ఇక మర్చిపోవాల్సిందేనా?

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను కష్టాలు వీడటం లేదు. ఇక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కోలుకోవడం కష్టమే. 2014లో అంటే రాష్ట్ర విభజన కారణంతో [more]

Update: 2019-09-01 09:30 GMT

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను కష్టాలు వీడటం లేదు. ఇక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కోలుకోవడం కష్టమే. 2014లో అంటే రాష్ట్ర విభజన కారణంతో కాంగ్రెస్ ఓటమి పాలయిందని భావించవచ్చు. కానీ 2019 ఎన్నికలలో ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదని తేల్చి చెప్పారు జనం. కాంగ్రెస్ వైరస్ లాంటిదని ఎప్పటికైనా పుంజుకుంటుందని ఇంకా ఆశచావని కాంగ్రెస్ నేతలు కొందరు ఉన్నప్పటికీ వారి ఆశలు మాత్రం చిగురించే అవకాశాలే లేవు.

ఈ ఎన్నికల తర్వాత….

2019 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా భూస్థాపితం చేశాయనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే గత ఎన్నికల్లో బరిలోకి దిగింది. మొత్తం 174 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కడం విశేషం. అదీ పీసీీసీ ఛీఫ్ గా రఘువీరారెడ్డి పోటీ చేసిన కల్యాణదుర్గం, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ పోటీ చేసిన శింగనమల మాత్రమే కావడం విశేషం.

పట్టించుకునే వారేరీ…?

ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క సీటు కూడా దక్కక పోవడంతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రఘువీరా రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే వారే లేరు. ఏపీలో ఇంత రాద్ధాంతం అవుతున్నప్పటికీ కాంగ్రెస్ జెండా ఎక్కడా కన్పించడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణం, ఇసుక కొరత, వరదలు వంటి విషయాల్లో ప్రజా పోరాటాలు చేయాల్సిన కాంగ్రెస్ జాడ కన్పిచడం లేదు.

రాజీనామాతో….

రఘువీరారెడ్డి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పార్టీని పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, శైలజానాధ్, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, చింతామోహన్ వంటి నేతలున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను వదిలేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా కదలికలే లేవు. దీంతో రఘువీరారెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందనే చెప్పాలి. మరి పీసీసీ చీఫ్ గా పార్టీ అధిష్టానం ఎవరినైనా అసలు నియమించే ఆలోచన ఉందో? లేదో?

Tags:    

Similar News