కొత్త ప్రయత్నం.. ఫలిస్తుందా? వికటిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. తమిళనాడు తరహాలోనే ఇక కాంగ్రెస్ మరో పార్టీపై ఆధారపడి సీట్ల కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆరేళ్ల [more]

Update: 2020-05-19 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. తమిళనాడు తరహాలోనే ఇక కాంగ్రెస్ మరో పార్టీపై ఆధారపడి సీట్ల కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వారే కరవయ్యారు. నేతలు అక్కడక్కడ కన్పిస్తున్నా వారు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేంత లీడర్లు కారన్నది అందరికీ తెలిసిన సత్యమే. కరోనా వైరస్ సమయంలోనూ కాంగ్రెస్ నేతలు గడప దాటి బయటకు రాకపోవడం ఆ పార్టీ దైన్య స్థితిని తెలియ జేస్తుంది.

రెండు ఎన్నికల్లో…..

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైపోయింది. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. విభజన జరిగి ఆరేళ్లు కావస్తున్నా ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై కోపం చల్లారలేదు. వరసగా రెండు ఎన్నికల్లో డిపాజిట్లు సయితం రాకపోవడానికి కారణం ఇదేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే కాంగ్రెస్ వైరస్ లాంటిదని ఎప్పటికైనా పుంజుకుంటుందన్నది ఆ పార్టీ నేతల మాట.

బలమైన పార్టీలు…

కానీ ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యం కాదు. ఇప్పటికే ఏపీలో బలమైన తెలుగుదేశం, వైసీపీలు ఉన్నాయి. అధికారాన్ని ఈ రెండు పార్టీలు పంచుకుంటాయి. భవిష‌్యత్తులో కూడా ఇంతే. కాంగ్రెస్ కనీసం అసెంబ్లీలోకి అడుగుపెడుతుందా? అన్న సందేహం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్లాలని హైకమాండ్ వద్ద ప్రస్తావన తెచ్చారట. ప్రధానంగా శైలజానాధ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన తర్వాత పొత్తతోనే భవిష్యత్తులో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని హైకమాండ్ కు నొక్కి చెబుతున్నారు.

బాబు షాడోగా…..

కానీ రాష‌్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ తో పొత్తుకు ఏ పార్టీ ప్రయత్నిస్తుందన్నదే ప్రశ్న. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను దగ్గరకు రానివ్వదు. అది అందరికీ తెలిసిందే. ఇక కొద్దో గొప్పో కాంగ్రెస్ కు ఆశలు కన్పిస్తుంది చంద్రబాబు వద్దే. చంద్రబాబు పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లే అలవాటు ఉండటంతో ఆయనతోనే కలసి నడవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బాబుకు మద్దతుగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ వాయిస్ వినపడుతుంది. నిమ్మగడ్డ అంశంలోనూ కాంగ్రెస్ హైకోర్టులో పిటీషన్ వేసింది. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఏపీకి వచ్చేసరికి నో చెప్పారు. వచ్చే ఎన్నికల్లోఅలా చేయరని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తన్నారు. ఇలా చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటారా? లేదా? అన్నది ఆయన ఇప్పుడే తేల్చరు. ఎన్నికలకు నెల ముందు మాత్రమే బాబు నిర్ణయం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ బాబు షాడోలాగానే ఈ నాలుగేళ్లు పయనించక తప్పదు.

Tags:    

Similar News