ట్యాగ్ తగిలిస్తామన్నా…..?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన్నది ఒకటి ఉందని ఎవరైనా భావిస్తే అది వట్టి భ్రమ అనుకోవాల్సిందే. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని దాదాపుగా అన్ని చోట్లా [more]

Update: 2019-10-03 03:30 GMT

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన్నది ఒకటి ఉందని ఎవరైనా భావిస్తే అది వట్టి భ్రమ అనుకోవాల్సిందే. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని దాదాపుగా అన్ని చోట్లా డిపాజిట్లు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా ఏ వూసూ లేకుండా ఉంది. కాంగ్రెస్ లో అరకొరగా నాయకులు మిగిలిఉన్నా వారు సైతం ఏ రకమైన చప్పుడు చేయడంలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తాను ఉండనని రఘువీరారెడ్డి రాజీనామా చేసేసి తన సొంత ఊళ్ళో వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి కొంత హడావుడి చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇపుడు గప్ చిప్ అయ్యారు. మరో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోవడంలేదు. అంతెందుకు జాతీయ స్థాయిలోనే రాహుల్ గాంధీ రాజీనామా చేశాక ఇక ఏపీలో కాంగ్రెస్ గురించి ఇపుడు ఎవరు ఆలోచిస్తారని కూడా అంటున్నారు.

కిరీటం పెడతారట…

కాంగ్రెస్ పార్టీ పిలిచి కిరీటం ఇస్తానంటే మాకొద్దు బాబోయి అంటున్నారంతా. పీసీసీ చీఫ్ అంటే ఒకప్పుడు ఎంత పేరు, ఎంత డిమాండ్. ప్రతీ వారూ ఢిల్లీకి వెళ్ళి రోజుల తరబడి లాబీయింగ్ చేసుకుంటూ తమ పేరు మీడియాలో హైలెట్ అయ్యేలా చేసుకున్న నాటి రేసులూ, ఊసులను మరచిపోగలరా ఎవరైనా, కంచుకోట లాంటి ఏపీని మంచుకోటగా మార్చేసుకుని తనకు తానే సమాధి కట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇపుడు ఎవరైనా ఉన్నారంటే వారు ఎటూ దారిలేక ఉన్నవారు, లేక రాజకీయాల పట్ల తాత్కాలికంగా వైరాగ్యం పెంచుకున్న వారు. అంతే తప్ప ఎవరూ కూడా ఇపుడు కాంగ్రెస్ ట్యాగ్ తగిలించుకుని ముందుకు రావడం లేదు. కనీసం మీడియా చర్చలకు కూడా ముఖం చూపడం లేదు. అటువంటి కాంగ్రెస్ లో పీసీసీ కిరీటం పెడతాం రండి అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ అంటూంటే ఎవరూ కూడా ముందుకురాని పరిస్థితి ఉంది.

జిల్లానేతలే దిక్కా..?

కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయి నేతలు, అగ్ర స్థాయిలో ఉన్న వారు, కాస్తో కూస్తో ఫేస్ వాల్యూ ఉన్నవారు ఎవరూ మిగలలేదు, వారంతా అటూ ఇటూ జంప్ అయిపోయారు, ఒకరిద్దరు నాయకులు ఉన్నా వారు మాకొద్దీ పీసీసీ కిరీటం అనేస్తున్నారు. దాంతో జిల్లాస్థాయి నేతలే ఆ పార్టీకి దిక్కు అవుతున్నారు. కాంగ్రెస్ లో మహిళా అధ్యక్ష పదవి చేపట్టిన సుంకర పద్మశ్రీ ఇపుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవుతారని అంటున్నారు. గోదావరి జిలాలకు చెందిన బలమైన కాపు సామాజికవర్గం మహిళ కావడంతో ఉన్నంతలో ఆవిడే బెస్ట్ ఛాయిస్ అనుకుంటున్నారుట. ఇక కేంద్ర మాజీ మంత్రి చితా మోహన్ వంటి వారు ఇస్తే చేద్దామని కూడా అనుకుంటున్నారుట. మిగిలిన వారిలో పల్లంరాజు నో అనేస్తున్నారు. మాజీ సీం కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే ఆయన వద్దనేస్తున్నారు. మొత్తానికి హస్తం పార్టీ ఒకటి ఉందని చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలని పీసీసీ కిరీటం పెడుతున్నట్లుగా ఉంది. ఒకపుడు కేరళను పాలించిన ఉమన్ చాందీ నెత్తి మీద ఇపుడు ఏపీ కాంగ్రెస్ భారం పడిందంటున్నారు.

Tags:    

Similar News