ఈ సారి దెబ్బ కొట్టి తీరుతారా?

గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు వ్యూహరచనను ప్రారంభించాయి. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ [more]

Update: 2021-02-14 17:30 GMT

గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు వ్యూహరచనను ప్రారంభించాయి. వచ్చే ఏడాది గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సొంత రాష్ట్రంలో తన బలం నిరూపించుకోవాలని మోదీ ఇప్పటి నుంచే గుజరాత్ కు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సయితం మాజీ నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

మూడు దశాబ్దాలుగా…..

గత మూడు దశాబ్దాలుగా గుజరాత్ లో కాంగ్రెస్ కు చోటు లేకుండా పోయింది. మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయినా అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకుంటే అదికూడా సాధ్యంకాలేదు. అయితే 2017 లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది. మొత్తం 182 స్థానాలకు గాను 77 స్థానాలను సాధించగలిగింది. బీజేపీ 99 స్థానాలను సాధించి అధికారంలోకి వచ్చినా నైతికంగా కాంగ్రెస్ దే విజయమని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు.

సుదీర్ఘకాలం….

తర్వాత బీజేపీ క్రమంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుంది. ఇక కాంగ్రెస్ కూడా చేసేదేమీ లేక ఎన్నికల కోసం వెయిట్ చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదేనన్న ధీమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, కరోనాకట్టడిలోనూ, రైతు సమస్యలను పరిష్కరించడంలోనూ అధికార బీజేపీ విఫలమవ్వడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న నమ్మకంతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది.

సీనియర్ నేత చేరికతో….

ఇక మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా కాంగ్రెస్ గూటికి రానున్నారు. 2017 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎన్సీపీలో చేరిన ఆయన 2020లో దాని నుంచి బయటకు వచ్చి ప్రజాశక్తి డెమొక్రటిక్ పార్టీని పెట్టారు. బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన శంకర్ సిన్హ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచి పరిణామమని చెబుతున్నారు. తాను ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. ఎన్నికలకు ముందు కీలక నేత కాంగ్రెస్ లో చేరటం ఆ పార్టీకి ఊరట ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.

Tags:    

Similar News