పీల్చి పిప్పి చేస్తున్నా… సరే వారిని వదలరా?
ఒకనాడు చెయ్యెత్తి జైకొట్టిన పార్టీ ఈరోజున సొంత పార్టీ అధికారంలో ఉన్నచోట్ల సైతం ఉసూరుమంటోంది. అస్తవ్యస్త పరిస్థితులతో పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతోంది. అధిష్టానానికే దిశానిర్దేశం కరవైంది. [more]
ఒకనాడు చెయ్యెత్తి జైకొట్టిన పార్టీ ఈరోజున సొంత పార్టీ అధికారంలో ఉన్నచోట్ల సైతం ఉసూరుమంటోంది. అస్తవ్యస్త పరిస్థితులతో పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతోంది. అధిష్టానానికే దిశానిర్దేశం కరవైంది. [more]
ఒకనాడు చెయ్యెత్తి జైకొట్టిన పార్టీ ఈరోజున సొంత పార్టీ అధికారంలో ఉన్నచోట్ల సైతం ఉసూరుమంటోంది. అస్తవ్యస్త పరిస్థితులతో పార్టీ భవిష్యత్తును పణంగా పెడుతోంది. అధిష్టానానికే దిశానిర్దేశం కరవైంది. సిండికేట్ వలలో చిక్కుకుని విలవిలాడుతోంది. వృద్ధజంబూకాల్లాంటి నేతలు పార్టీ జవసత్తువలను పీల్చి పిప్పిచేస్తున్నారు. రాజకీయ నైపుణ్యం కొరవడిన అగ్రనాయకులు పార్టీని గాలికి వదిలేసినట్లే కనిపిస్తోంది. మొత్తమ్మీద కాంగ్రెసు పార్టీ దుస్థితి మధ్యప్రదేశ్ ఉదంతంతో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు సొంత ఏలుబడిలో ఉన్న పెద్ద రాష్ట్రం చేజారిపోయినట్లే. దీనికి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పార్టీ నాయకత్వమే బాధ్యత వహించాలి. బీజేపీ తన దూకుడు విధానాలతో ప్రజలకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు కు పరిస్థితులు కలిసి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ అంతర్గత వర్గ విభేదాలు, ముఠాలతో అవకాశాలను పార్టీ చేజేతులారా దూరం చేసుకుంటోంది.
పెద్దల కుంపటి…
ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెసులో ఎదిగిన ఆనాటి నాయకులు ఇప్పుడు పార్టీకి పెద్దభారంగా మారిపోయారు. స్వాతంత్ర్యానంతర కాలంలోని తొలితరం విలువలు లేవు. త్యాగబుద్ధి లేదు. అధికార దాహం , స్వార్థ బుద్ధితో కూడిన నాయకులు పార్టీని పట్టి పీడిస్తున్నారు. 1996 తర్వాత ఎనిమిదేళ్ల పాటు పార్టీ అధికారానికి దూరమైంది. అయినా పార్టీ క్యాడర్ చెదిరిపోలేదు. 2004 నుంచి పదేళ్లపాటు అధికారం చెలాయించి చాలా రాష్ట్రాలను తిరిగి కైవసం చేసుకోగలిగింది. పార్టీ పునర్నిర్మాణానికి, యువతరం పాత్ర పెంచడానికి కృషి చేయకుండా పాత తరం నాయకులు అడ్డుతగులుతూ వచ్చారు. కేంద్ర నాయకత్వంలోరాహుల్ గాంధీని వారసునిగా ఒప్పుకునే వృద్ధతరం రాష్ట్రాల్లో మాత్రం తమ పెత్తనమే చెల్లుబాటు కావాలని భీష్మించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా పార్టీ బలపడాల్సిన దశలో బలహీనపడింది. ఈ అవకాశాన్నివినియోగించుకుని బీజేపీ కొత్త నాయకత్వాన్ని తెరపైకి తెచ్చి విజయం సాధించింది. ఎల్ కే అద్వానీ వంటి పార్టీ మూల పురుషులను సైతం పక్కన పెట్టింది. చంద్రబాబు, మమత వంటి ప్రాంతీయ పార్టీ నాయకులతో అద్వానీకి ఉన్న సంబంధాల రీత్యా ప్రభుత్వ సైద్ధాంతిక అజెండా అమలుకు ఆయన అడ్డుగా మారతారని పార్టీలోని కొత్త నాయకత్వం భావించింది. అందుకే రాష్ట్రపతి వంటి ప్రతిష్ఠాత్మక పదవిని సైతం ఆయనకు ఆఫర్ చేయకుండా నిరాకరించింది. మంచి చెడుల సంగతి పక్కనపెట్టి పార్టీ విషయాల్లో నిష్కర్షగా ఉండాలనే నియమంతో బీజేపీ దేశంలో బలపడుతోంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. కాంగ్రెసులో ఈ లక్షణం లోపించింది.
అధిష్ఠానం నిస్సహాయత…
కాంగ్రెసు పార్టీలో జాతీయ నాయకత్వం నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఏడెనిమిదిసార్లు పార్లమెంటు సభ్యులుగా, మూడు నాలుగు సార్లు కేంద్రమంత్రులుగా, రెండు మూడుసార్లు ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా చేసిన వారు ఇంకా తమకు పదవులు కావాలని వెంపర్లాడుతున్నారు. అధిష్ఠానానికి ఊపిరి సలపనివ్వడం లేదు. బెదిరిస్తున్నారు. దేశ రాజకీయాలు, నాయకుల వ్యక్తిత్వ శైలిపై సోనియాగాంధీకి పూర్తి అవగాహన ఏర్పడలేదు. అహ్మద్ పటేల్, గులాం నబి అజాద్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి కొంతమంది సలహాదారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా పార్టీలో కొత్తదనం లేకుండా పోయింది. మూసపోత ధోరణులతో పాత పేచీలనే కొనసాగిస్తున్నారు. మైనారిటీల పట్ల పక్షపాతం, బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడం, రాష్ట్రాల్లో ప్రజల ఆకాంక్షల పట్ల అవగాహన లేకపోవడం కాంగ్రెసును ఓటర్లకు దూరం చేస్తున్నాయి. ఎంతగానో ఎదురీది విజయం సాధించిన రాష్ట్రాల్లో సైతం కాంగ్రెసు తన అధికారాన్ని కాపాడుకోలేకపోతోంది. అధిష్ఠానానికి జ్యోతిరాదిత్య సింధియా అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ పార్టీ అగ్రనాయకత్వం పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుత దుస్థితి తలెత్తిందని నిజమైన కాంగ్రెసు కార్యకర్తలు సైతం అంగీకరిస్తున్నారు.
భవిష్యత్ పై భయాందోళనలు…
జ్యోతిరాదిత్య సింధియా జనాకర్షణ కలిగిన నాయకుడు. మధ్యప్రదేశ్ ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి. 2018లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన వారిలో ముఖ్యుడు. యువతరం ప్రతినిధి. ఆ రాష్ట్రంలో బొటాబొటి బోర్డర్ లోనే అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెసు పార్టీ . ఆ నిజాన్ని గుర్తించ నిరాకరించిన పాత తరం నాయకులు కమలనాథ్, దిగ్విజయ్ సింగ్ లు కలసిగట్టుగా జ్యోతిరాదిత్య వర్గానికి రాష్ట్రంలో తగినంత ప్రాముఖ్యం లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఫలితంగానే తాజా తిరుగుబాటును చూడాలి. దశాబ్దాల తరబడి కీలక పదవులు అనుభవించిన నాయకులు యువతరానికి పగ్గాలు అప్పగించి సలహాలు, సూచనలకు పరిమితం అయితే మంచిది. భారతీయ జనతాపార్టీలో ఇందుకోసమే మార్గదర్శక్ మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరహా ఏర్పాటు కాంగ్రెసులో సైతం అవసరమనేది ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్న సత్యం.
రాజకీయ అవసర వాదం…
జ్యోతిరాదిత్య సింధియా స్వచ్ఛపురుషుడని సర్టిఫికెట్ ఇవ్వలేం. కానీ నాయకుడిగా పార్టీలో తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. ఆ అవకాశం కాంగ్రెసు ఇవ్వలేదు. అసంత్రుప్తితో రగిలిపోయాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. అటు బీజేపీ, ఇటు జ్యోతిరాదిత్య సింధియా వర్గం తమ అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో భాగంగానే చేతులు కలిపాయి. ఇది అవకాశవాదమే కావచ్చు. కానీ రాజకీయ అవసరం. అదే కాంగ్రెసు పొయ్యి మీద అన్నం కుండను దింపే చాకచక్యం తెలియక పగలగొట్టుకుంది. అధికారాన్ని నేలపాలు చేసుకుంటోంది. పరిస్థితులు సజావుగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కష్టాలు, సంక్షోభంలో ఉన్నప్పుడే నాయకత్వ నైపుణ్యం బయటపడుతుంది. కాంగ్రెసులో ఆ తెలివిడి కొరవడింది. భవిష్యత్తు పై పార్టీలో యువనాయకత్వానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అగ్రనాయకత్వంపై ఉంది. ఇప్పటికైనా ఆ దిశలో చర్యలకు పూనుకోకుండా ఉదాసీనత కనబరిస్తే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం.
-ఎడిటోరియల్ డెస్క్