వీరి ఖర్మకు వదిలేసినట్లేనా?

తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం కూడా పూర్తిగా వదిలేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ రాకపోవడం పార్టీలోనే [more]

Update: 2020-12-05 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం కూడా పూర్తిగా వదిలేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ రాకపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఒకవైపు బీజేపీని చూసుకుంటే అమిత్ షా దగ్గర నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

ఏ ఒక్కరూ…..

కానీ కాంగ్రెస్ లో మాత్రం ఏ ఒక్కరు కనపడలేదు. పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ మాత్రమే ఇక్కడ కనపడ్డారు. నిజానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన సమయంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు ఎందరో ఉన్నారు. గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, చిదంబరం, ఆంటోని వంటి నేతలు ఉన్నారు. వీరందరూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అండగా నిలిచిన నేతలు.

సీనియర్ నేతలున్నా…..

కనీసం వీరిని పంపించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలేదు. గ్రేటర్ ఎన్నికలు కావడంతో రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం లేదనుకున్నా, సీనియర్ నేతలయినా పంపించి ఉంటే కొద్దో గొప్పో పార్టీకి మేలు చేకూరి ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సీనియర్ నేతలందరూ ఇటీవల అధిష్టానాన్ని వ్యతిరేకించడంతోనే వారిని పంపలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

వరస ఓటములేనా?

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం, కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తేలేకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. బీజేపీ నేతలు ఇంత మంది వచ్చి పోతున్నా కనీసం జాతీయ స్థాయి నేత ఎవరూ కన్పించలేదు. కనీసం ఎంపీలు కూడా వచ్చి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించలేదు. అధిష్టానం ఇక్కడి కాంగ్రెస్ నేతలను వారి ఖర్మకు వారికి వదిలేసినట్లు కనపడుతుంది.

Tags:    

Similar News