చాప చుట్టేసిందిలా..!

కాంగ్రెస్ ఇక కోలుకోలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా పడకేసింది. దేశ వ్యాప్తంగా పెద్దగా కోలుకోకున్నా కనీసం దేశ రాజధాని ఢిల్లీలోనైనా కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తుందనుకున్నప్పటికీ [more]

Update: 2020-02-11 18:29 GMT

కాంగ్రెస్ ఇక కోలుకోలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా పడకేసింది. దేశ వ్యాప్తంగా పెద్దగా కోలుకోకున్నా కనీసం దేశ రాజధాని ఢిల్లీలోనైనా కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తుందనుకున్నప్పటికీ అసలు సోదిలో లేకుండా పోయింది. ఢిల్లీ ప్రజలు గతంలో మూడు సార్లు గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జీరో రిజల్ట్ తో భంగపడటం చూస్తే ఇక కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో చాప చుట్టేసినట్లేనని చెప్పక తప్పదు.

కనీస ప్రభావం…..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. ఒక్క చాందినీ చౌక్ లో మాత్రం గెలుపోటముల మధ్య ఊగిసలాడింది. 2015 ఎన్నికల్లోనూ ఇదే రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ జాగ్రత్త పడిన దాఖాలాలు లేవు. దీనికి తోడు నాయకత్వం వహించే వారు లేరు. షీలా దీక్షిత్ మరణంతో కాంగ్రెస్ ఇక్కడ మరింత కుంగి పోయిందనే చెప్పాలి. ఉన్న నలుగురు నేతలు నాలుగు దిక్కులుగా మారి కాంగ్రెస్ ను పట్టించుకోలేదు.

ఇద్దరూ మొక్కుబడిగా….

ఇక రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఏదో ప్రచారం చేశామంటే చేశామని తేల్చారు. అతి తక్కువ రోడ్ షోల్లో వీరిద్దరూ పాల్గొన్నారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో ప్రచారంలో పాల్గొనలేకపోయారు. వార్ రూమ్ లో వ్యూహం రచించలేదు. దీనికి కారణం ఓటమికి ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్లే కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో కన్పించింది. సీఏఏ, ఎన్సార్సీ వంటి విషయాలు, జామియా యూనివర్సిటీ ఉదంతం తమను గట్టెక్కిస్తాయని నమ్మారే తప్పించి ఏమాత్రం కాంగ్రెస్ నేతలు శ్రమించలేదు.

కనీస ప్రయత్నమూ…..

ఫలితంగా దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. నిజానికి నామినేషన్ల సమయంలోనే కాంగ్రెస్ చేతులెత్తేసిందన్న వార్తలు వచ్చాయి. బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపారన్న విమర్శలు వచ్చాయి. తమ ఓటమి దాదాపు ఖరారు కావడంతో బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ వీక్ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఇది భవిష్యత్తులో పార్టీ మరింత దిగజారడానికి కారణమవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కనీసం రెండు, మూడు స్థానాలను గెలుచుకుందామన్న ప్రయత్నమూ చేయకపోవడం విచారకరం. కేవలం 4.27 శాతం ఓటు షేర్ ను సాధించింది. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ చాపచుట్టేసినట్లేనని చెప్పాల్సిందే.

Tags:    

Similar News