కాంగ్రెస్ ఒంటి కాలి మీద లేస్తుందే?

బీహార్ లో కాంగ్రెస్ కు ఆశలు చిగురిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో పాటు ప్రశాంత్ కిషోర్ బయటకు రావడం తమకు కలసి వచ్చే అంశంగా [more]

Update: 2020-03-18 17:30 GMT

బీహార్ లో కాంగ్రెస్ కు ఆశలు చిగురిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో పాటు ప్రశాంత్ కిషోర్ బయటకు రావడం తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో తలమునకలై ఉన్నారు. బీజేపీ, జేడీయూలకు వ్యతిరేకంగా చిన్నా చితకా పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్న నిర్ణయంతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ మినహా అన్ని పార్టీల నేతలను ఆయన ఇప్పటికే కలుసుకున్నారు.

ఆర్జేడీ బలంగా ఉన్నా…..

బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన పార్టీ గత ఎన్నికల్లోనూ విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. మహాగడ్బంధన్ పేరిట నాడు ఏర్పడిన కూటమికి 178 స్థానాలు దక్కాయి. అందులో 78 సీట్లను ఆర్జేడీయే సాధించింది. కాంగ్రెస్ 28 సీట్లు దక్కించుకుంది. అయితే కూటమి పార్టీల కోరిక మేరకు ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ కు ఇచ్చేందుకు అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు.

ఒంటరిగా పోటీ చేసే….

లాలూ ప్రసాద్ యాదవ్ పశుదాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోనే ఈ దఫా ఎన్నికలకు పార్టీ వెళ్లనుంది. అయితే ఈ సారి కాంగ్రెస్ సీట్ల విషయంలో రాజీ పడేందుకు అంగీకరించడం లేదు. తమకు అధిక సీట్లు కావాలని ఆర్జేడీపై ఇప్పటి నుంచే ఒత్తిడి తేవడం ప్రారంభించింది. ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. అలా పోటీ చేస్తే నష్టపోయే తొలి పార్టీ అదే అవుతుంది. అందుకే ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు అవసరం.

ఇప్పటి నుంచే డిమాండ్లు….

దీనిని అవకాశంగా మలచుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే బీహార్ కాంగ్రెస్ నేతలు గొంతు పెద్దది చేస్తున్నారు. తాము గతం కంటే బలంగా ఉన్నామని, అధిక స్థానాలను ఇవ్వాల్సిందేనని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఈసారి సీట్ల విషయంలో రాజీ పడేది లేదని, పార్లమెంటు ఎన్నికల మాదిరి సీట్ల సర్దుబాటు ఉంటే అంగీకరించబోమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఈసారి కాంగ్రెస్ కు అధిక స్థానాలను ఇవ్వాల్సిన పరిస్థితి ఆర్జేడీకి ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదురుస్తారంటున్నారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News