ట్రబుల్ షూటర్స్ లేరా?

కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వం వృద్ధతరం నేతలపై కన్నెర్ర చేస్తుంది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుండాలి. అప్పుడే ఆ పార్టీ మనగలుగుతుంది. కానీ కాంగ్రెస్ లో వృద్థతరం [more]

Update: 2020-07-18 17:30 GMT

కాంగ్రెస్ పార్టీలో యువనాయకత్వం వృద్ధతరం నేతలపై కన్నెర్ర చేస్తుంది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుండాలి. అప్పుడే ఆ పార్టీ మనగలుగుతుంది. కానీ కాంగ్రెస్ లో వృద్థతరం నేతలు పార్టీని పట్టుకుని వీడటం లేదు. పైగా వారే పార్టీని శాసిస్తున్నారు. ఇందిరాగాంధీ లాంటి నేతనే సీనియర్ నేతలు ముప్పుతిప్పలు పెట్టారు. తాము ముందుండి నడిపించాలను కున్నారు. దీంతో ఆమె అంగీకరించకుండా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇందిరా గాంధీకే కాంగ్రెస్ లో ఈ తిప్పలు తప్పలేదు.

వరసగా వీడుతుండటం….

నిజానికి రాహుల్ నాయకత్వం ఉంటే యువ నేతలు ఆగేవారేమో. కానీ సీనియర్ నేతలే రాహుల్ గాంధీకి సయితం విసుగుపుట్టించేలా చేశారు. మొన్న జ్యోతిరాదిత్య సింధియా, నేడు సచిన్ పైలెట్. రేపు ఎవరో? అన్నట్లుగా తయారయింది కాంగ్రెస్ పరిస్థితి. సీనియర్ నేతలు పదవులు వదలడం లేదు. యువనేతలు పదవుల కోసం వెయిట్ చేయడం లేదు. ఫలితమే కాంగ్రెస్ కు అనేక రాష్ట్రాల్లో ఇబ్బందిగా మారుతుంది.

ఎన్నికలకు ముందు వాడేసి…..

నిజానికి జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ సేవలను ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాగానే వాడుకుంది. కానీ అధికారంలోకి రాగానే కరివేపాకులా తీసిపారేసింది. అయితే వీరు పార్టీలో కొనసాగాలనుకున్నా తాము నమ్ముకున్న నేత రాహుల్ గాంధీ కాడిపడేశారు. దీంతో వారు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ అనే వారు ఇప్పుడు కన్పించడం లేదు.

ప్రణబ్ లాంటి వారేరీ?

గతంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్లు నేరుగా దిగకపోయినా దిశానిర్దేశం చేసి సంక్షోభం నుంచి బయటపడేసే వారు. గులాం నబీ ఆజాద్ వంటి నేతలు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో స్వయంగా ప్రియాంక, రాహుల్ గాంధీలే దిగాల్సి వస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ కు అర్జంట్ గా ఒక ట్రబుల్ షూటర్ కావాలన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. లేకుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. యువనేతలను మరింత మందిని కోల్పోక తప్పదు. ఇటు నాయకత్వంతో పాటు రాష్ట్రాలను కూడా కోల్పోక తప్పదు.

Tags:    

Similar News