ఎవరో వస్తారని? ఏదో చేస్తారని?

కాంగ్రెస్ పార్టీని కలసికట్టుగా నడిపించే నాధుడు లేరు. బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పీసీపీ అధ్యక్షుడిని నియమించిన అధిష్టానం కొద్దో గొప్పో బలం ఉన్న తెలంగాణాలో మాత్రం [more]

Update: 2020-05-05 11:00 GMT

కాంగ్రెస్ పార్టీని కలసికట్టుగా నడిపించే నాధుడు లేరు. బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పీసీపీ అధ్యక్షుడిని నియమించిన అధిష్టానం కొద్దో గొప్పో బలం ఉన్న తెలంగాణాలో మాత్రం పార్టీ అధ్యక్షుడి నియామకం జరపలేదు. ప్రస్తుతానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. నూతన అధ్యక్షుడి నియామకం జరిగే సమయంలోనే కరోనా వ్యాప్తి చెందడంతో పీసీపీ చీఫ్ నియామకానికి బ్రేక్ పడింది. దీంతో అసలే కష్టాల్లో ఉన్న పార్టీని ఇప్పుడు నడిపించేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.

పీసీసీ చీఫ్ ఉన్నా…..

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా ఆయన రేపో, మాపో దిగిపోక తప్పదు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఢిల్లీ పాలిటిక్స్ వైపే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యవహారాలను ఎక్కువగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూసుకుంటున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల హడావిడి కూడా పెద్దగా కన్పించడం లేదు. కరోనా వ్యాధి ప్రబలటానికి ముందు కూడా ఇదే పరిస్థితి.

అందరి అభిప్రాయాలను…

పీసీసీ చీఫ్ మార్పు ఖాయమయిపోయింది. అధిష్టానం కూడా అందరి అభిప్రాయాలను సేకరించింది. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ఒపీనియన్ ను కూడా హైకమాండ్ తీసుకుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పీసీసీ చీఫ్ లను నియమించిన అధిష్టానం తెలంగాణ విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండటమే కారణమని చెప్పక తప్పదు. అభ్యంతరాలు ఒకవైపు, సిఫార్సులు మరో వైపు ఉండటంతో ఇంకా ఎవరినీ నియమించలేదని చెబుతున్నారు.

ఈ ముగ్గురిలో ఒకరేనని…..

పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు సోనియా గాంధీని ప్రత్యేకంగా కలిశారు. ఈ ముగ్గురిలో ఒకరు పీసీసీ చీఫ్ ఖాయమని తేలిపోయింది. రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి దూకుడు వ్యవహారం పైనా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీధర్ బాబు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఈలోపు కరోనా వ్యాధి ప్రబలడంతో ప్రకటన వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ నూతన రధ సారధి ప్రకటన మరికొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశముంది.

Tags:    

Similar News