కేసీఆర్ ఇలాకాలో ఇలా చేస్తే ఇక అంతేగా?
ఆ జిల్లాలో టీఆర్ఎస్ కు చెందిన మహామహానేతలున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. ఇక ఆయన మేనల్లుడు హరీశ్ రావు మెదక్ [more]
ఆ జిల్లాలో టీఆర్ఎస్ కు చెందిన మహామహానేతలున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. ఇక ఆయన మేనల్లుడు హరీశ్ రావు మెదక్ [more]
ఆ జిల్లాలో టీఆర్ఎస్ కు చెందిన మహామహానేతలున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. ఇక ఆయన మేనల్లుడు హరీశ్ రావు మెదక్ జిల్లాలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకుంటారు. బలమైన నాయకత్వం టీఆర్ఎస్ కు ఉంది. అలాంటి జిల్లాలో కాంగ్రెస్ ఎలా ఉండాలి. కానీ కాంగ్రెస్ ఈ జిల్లాలో పూర్తిగా చేతులెత్తేసిందనే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా మెదక్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నది వాస్తవం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…..
వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా డీలా పడింది. అయితే మిగిలిన జిల్లాల్లో కొంత మెరుగ్గా ఉంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు అమలు చేయడానికి నేతలున్నారు. కానీ మెదక్ జిల్లాలో నేతలున్నా పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా మొన్నటి వరకూ సునీతా లక్ష్మారెడ్డి ఉండేవారు. అయితే ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మెదక్ లో ముగ్గురిని నియమించింది. వారి పనితీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా…..
సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సిద్ధిపేట జిల్లాకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సంగారెడ్డికి నిర్మల జగ్గారెడ్డి, మెదక్ అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డిలను నియమించింది. అయితే ఈ ముగ్గురు తమ జిల్లాల్లో పార్టీని పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి నివాసం ఉండేది కూకట్ పల్లిలో. ఆయన అధ్యక్షుడయిన తర్వాత ఇంతవరకూ కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
కార్యకర్తలకు దొరకకుండా…
ఇటీవల డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేదు. ఇక సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్ కే పరిమితమయ్యారంటున్నారు. తనకు సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎవరూ సహకరించడం లేదని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళతారన్న విమర్శలున్నాయి. మొత్తం మీద కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పడకేసిందనే చెప్పాలి. మరి మెదక్ లో కాంగ్రెస్ కు మంచిరోజులు ఎప్పుడొస్తాయన్నది ఎప్పటీకీ చెప్పలేమంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.