జయంత్ కు అతి పెద్ద సవాల్…?

రాష్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ) అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన జయంత్ చౌదరి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన ముందున్నది ముళ్లబాటే అని [more]

Update: 2021-06-18 16:30 GMT

రాష్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ) అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన జయంత్ చౌదరి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయన ముందున్నది ముళ్లబాటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి అటు పార్లమెంటులో, ఇటు శాసనసభలో పార్టీకి కనీస ప్రాతినిథ్యమే లేదు. కేంద్రంలో రాజ్యసభ, రాష్ర్టంలోని శాసనమండలిలోనూ పార్టీకి ప్రాతినిథ్యం లేదు. 2017లో గెలిచిన పార్టీ కి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా కమలం తీర్థం పుచ్చుకున్నాడు. ఈ పరిస్థితిలో పార్టీ అధినేత, తండ్రి అజిత్ సింగ్ మరణాంతరం అధికార పగ్గాలు అందుకున్న యువనేత జయంత్ చౌదరి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మే నెల ఆరోతేదీన అజిత్ సింగ్ (84) కరోనాతో కన్నుమూశారు. అనంతరం జయంత్ చౌదరిని అధ్యక్ష పదవికి పార్టీ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి ప్రతిపాదించారు. దీనిని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో జయంత్ చౌదరి కి మార్గం సుగమమైంది.

కంచుకోట లో ఓటమిపాలయి…?

1978 డిసెంబరు 27న జన్మించిన జయంత్ చౌదరిపార్టీలో మూడోతరం నేత. 42 సంవత్సరాల జయంత్ చౌదరి ఉన్నత విద్యావంతుడు. అమెరికాలో ని డల్లాస్, టెక్సాస్ ల్లో చదువుకున్నారు. 2009 లో మథుర నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తరవాత 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి, డ్రీమ్ గరల్ గా పేరు గాంచిన సినీనటి హేమమాలిని చేతిలో ఓటమి పాలయ్యారు. యూపీ పశ్చిమ ప్రాంతంలోని బాగ్ పట్ మొదటినుంచీ పార్టీకి పెట్టనికోట వంటిది. అజిత్ సింగ్ ఏడుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో అజిత్ తండ్రి చౌదరి చరణ్ సింగ్ ఇక్కడి నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తొలుత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1977లో కేంద్రంలో జనతా పార్టీ హయాంలో అత్యంత కీలకమైన హోంమంత్రిగా, ఉప ప్రధానిగా, కొద్ది రోజుల పాటు ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఘనమైన వారసత్వం ఉన్నా…?

ఘనమైన కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ పార్టీ పరంగా జయంత్ చౌదరి పరిస్థితి సాఫీగా ఏమీ లేదు. కిందిస్థాయి నుంచి పార్టీని పునర్ నిర్మించాల్సి ఉంది. పశ్చిమ యూపీ తొలి నుంచీ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ ప్రాంతంలోని పూర్వాంచల్, బుందేల్ ఖండ్ ల్లో పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉండేది. ఇక్కడ ఎక్కువగా చెరకు పండిస్తారు. సంపన్న జాట్ రైతులు పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో శక్తిమంతమైన చక్కెర లాబీ జయంత్ చౌదరి కుటుంబానికి అండగా ఉంది. ఘాజియాబాద్, మధుర, ఆగ్రా, షహరాన్ పూర్, మీరట్, అలీగఢ్, ఫిరోజాబాద్, బిజ్నోర్, మొరాదాబాద్, షామ్లీ తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు చరణ్ సింగ్ కుటుంబానికి తిరుగులేని పట్టు ఉండేది. కాలక్రమంలో కుటుంబ ప్రాభవం కనుమరుగైంది.

పంచాయతీ ఎన్నికల్లో…?

తొలి రోజుల్లో వీరి ఓటుబ్యాంకును ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ దెబ్బతీసింది. తరవాతి రోజుల్లో కమలం పార్టీ కొల్లగొట్టింది. 2019లో బీజేపీ నాయకుడు డాక్టర్ సత్యపాల్ సింగ్ బాగ్ పట్ నుంచి జయంత్ చౌదరిని 23,502 ఓట్ల తేడాతో ఓడించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆర్ ఎల్ డీ పశ్చిమ యూపీలో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించడం పార్టీకి ఊరట కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్ తో పొత్తు పెట్టుకుని వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జయంత్ చౌదరి పావులు కదుపుతున్నారు. పార్టీ ప్రధాన ఓటుబ్యాంకు రైతులు. అందుకే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయంటూ వారికి మద్దతుగా పోరాడుతున్నారు. ఈ ప్రాంతానికే చెందిన రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ కు దన్నుగా నిలుస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News