నిండా మునిగినోడికి చలేంది?

నిండా మునిగిన వాడికి చ‌లి ఉండ‌ద‌ని అంటారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది. దేశ వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితి నిండా మునిగింది. ఏ రాష్ట్రంలో [more]

Update: 2020-02-02 00:30 GMT

నిండా మునిగిన వాడికి చ‌లి ఉండ‌ద‌ని అంటారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది. దేశ వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితి నిండా మునిగింది. ఏ రాష్ట్రంలో చూసినా పార్టీ ప‌రిస్థితి దారుణంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో మ‌రింతగా దారుణ ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. మ‌రి దీనిని ప‌ట్టాలెక్కించ‌డం, పార్టీని వ‌చ్చే 2024 నాటికి అదికారంలోకి లేదా క‌నీసం ప్రతిప‌క్షంగా గౌరవ ప్రద‌మైన స్థానాల‌ను ద‌క్కించుకోవ‌డం సాధ్యమయ్యేప‌నేనా? అనేది ఇప్పుడు కీల‌కంగా మారిన ప్రశ్న. కాంగ్రెస్ సారధులుగా శైల‌జానాథ్‌, తుల‌సిరెడ్డి , మ‌స్తాన్ వ‌లీలు బాధ్యత‌లు చేప‌ట్టారు. అయితే, వీరు పార్టీని ఏ మేర‌కు ముందుకు తీసుకువెళ్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది.

నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే…

గ‌డిచిన 4 ఎన్నిక‌ల‌ను ఒక్కసారి ప‌రిశీలిస్తే.. 2004 ఉమ్మడి రాష్ట్రంలో జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో 185 సీట్లు సాధించి, అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ 38.56 శాతం ఓట్ల షేర్‌ను సాధించింది. ఇక‌, 2009 ఉమ్మడి రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 156 సీట్లతో 36.56 శాతం ఓట్ల షేర్‌ను కైవ‌సం చేసుకుంది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో హ‌వా ఒక్కసారి ప‌డిపోయింది. ఆఎన్నిక‌ల్లో ఒక్క స్థానంలోనూ విజ‌యం సాధించ‌ని కాంగ్రెస్ కేవ‌లం 2.56శాతం ఓట్ల షేర్‌ను మాత్రమే పొంది.. ఉన్నాను అని అనిపించుకుంది.

గత ఎన్నికల నాటికి…

ఇక‌, 2019 ఎన్నిక‌ల నాటికి అప్పటి కాంగ్రెస్ ఏపీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి అనేక అస్త్రాల‌ను సంధించారు. పాద‌యాత్ర చేశారు(సీమ వ‌ర‌కే), ఘ‌ర్ వాప‌సీ పిలుపునిచ్చారు. అయినాకూడా ఎవ‌రూ కూడా ముందుకు రాలేదు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా కాంగ్రెస్ ప్రభ త‌గ్గిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం 1.29శాతం ఓటు షేర్‌ను మాత్రమే పొంది ఒక్క చోట కూడా డిపాజిట్‌ను ద‌క్కించు కోలేక పోయింది.

సీనియర్లందరూ…..

2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోయినా అప్పటికి కూడా చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీలోనే ఉండ‌డంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రభావం చూపింది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత బొత్స, కోట్ల, ప‌న‌బాక‌, కోండ్రు ముర‌ళీ, వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్ లాంటి సీనియ‌ర్లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో 2019లో అస‌లు ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్ అస్త్రస‌న్యాసం చేసేసింది. ఇది జ‌రిగి ఇంకా సంవ‌త్సరం కూడా కాలేదు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సార‌ధులుగా ప‌గ్గాలు చేప‌డుతున్న ఎస్సీ, ఓసీ, మైనారిటీ వ‌ర్గాలకు చెందిన నాయ‌కులు ఏ మేర‌కు పార్టీని ముందుకు న‌డిపిస్తార‌నేది ఇప్పుడు కీల‌క ప్రశ్నగా మారింది. త్వర‌లోనే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమ‌వుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో త‌న ఓటు బ్యాంకును తిరిగి సంపాయించుకునేందుకు ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. గ‌తంలో కాంగ్రెస్‌కు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల్లో స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా ఇత‌ర పార్టీలు.. ఇంకా చెప్పాలంటే వైసీపీకి వెళ్లిపోయింది. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో ఈ కొత్త ర‌థ‌సార‌థులు కాంగ్రెస్‌ను ఎంత వ‌ర‌కు గ‌ట్టెక్కిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News