జేడీ ఇలా డిసైడ్ అయ్యారట

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇంటిపేరు వీవీ అయిన‌ప్పటికీ.. ఆయ‌న సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ప‌నిచేయ‌డంతో ఆ పేరే ఆయ‌న‌కు ప్రామాణికంగా మారిపోయింది. ఉన్నత ఉద్యోగాన్ని వ‌దులుకుని సేవా దృక్ఫథంతో [more]

Update: 2019-09-08 05:00 GMT

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇంటిపేరు వీవీ అయిన‌ప్పటికీ.. ఆయ‌న సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ప‌నిచేయ‌డంతో ఆ పేరే ఆయ‌న‌కు ప్రామాణికంగా మారిపోయింది. ఉన్నత ఉద్యోగాన్ని వ‌దులుకుని సేవా దృక్ఫథంతో ఆయన రాజ‌కీయాల్లో కి వ‌చ్చారు. అయితే, వైసీపీలోకా లేదా టీడీపీలోకా అన్నట్టుగా మొద‌ట్లో ఆయ‌న ప్రస్థానంపై ఊహాగానాలు సాగాయి. అయితే, ఇవేవీ కాకుండా ఆయ‌న సైలెంట్‌గా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందు ఆయ‌న రాష్ట్రం మొత్తం తిరిగి.. రైతుల స్థితిగ‌తుల‌ను అధ్యయనం చేశారు. మేధావి.. ఉన్నత విద్యావంతుడు కావ‌డంతో ఆయ‌న రాణిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

బాండ్ పేపర్ రాసిచ్చినా….

ఈ క్రమంలోనే ప‌వ‌న్ ఆయ‌న‌కు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయ‌న నిజాయితీ ప‌రుడిగా అక్కడి ప్ర‌జ‌ల కు త‌న హామీల‌ను బాండు పేప‌ర్‌పై రాసి ఇవ్వడం, త‌న‌ను నిల‌దీయ‌మ‌ని చెప్పడం వంటివి అప్పట్లో సంచల‌నం సృష్టించాయి. అయితే, ఆయ‌న రాజ‌కీయంగా ప్రజ‌ల మ‌న‌సును గెలుచుకోలేక పోయారు. అయినప్పటికీ.. తాను విశాఖ ప్రజ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని, ప్రజ‌ల స‌మ‌స్యల‌పై దృష్టి పెడ‌తాన‌ని చెప్పి ముందుకు సాగారు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారుతున్నార‌నే ప్రచారం జ‌రిగింది. ఆయ‌న బీజేపీలోకి చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకుంటున్నార‌ని వార్తలు వ‌చ్చాయి.

గ్యాప్ పెరిగిందా?

ప‌వ‌న్‌కు, జేడీకి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింద‌ని… జేడీ జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నార‌న్న ప్రచారం జోరుగా జ‌రిగింది. అయితే, దీనిని జేడీ ఘాటుగానే తిప్పికొట్టారు. అలా వ్యాఖ్యానించిన వారు, న‌మ్మేవారు మ‌తిలేని వాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయ‌న‌పై గ్యాసిప్‌లు, వార్తలు కూడా నిలిచిపోయాయి. అయితే, అదేస‌మ‌యంలో ఆయ‌న జ‌న‌సేన‌కు కూడా ద‌గ్గర కాలేక పోయారు. పార్టీ ఘోరంగా దెబ్బతిన్న త‌ర్వాత ప‌వ‌న్ అనేక క‌మిటీల‌ను వేసి పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలోకూడా జేడీ పేరు ఎక్కడా వినిపించ‌లేదు.

అందుకోసమేనా?

ప‌వ‌న్ వేసిన జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలోనూ జేడీకి చోటు లేదు. అటు ఆయ‌న కూడా తాను జ‌న‌సేనలోనే ఉన్నాన‌ని కానీ, లేన‌ని కానీ చెప్పలేక పోయారు. ఇప్పుడు గ‌డిచిన నెల రోజులుగా ఆయ‌న జాడ కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు జేడీ వ్యూహం ఏంట‌నేది అంతుబ‌ట్టడం లేదు. ఇప్పటి వ‌ర‌కు ఉన్న స‌మాచారం బ‌ట్టి.. ఆయ‌న రాజ్యస‌భ టికెట్ అడిగార‌ని, దీనిపై బీజేపీలో చ‌ర్చ సాగుతోంద‌ని ఇది ఓకే అయితే, పార్టీ మారేందుకు ఆయ‌న రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఇది ఏమేర‌కు నిజం అనే విష‌యం తెలియాల్సి ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News