జేడీ పుంజుకున్నారే.. పోరాటం అందుకున్నారే

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు మ‌ళ్లీ ప్రజా స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ఐపీఎస్‌ను వ‌దులుకుని.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే [more]

Update: 2021-07-27 12:30 GMT

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు మ‌ళ్లీ ప్రజా స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ఐపీఎస్‌ను వ‌దులుకుని.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే విశాఖ ఎంపీ స్థానం నుంచి ఆయ‌న పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పరాజ‌యం పాల‌య్యారు. విశాఖ ఎంపీగా ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. అయిన‌ప్పటికీ.. ఆయ‌న ప్రజ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని.. వారి స‌మ‌స్యల‌పై పోరాటం చేస్తాన‌ని ప్రక‌టించారు. అయితే.. ఇంతలోనే క‌రోనా రావ‌డంతో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.

జనసేన నుంచి….?

అదేస‌మ‌యంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కొన్నాళ్లు వ్యవ‌సాయం వైపు మొగ్గు చూపి.. రైతుల క‌ష్టాలు తెలుసుకున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. రాజ‌కీయాల్లో ఉంటాన‌ని చెప్పి సినిమాల్లోకి వెళ్లిపోవ‌డాన్ని స‌హించ‌లేక ఏకంగా ఆయ‌న జ‌న‌సేన స‌భ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే.. ఆయ‌న కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మ‌రోసారి యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంద‌రిలాగా కాకుండా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి ఇప్పటికే చాలా రాజ‌కీయ పార్టీలు విశాఖ ఉక్కు కోసం అంటూ.. జెండాలు ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

అందరిలా కాకుండా…?

ఇక‌, స్థానిక ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా చేశారు. అయితే వీరిలా జెండాలు ప‌ట్టుకుని రోడ్డెక్కి నిన‌దించ‌డం కంటే.. న్యాయ‌పోరాటం బెట‌ర్ అనుకున్న.. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాల‌ని.. ఇది రాజ్యాంగ విరుద్ధమ‌ని పేర్కొంటూ.. హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై ఇప్పటికే రెండు మూడు సార్లు విచార‌ణ జ‌రిపిన కోర్టు.. కేంద్రానికి ఇటీవ‌ల గ‌ట్టిగానే షాకిచ్చింది. ఎప్పటిక‌ప్పుడు కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు స‌మ‌యం కోర‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది.

మళ్లీ యాక్టివ్ అవ్వడంతో….?

ఈ ద‌ఫా ఆఖ‌రి అవ‌కాశమ‌ని.. పేర్కొంటూ.. కోర్టు.. ఈ కేసు విచార‌ణ‌ను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. ఈ మొత్తంఎపిసోడ్‌లో హైకోర్టు క‌నుక ప్రైవేటీక‌ర‌ణ‌పై స్టే విధిస్తే.. ఇక్కడి కార్మికులకు ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణ‌మైన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణకి ప్రజ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డంతోపాటు.. ఆయ‌న పుంజుకునే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ మ‌ళ్లీ ఇప్పుడు రాజ‌కీయంగా యాక్టివ్ అవుతుండ‌డం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News