస్ పెద్దలు ఇపుడు ఎందుకో ఆయన్ని పక్కన పెట్టారు. ఆ మాట అనడం కంటే ఆయన పైన ఆశలు వదిలేసుకున్నారనడం సబబు. మొత్తానికి చిరంజీవి ఈ విధంగా కాంగ్రెస్ బంధ విముక్తుడు అయినట్లే.

ఆశాకిరణమా….?

ఇక మరో దిగ్గజ నేత ఉన్నారు. ఆయన ప్రజలలో అతి బలవంతుడైన నేత అని కాదు కానీ మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా దిగ్గజమని చెప్పాలి. ఆయనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన నాకు ఏ పదవులు వద్దు మొర్రో అని అంటున్నా విడిచిపెట్టడంలేదు. నిజానికి ఆయనకే పీసీసీ చీఫ్ ఇస్తారని అన్నారు. ఆయన వద్దు అనేశారని టాక్ నడిచింది. ఇక ఇపుడు పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్ నాయకత్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో ఒక సభ్యునిగా, అలాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ నాయకత్వంలోని సమన్వయ కమిటీలో మెంబర్ గా రెండు చోట్లా అవకాశాలు ఇచ్చారు. నిజానికి కేంద్ర స్థాయిలో అంటే ఏఐసీసీ లెవెల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మెంబర్ గా ఉండాలనుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఈ మెంబర్ షిప్ లు చాలా చిన్న పదవులు. కానీ ఆయన్ని కాంగ్రెస్ కుటుంబంలో కలుపుకుని పోవాలని ఈ పదవులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి ఆయన మావాడేనని కాంగ్రెస్ గట్టిగా చెప్పుకుంటోంది. ఆశాకిరణంగా మారి ఈ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇకనైనా గట్టిగా పని చేస్తారా అన్నది చూడాలి

ఉనికి కోసమే…..

కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇంకా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ కమిటీ పేర్లు ఒక్కసారి చదివితే అర్ధమవుతుందని సెటైర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఏ మాత్రం బాగులేదు. నిన్నటికి నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అయిదు శాతం ఓట్లు వచ్చాయి. ఏపీలో ఆ ముచ్చట కూడా లేదు. అందులో ఉన్న వారు తొంబై శాతం పైగా వైసీపీ, టీడీపీల్లో సర్దుకున్నారు. ఇక అరకొరగా మిగిలిన వారికి సొంత ఇబ్బందుల వల్లనే వేరే వైపు చూడడం లేదని అంటారు. ఏది ఎలా ఉన్నా ఉన్నారు కాబట్టి వారంతా సారధులు అయ్యారు. ఏది ఏమైనా జాతీయ పార్టీగా ఓ నాడు ఉమ్మడి ఏపీలో వెలిగిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో పార్టీ పెద్ద పదవులు అతి సామాన్యులకు రావడం మాత్రం చెప్పుకోవడానికి ఇపుడు గొప్ప విషయమే. మరి దీంతో చేయాల్సింది ఉనికి పోరాటమే అంటున్నారు.

Tags:    

Similar News