స్టయిల్ మార్చినా…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వాస్తవం అర్థమయినట్లుంది. ఐక్యంగా లేకుంటే పార్టీ ఇక కోలుకోలేదని భావించిన అధినాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-09-02 00:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వాస్తవం అర్థమయినట్లుంది. ఐక్యంగా లేకుంటే పార్టీ ఇక కోలుకోలేదని భావించిన అధినాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇన్ ఛార్జి కుంతియా తో చర్చించారు. కుంతియా కూడా రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతలు తనకు చేసిన ఫిర్యాదులను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో పని విభజన చేసి వారికి కొంత పని కల్పిస్తే విభేదాలు తగ్గుముఖం పడతాయని హైకమాండ్ అంచనా వేసింది.

ఎవరి గోల వారిదే…..

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరి గ్రూపు వారిదే. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడతారు. ముఖ్యమైన అంశాలపై ఎవరు ఏం మాట్లాడాలో కూడా నిర్దిష్టమైన ప్రణాళిక ఉండదు. సరైన హోం వర్క్ చేయరన్నది అందరికీ తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు నవ్వుల పాలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దృష్టికి కుంతియా ఈ సమస్యను తీసుకెళ్లారు. పీసీసీ ని ప్రక్షాళన చేసినా పెద్దగా ఫలితం ఉండదని, ముందు ఐక్యత నేతల్లో కల్పించాలని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.

పని విభజన చేసి…..

దీంతో నేతలకు పనివిభజన చేశారు. కొందరిని బృందాలుగా విభజించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీంకి నీటిపారుదల అంశాన్ని అప్పగించారు. అలాగే రేవంత్ రెడ్డికి విద్యుత్తు, భూసేకరణ కేటాయింపుల అంశాన్ని కేటాయించారు. ఇక సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి చట్టపరమైన అంశాలను కట్టబెట్టారు. భట్టి విక్రమార్కకు ఆరోగ్యం, విద్య వంటి అంశాలను చూడాలని కోరారు. ఇలా అంశాల వారీగా పని విభజన చేయడంతో వారు ఆ సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకుని, హోం వర్క్ చేసేందుకు అవకాశముంటుంది. అంతేకాకుండా తలా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ ఒకే ఆరోపణ అధికార పార్టీపై చేసినట్లవుతుంది.

అందుకే ఐక్యంగా….

ఈ కారణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, రేవంత్ రెడ్డి విద్యుత్తు అంశాలపై అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత నదికి అందరూ కలసి కట్టుగా వెళ్లడం ఐక్యతకు నిదర్శనమంటున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఐక్యంగా అడుగులు వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. స్టయిల్ మార్చినా కాంగ్రెస్ అనుకున్న రేంజ్ లో ముందుకు వెళ్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News