బేల చూపులేనా?

మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూసిన తరువాత ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అన్న పాత తెలుగు సామేత గుర్తుకురాకమానదు. వై.బి.చవాన్, ఎస్పీ చవాన్, వసంత్ [more]

Update: 2019-10-01 16:30 GMT

మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూసిన తరువాత ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అన్న పాత తెలుగు సామేత గుర్తుకురాకమానదు. వై.బి.చవాన్, ఎస్పీ చవాన్, వసంత్ దాదా పాటిల్, ఏ.ఆర్. అంతూలే, విలాన్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండే వంటి దిగ్గజాలు, ప్రముఖులు పనిచేసిన రాష్ట్రంలో ఇప్పుడు పార్టీని నడిపే సమర్థ నాయకుడే కరువయ్యారు. 1999 నుంచి 2014 వరకు ఏక ధాటిగా పదిహేనేళ్లుగా ( మూడు దఫాలు) మహారాష్ట్రపై మూడు రంగుల జెండా ఎగురవేసిన హస్తం పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక బేల చూపులు చూస్తోంది. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. శరద్ పవార్ నేతృత్వంలోని ఆ పార్టీ ఎన్నికలకు ముందే దాదాపు చేతులెత్తేసింది. మరాఠా యోధుడు, మరాఠా దిగ్గజంగా పేరుగాంచిన శరద్ పవార్ హవా ప్రస్తుత్తం నడవటం లేదు. ఈ పార్టీని వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. మొత్తానికి అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీకి వలసలతో తలబొప్పి కట్టింది.

విడివిడిగా పోటీ చేసి…..

1999 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాలను విజయవంతంగా నడిపన కాంగ్రెస్, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి చావు దెబ్బతిన్నాయి. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 288 స్థానాలకు గాను ఈ సారి చెరి 125 స్థానాల్లో పోటీ చేయాలని పార్టీలు కూడా నిర్ణయించాయి. మిగిలిన 38 స్థానాలను తమ మిత్రపక్షానికి కేటాయించనున్నాయి.

25 మందికి పైగానే….

ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ ఇప్పటి దాకా కొనసాగిన వలసలు రెండు పార్టీల అస్థిత్వాన్ని దెబ్బతీశాయి. గత రెండు మూడు నెలలుగా కొనసాగిన ఫిరాయింపులతో రెండు పార్టీలు బేజారెత్తాయి. రెండు పార్టీల నుంచి దాదాపు 25 మందికి పైగా ఎమ్మెల్యే లు బీజేపీ, శివసేనల్లో చేరడం పెద్దదెబ్బ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్, నవీ ముంబయికి చెందిన ఎన్సీపీ దిగ్గజం గణేష్ నాయక్ బీజేపీలో చేరారు. ఇది రెండు పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బ. పాటిల్ పూణే జిల్లాలోని ఇందాపూర్ శాసనసభ నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2014 వరకు మూడు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన దిగ్గజం. 1995, 1999, 2004 లో ఇండిపెండెంట్ గా ఎన్నికయ్యారు. 2009 లో కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేశారు. 1995 లో బీజేపీ, శివసేన సంకీర్ణ సర్కార్ కు మద్దతు తెలిపి, మంత్రి వర్గంలో చేరారు. క్షేత్ర స్థాయిలో పట్టున్న పాటిల్ నిష్ర్కమణ హస్తం పార్టీకి శరాఘాతం వంటిదే. ప్రస్తుతం శివసేన ప్రాతినిధ్యం వశిస్తున్న ఇందాపూర్ స్థానాన్ని పాటిల్ కు కేటాయించేందుకు బీజేపీ సుముఖంగా ఉంది.

పట్టున్న నేతలు కూడా…

నవీ ముంబయిలో మంచి పట్టున్న గణేష్ నాయక్ ఎన్సీపీ వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు ఐరోలి ఎమ్మెల్యే సందీప్ గత నెలలోనే బీజేపీలో చేరారు. గణేష్ నాయక్ కుంటుంబ ఏళ్లతరబడి నవీ ముంబయిని ఏలుతోంది. నాయక్ 15 ఏళ్లపాటు మంత్రిగా పనిచేశారు. ఆయన మరో కుమారుడు 2009లో థానే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నవీ ముంబయికి చెందిన 55 మంది ఎన్సీపీ కార్పొరేటర్లు, నాయకులతో పాటు బీజేపీలో చేరారు. దీంతో నవీ ముంబయి నగర పాలక సంస్థ కమలం పార్టీ పరమైంది. అయితే నవీ ముంబయి ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే మందమహాత్రే, నాయక్ బద్ద శత్రువులు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కమలం పార్టీకి అంత తేలిక కాదు. నాయక్ కుమారుడు సందీప్ నాయక్ ఈ ఏడాది జులైలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు 20 మంది నాయకులు బీజేపీ , శివసేనల్లో చేరడం గమనార్హం. ఎన్సీపీ, కాంగ్రెస్ కు చెందిన ఎంతోమంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే తాము ఆచితూచి వ్యవమరిస్తున్నామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి మాధవ్ భండారీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడం, అదే సమయంలో బీజేపీ బలోపేతం అవుతుండడంతో ఆ ప్రాంత నాయకులు తమ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. 48 లోక్ సభ స్థానాలకు గాను ఒక్క నాందేడ్ ను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది.

పవార్ సన్నిహితులు కూడా….

ఎన్సీపీకి చెందిన సతారా లోక్ సభ సభ్యుడు ఉదయాన్ రాజ్ భోస్లే ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం పార్టీలో చేరారు. ఆయన సమీప బంధువు అయి సతారా ఎమ్మెల్యే షివేంద్ర సింగ్ భోసల్ కూడా ఎన్సీపీని వీడి కమలం గూటికి చేరారు. ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు పాండురంగా బరోర్, అవధూత్ టిట్కర్, అవదూత్ తంజి , మాజీ ఎమ్మెల్సీ అనిల్ టట్కర్, దిలీప్ సోపాల్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే న్యాయకత్వంలోని శివసేనలో చేరారు. పవార్ కు సన్నిహితులుగా పేరుగాంచిన మాజీ మంత్రులు సచిన్ అహిర్, మధుకర్ పిచడ్ శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎన్సీపీ మాజీ ఎంపీలు ధనుంజయ్ మహాడిక్, సంజీవ్ నాయక్ లు కమల ప్రవేశం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్మల గవిట్, బావు సాహెబ్ కంచలే, అబ్దుల్ సత్తార్ శివసేనలో చేరగా కాళిదాస్ కొలంబ్కర్, జయకుమార్ గోరె, హర్షవర్థన్ పాటిల్ కమలం కండువా కప్పుకున్నారు. ముంబయి నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కృపా శంకర్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. బహుజన్ వికాస్ అగధి పార్టీ ఎమ్మెల్యే విలాస్ టరే శివసేన లో చేరారు. ఫిరాయింపులు నష్టం కలిగించబోవని, ఇలాంటి ఆటుపోట్లు గతంలో ఎన్నో ఎదుర్కొందని, సంస్థాగతంగా పటిష్టమైన పార్టీ ఈ సమస్యలను అధిగమించగలదని హస్తం పార్టీ పైకి బింకం ప్రదర్శిస్తోంది. అయినప్పటికీ ఈసారి మహారాష్ట్ర గండం గట్టెక్కడం అంత తేలిక కాదని హస్తం పార్టీ లోలోన ఆందోళన చెందుతోంది. మరాఠా దిగ్గజం పవార్ సైతం ఇదే ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News