చారిత్రాత్మక తీర్పులిచ్చారు… రికార్డు సృష్టించారు

న్యాయవ్యవస్థలో మొదటినుంచీ మహిళల పాత్ర నామమాత్రమే. సుప్రీంకోర్టు, హైకోర్టుల వంటి ఉన్నత న్యాయవ్యవస్థలో వారి ప్రాతినిథ్యం తక్కువ. న్యాయవాదుల కన్నా న్యాయమూర్తుల సంఖ్య బహు స్వల్పం. ఇక [more]

Update: 2021-01-30 16:30 GMT

న్యాయవ్యవస్థలో మొదటినుంచీ మహిళల పాత్ర నామమాత్రమే. సుప్రీంకోర్టు, హైకోర్టుల వంటి ఉన్నత న్యాయవ్యవస్థలో వారి ప్రాతినిథ్యం తక్కువ. న్యాయవాదుల కన్నా న్యాయమూర్తుల సంఖ్య బహు స్వల్పం. ఇక ప్రధాన న్యాయమూర్తుల పీఠాలను అధిరోహించిన అతివల సంఖ్య మరీ తక్కువ. కీలకమైన సుప్రీంకోర్టుకు ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేదు. కొన్ని హైకోర్టులకు మాత్రం మహిళలు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి ఆ పదవులకు వన్నె తెచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు.

రికార్డు సృష్టించి….

హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సష్టించారు. దేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. వీటిల్లో ఒక్క తెలంగాణ హైకోర్టు మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి కలిగి ఉండటం విశేషం. హైకోర్టులోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి. జస్టిస్ కోహ్లీ ఢిల్లీలో 1959 సెప్టెంబరు 2న జన్మించారు. విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. ఢిల్లీ విశ్వవిద్యాయలయం నుంచి బీఏ, పీజీ పూర్తి చేశారు. తరవాత న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులోనే ప్రాక్టీసు ప్రారంభించారు. 2006 మే 29 దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరవాత 2007లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అదే హైకోర్టులో పని చేస్తూ అనేక కేసుల్లో కీలకమైన తీర్పులు వెలువరించారు.

చారిత్రాత్మక తీర్పులు……

బాల నేరస్తులు, గృహహింస, విడాకులు, భరణం, బెయిల్, అంధ విద్యా ర్థుల కేసుల్లో ఆమె చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి ప్రజల మన్ననలు పొందారు. పరీక్షలకు హాజరయ్యే అంధ విద్యార్థులకు సహాయకులను సమకూర్చాలని ఢిల్లీ విశ్వవిద్యాయాన్ని ఆదేశించడం వల్ల లక్షలాది అంధ విద్యార్థులకు మేలు కలిగింది. దీనివల్ల వారు పరీక్షలు రాయడం సులువైంది. పురుషాధిక్య సమాజంలో గృహహింస చట్టం ఆవశ్యకత ఉందని, అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ఓ కేసులో పేర్కొన్నారు. విడాకులు, భరణాల కేసుల్లో పురుషులు అప్పు చేసి అయినా మహిళలకు భరణం ఇవ్వాలని ఆదేశించారు. బాల నేరస్తుల విషయంలో వారి గత చరిత్ర గురించి అదేపనిగా ఆరా తీయక్కర్లేదని తేల్చి చెప్పారు. బెయిల్ మంజూరైన 24 గంటల్లో తక్షణం నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించని తిహార్ జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బెయిల్ మంజూరై మూడేళ్లుగా విడుదలకు నోచుకోని ఖైదీల వివరాలు ఇవ్వాలని ఆదేశించడం ద్వారా జైలు అధికారులకు చెమటలు పట్టించారు.

అనేక మంది న్యాయమూర్తులు…..

జస్టిస్ లీలాసేథ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఆమె 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తరవాతత జస్టిస్ సుజాతా మనోహర్ (1994), జస్టిస్ కె.కె.ఉష (2001), జస్టిస్ మంజుల చెల్లూర్ (2014) లు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. జస్టిస్ కీలకమైన బాంబే, కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. జస్టిస్ జాన్ సుధా మిశ్రా(జార్ఖండ్), ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ రోహిణి (ఢిల్లీ), జస్టిస్ గీతా మిట్టల్ 2018లో జమ్ము-కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ ఫాతిమాబీవి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ ఇంద్ర బెనర్జీ, జస్టిస్ ఇందు మలోహత్రా పని చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News