ఇద్ద‌రూ ఒక్క‌టై ఊపేస్తారా..?

జ‌మ్మ‌ల‌మ‌డుగు తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎట్ట‌కేల‌కు ప‌రిష్కార‌మైంది. గ‌త కొంత‌కాలంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య స‌యోధ్య కోసం ఎడ‌తెగ‌ని [more]

Update: 2019-02-10 05:30 GMT

జ‌మ్మ‌ల‌మ‌డుగు తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎట్ట‌కేల‌కు ప‌రిష్కార‌మైంది. గ‌త కొంత‌కాలంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య స‌యోధ్య కోసం ఎడ‌తెగ‌ని చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనేక‌మార్లు అమ‌రావ‌తిలో వీరిద్ద‌రూ చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. ఎట్ట‌కేల‌కు ఇవాళ వీరి మ‌ధ్‌య స‌యోధ్య కుదిరింది. ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేయ‌నున్నారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి క‌డ‌ప పార్ల‌మెంటు స్థానానికి పోటీ చేస్తారు. అయితే, ఇందుకు గానూ రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఒప్పందానికి వ‌చ్చారు. ఈ ప‌ద‌విని ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబంలో ఒక‌రికి ఇవ్వ‌నున్నారు.

ద‌శాబ్దాల వైరం మ‌రిచిపోయి…

ద‌శాబ్దాలుగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ గొడ‌వ‌ల‌తో అనేక మంది హ‌త‌మ‌య్యారు కూడా. వీరిద్ద‌రూ ఎప్పుడూ వేర్వేరు పార్టీల్లోనే కొన‌సాగారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆదినారాయ‌ణ‌రెడ్డి వైసీపీ నుంచి, రామ‌సుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి విజ‌యం సాధించి త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి ప‌ద‌వి కూడా పొందారు. రామ‌సుబ్బారెడ్డిని బుజ్జ‌గించేందుకు గానూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ఇద్ద‌రూ ఒక్క పార్టీలోనే ఉన్నా వీరి మ‌ధ్య మాట‌లు లేవు. ఇద్ద‌రిలో ఒక‌రు అసెంబ్లీకి, మ‌రొక‌రు పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చిన‌ప్పుడు క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేసేందుకు ఇద్ద‌రూ ఆస‌క్తి చూప‌లేదు. వైసీపీ బ‌లంగా ఉన్న ఆ స్థానానికి పోటీ చేయ‌డం కంటే జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేస్తేనే మేల‌ని భావించారు. ఓ ద‌శ‌లో రామ‌సుబ్బారెడ్డిని స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానైనా పోటీ చేయాల‌ని వారి అనుచ‌రులు ఒత్తిడి తెచ్చారు.

ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటారా..?

చివ‌ర‌కు ఆదినారాయ‌ణ‌రెడ్డి ఒక‌డుగు వెన‌క్కు వేసి క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేసేందుకు అంగీక‌రించారు. ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల మ‌ధ్య సంధి కుద‌ర‌డంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో పార్టీకి తిరుగులేద‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు.
అయితే, ఇప్ప‌టివ‌ర‌కు బాగానే ఉన్నా… రేపు ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటారా అంటే అనుమాన‌మే. రెండేళ్లుగా ఒక్క పార్టీలోనే ఉంటున్నా.. వీరిద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు మాట‌లే లేవు. మ‌రి, ఇద్ద‌రు నేత‌లూ, రెండు వ‌ర్గాలూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటేనే జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవ‌కాశం ఉంటుందంటున్నారు. ఇక‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి వంటి బ‌ల‌మైన నేత టీడీపీ నుంచి క‌డ‌ప పార్ల‌మెంటుకు పోటీ చేస్తుండ‌టం ఆ పార్టీకి క‌డ‌ప జిల్లాలో కొంత మేలు చేసేదే అంటున్నారు. వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది.

 

Tags:    

Similar News