ఓటమి కొత్తేమీ కాకపోయినా…?

ఓటమి కొత్త కాదు. ఆరేళ్ల నుంచి చూస్తున్నదే. ప్రతి ఓటమి ఒక గుణపాఠం కావాల్సి ఉండగా కాంగ్రెస్ కు మాత్రం అది అలవడటం లేదు. గత ఆరేళ్లలో [more]

Update: 2020-11-19 09:30 GMT

ఓటమి కొత్త కాదు. ఆరేళ్ల నుంచి చూస్తున్నదే. ప్రతి ఓటమి ఒక గుణపాఠం కావాల్సి ఉండగా కాంగ్రెస్ కు మాత్రం అది అలవడటం లేదు. గత ఆరేళ్లలో ఎన్ని ఓటములు చవిచూశారు. హేమా హేమీలు ఓటమి పాలయ్యారు. జానారెడ్డి వంటి సీనియర్ నేతలు సయితం ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. దీనికి కారణాలను అన్వేషించి తప్పులు సరిదిద్దుకోవాల్సిన పార్టీ నాయకత్వం ఆ ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

రాష్ట్రాన్ని ఇచ్చి మరీ…..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తనకు తాను చేటు తెచ్చుకున్నదన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. దశాబ్దకాలం జాతీయంగా కాంగ్రెస్ ను ఆదుకున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవడం వల్లనే జాతీయంగా కాంగ్రెస్ ప్రతిభ కనపర్చింది. అటువంటి రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఆచూకీ కోల్పోయింది. కొద్దో గొప్పో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనుకుంటే ఇక్కడ కూడా ఏమాత్రం ముందుకు పడటం లేదు.

ఐక్యత ఏది?

ఓటమిని ఐక్యంగా అంగీకరిస్తున్న నేతలందరూ ఐక్యతను మాత్రం ప్రదర్శించలేకపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లను చూస్తే దాని దయనీయమైన పరిస్థితి చెప్పకనే చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం జ్ఞానోదయం కలగలేదు. రేవంత్ రెడ్డిపై విహనుమంతరావు లాంటీ సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేయడం దీనికి అద్దంపడుతుంది.

గెలిపించినా….?

నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశాలను కూడా జనంలో పెట్టి కాంగ్రెస్ నేతలు పార్టీని పలచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తిరిగి కేసీఆర్ చెంతకు వెళతారన్న అభిప్రాయం కూడా ప్రజలు ఆ పార్టీ వైపు చూడకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. 2014 నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడివెళ్లిపోయారు. అందువల్లనే ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం వేస్ట్ అని ప్రజలు భావిస్తుండటమే దాని ఓటమికి కారణాలుగా చెప్పాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఐక్యతతో వ్యవహరించి ప్రజల్లో విశ్వాసం కలిగించ గలిగితే భవిష‌్యత్ ఆ పార్టీకే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News