ఆధిపత్యానికి ఇక అంతమేనా..?

జేసీ దివాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. ఆరు [more]

Update: 2019-06-03 14:30 GMT

జేసీ దివాకర్ రెడ్డి. తాడిపత్రి కేంద్రంగా అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి తిరుగులేని నేతగా ఎదిగారాయన. ప్రత్యేకించి తాడిపత్రి అంటే జేసీ.. జేసీ అంటే తాడిపత్రి అన్న స్థాయిలో పట్టు సాధించారు. 30 ఏళ్లుగా అనంతపురం రాజకీయాల్లో సాగిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుల హవాకు ఈ ఎన్నికలు బ్రేక్ వేశాయి. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు జేసీ సోదరుల కంచుకోట కుప్పకూలింది. తమకు ఎదురులేదనుకున్న తాడిపత్రి నియోజకవర్గం చేజారిపోయింది. వారసులను చట్టసభల్లోకి పంపించాలనుకున్న జేసీ సోదరుల కలను వైసీపీ హవా ఆవిరి చేసింది. జేసీ సోదరుల ఆధిపత్యానికి ఈ ఎన్నికలు అంతంగానే కనిపిస్తున్నాయి.

మూడు దశాబ్దాల పాటు…

జేసీ దివాకర్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి కూడా రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన వారసులుగా జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అన్న దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పేవారు. 1983 ఎన్నికల్లో మొదటిసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ ప్రభంజనంలో ఓటమి పాలైన జేసీ దివాకర్ రెడ్డి తర్వాత వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. జిల్లా అంతా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత తగ్గినా ఆయన తన ప్రభావాన్ని మాత్రం చాటుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వెళ్లి ఆయన అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక సైలంట్ గా ఉండటమే మార్గం..!

ఆ తర్వాత ఐదేళ్ల పాటు జేసీ సోదరులు అధికార బలాన్ని చాటుకున్నారు. వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దగ్గరయ్యారు. ఇక, రాజకీయాలు చాలనుకున్న జేసీ సోదరులు ఈసారి తమ వారసులను బరిలోకి దింపారు. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమకు ఎదురులేదనుకున్న వారి అంచనాలను వైసీపీ తలకిందులు చేసింది. ప్రత్యేకించి తాడిపత్రిలో జేసీ సోదరులను ఢీకొట్టే స్థాయిలో ఉన్న పెద్దారెడ్డి విజయం సాధించడం వారికి మింగుడు పడని వ్యవహారం. ఐదేళ్ల పాటు అధికారానికి దూరం కావడం, బలమైన ప్రత్యర్థి చేతిలో అధికారం ఉండటంతో జేసీ సోదరుల ఆధిపత్యానికి గండిపడనుంది. పైగా జగన్ ను వారు అన్న మాటలు అన్నీఇన్నీ కావు. దీంతో జేసీ సోదరులు ఇప్పుడు ఐదేళ్ల పాటు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. అయితే, తాము జగన్ ను అంతలా విమర్శించకపోయి ఉంటే బాగుండేదని జేసీ బ్రదర్స్ ఇప్పుడు మదనపడుతున్నారట. ఓ వైపు నియోజకవర్గం చేజారిపోవడం, మరోవైపు బలమైన ప్రత్యర్థి చేతిలో అధికారం ఉండటం చూస్తుంటే మూడు దశాబ్దాల పాటు సాగిన జేసీ కుటుంబ ఆధిపత్యానికి గండిపడటం ఖాయంగానే కన్పిస్తోంది.

Tags:    

Similar News