అక్కడ కత్తులు… ఇక్కడ కరచాలనమా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు అందరి చూపూ బెంగాల్ పై మళ్లింది. వచ్చే ఏడాది ఈ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చక్రం [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు అందరి చూపూ బెంగాల్ పై మళ్లింది. వచ్చే ఏడాది ఈ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చక్రం [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు అందరి చూపూ బెంగాల్ పై మళ్లింది. వచ్చే ఏడాది ఈ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ కోల్ కతాపై కన్నేసింది. 2021లో బెంగాల్ తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో అసోంలో ఇప్పటికే పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారం కాపాడుకోవడం పార్టీకి ముఖ్యం. అదే సమయంలో తూర్పు రాష్ర్టమైన బెంగాల్ లో పాగా వేయడం లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. బీహార్ లో స్ఫూర్తిదాయకమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో బెంగాల్ లో అధికార టీఎంసీకి చుక్కలు చూపించాలని పట్టుదలతో పని చేస్తోంది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా….
కమలం సవాల్ ను ఎదుర్కొనేందుకు విపక్ష సీపీఎం, కాంగ్రెస్ కూడా కత్తులు నూరుతున్నాయి. దశాబ్దాల పాటు వైరిపక్షాలుగా కొనసాగిన ఈ రెండు పార్టీలు రేపటి ఎన్నికల్లో కలసి పోటీ చేస్తుండటం విశేషం. సిద్ధాంతాలరీత్యా ఉప్పునిప్పయిన ఈ పార్టీలు ఉమ్మడి శత్రువైన భాజపాను నిలువరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇందుకోసం పాత వైరాలను పక్కనపెట్టాయి. అదే సమయంలో కేరళలో ఈ రెండు పార్టీలు కత్తులు దూస్తున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాల కన్నా అధికార సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాయి. కమలం పార్టీ కూడా ఈ విషయాన్నే ప్రధానంగా ఎత్తి చూపనుంది. కేరళలో కత్తులు దూసే పార్టీలు కోల్ కతాలో కరచాలనాలు చేస్తున్నాయని ఎద్దేవా చేస్తోంది. ఈ విమర్శలను తిప్పి కొట్టడం సీపీఎం, కాంగ్రెస్ లకు కష్టమే అయినప్పటికీ మౌనంగానే ముందుకు సాగుతున్నాయి.
బెంగాల్ లో దెబ్బతినడంతో….
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ, 2019 నాటి లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నాయి. మొత్తం 294 స్థానాలకు 211 గెలుచుకుని మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. హస్తం పార్టీ 23, సీపీఎం 19 స్థానాలకే పరిమితమయ్యాయి. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు గాను అధికార టీఎంసీని కమలం పార్టీ 22 స్థానాల వద్దే నిలువరించింది. కమలం పార్టీ 18 చోట్ల గెలుపొంది టీఎంసీని నైతికంగా ఓడించింది. అప్పటి నుంచీ టీఎంసీని గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సీపీఎం, కాంగ్రెస్ పాత వైరాలను మరచి ఇప్పుడు చేతులు కలిపాయి.
కేరళలో మాత్రం….
అదే సమయంలో కేరళలో సీపీఎం, హస్తం పార్టీలు కత్తులు దూస్తుండటం ఆసక్తికరం. బెంగాల్ లో పొత్తులకు, కేరళలో కయ్యానికి కారణం కేవలం అధికారమే. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140కు గాను అధికార వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్ డీ ఎఫ్) 91 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) 47 సీట్లకు పరిమితమైంది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 20 సీట్లకు 19 గెలుచుకుని కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. అగ్రనేత రాహుల్ గాంధీ రాష్టంలోని వయనాడ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. సీపీఎం ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పార్టీ ఉంది. అందుకే బెంగాల్ లో పొత్తులు పెట్టుకున్నప్పటికీ కేరళలో కయ్యానికే సిద్ధమైంది. ఈ ద్వంద్వ వైఖరిని కమలం పార్టీ ఎత్తి చూపనుంది. అయినప్పటికీ సీపీఎం, హస్తం పార్టీ నోరు మెదపడం లేదు. ఈ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలు ఏ రకంగా చూస్తారన్నదే కీలక ప్రశ్న? దీనికి సమాధానం కావాలంటే మరో ఆరు మాసాలపాటు వేచి చూడక తప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్