కాంగ్రెస్ ను ఇక క్లోజ్ చేయాల్సిందేనా?

అవును ఇప్పుడు ఇదే మాట ప్రతి కాంగ్రెస్ నేత నోట విన్పిస్తున్న మాట. జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ ను తెలంగాణలో నేతలే చంపారో? లేక [more]

Update: 2021-03-31 09:30 GMT

అవును ఇప్పుడు ఇదే మాట ప్రతి కాంగ్రెస్ నేత నోట విన్పిస్తున్న మాట. జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ ను తెలంగాణలో నేతలే చంపారో? లేక అధినాయకత్వమే హత్య చేసిందో తెలియదు కాని కాంగ్రెస్ పార్టీకి ఇక తెలంగాణలో నూకలు చెల్లినట్లేనన్నది వాస్తవం. ఏ ఫలితం వచ్చినా కాంగ్రెస్ కనీసం రెండో స్థానంలోనూ నిలవకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ పార్టీ దుస్థితికి దర్పణం పడుతుంది. జేసీ దివాకర్ రెడ్డి అన్నదాంట్లో తప్పేముందన్న ప్రశ్నలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. ఎవరైనా అంటే రోషం వస్తుంది కాని చేసే పనులు ఎలా ఉన్నాయి?

వరస ఓటములు….

మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక తాజాగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎక్కడ ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కొద్దో గొప్పో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి పార్టీ గుర్తు ఉందనిపించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానాన్ని చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ అసలు పోటీలో ఉన్నారా? అని అనిపించింది.

నాయకుల సమన్వయ లేమి….

ఈ రెండు ఎమ్మెల్సీల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థిితిని చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికే రాములు నాయక్ తనకు నేతలెవ్వరూ సహకరించలేదని ధ్వజమెత్తారు. ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన నేతలందరూ కోదండరామ్ కు మద్దతిచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించడం కూడా ఘోర ఓటమికి కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ చెబుతున్నారు.

పార్టీని వీడుతున్న నేతలు…..

దీంతో పాటు మున్ముందు కాంగ్రెస్ ను వీడే నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశముంది. ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సయితం పార్టీని వీడే అవకాశముందంటున్నారు. కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్న కారణంగానే నేతలు, క్యాడర్ ఇతర పార్టీలవైపు మళ్లుతుంది. కనీసం బీజేపీని నిలువరించి, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందంటే ఇక క్లోజ్ చేయడమే బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక్కటే కాంగ్రెస్ కు ఆశాజనకంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News