బాబు గ్రహస్థితి కేసీఆర్ ను వెంటాడుతోందా?
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి నెగ్గుకు రావడం రాజకీయాల్లో సర్వసాధారణం. పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మలచుకుని రాజకీయాలను తమచుట్టూ తిప్పుకోవాలని చూస్తుంటారు కొందరు. రానున్న వాతావరణాన్ని [more]
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి నెగ్గుకు రావడం రాజకీయాల్లో సర్వసాధారణం. పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మలచుకుని రాజకీయాలను తమచుట్టూ తిప్పుకోవాలని చూస్తుంటారు కొందరు. రానున్న వాతావరణాన్ని [more]
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి నెగ్గుకు రావడం రాజకీయాల్లో సర్వసాధారణం. పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మలచుకుని రాజకీయాలను తమచుట్టూ తిప్పుకోవాలని చూస్తుంటారు కొందరు. రానున్న వాతావరణాన్ని ముందుగానే పసిగట్టి అవకాశాలను ఒడిసిపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. అయితే గడచిన కొంతకాలంగా వీరికి పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. క్షేత్రస్థాయికి సంబంధం లేని తీవ్ర వ్యూహాలతో చిక్కుల్లో పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న చంద్రబాబు చేసిన పొరపాట్లే తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతంగా ఆయనకు గ్రహణం పట్టించాయి. విషమపరిస్థితులు కల్పించాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు తక్షణం అటువంటి స్థితి ఏర్పడకపోయినప్పటికీ చంద్రబాబు గ్రహస్థితి కేసీఆర్ నూ వెన్నాడుతున్న సూచనలు కానవస్తున్నాయి.
గేమ్ చేంజర్స్…
నిజానికి చంద్రబాబు, కేసీఆర్ లు రాజకీయాలను మలుపుతిప్పిన దార్శనిక నాయకులు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ప్రజాకర్షణ, నేరుగా జనాదం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తాను ఒక బలమైన శక్తిగా ఆవిష్కరించుకోవడానికి వేసిన ఎత్తుగడలు అన్నీఇన్నీ కావు. జాతీయ నాయకునిగా ఎదిగారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కీలక సూత్రధారిగా వ్యవహరించారు. అలాగే కేసీఆర్ సైతం మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే బలంగా ఉన్న తెలంగాణ వాదాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. చరిత్రను మలుపు తిప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో బలహీన నాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటూ నిరవధిక నిరాహారదీక్షతో మొత్తం వాతావరణాన్నే మార్చేశారు. చిన్న స్థాయి నుంచి పైస్థాయికి ఎదగడం , నిచ్చెన మెట్లను అధిరోహించి పరమపదసోపాన పటం చేరుకోవడం వారిద్దరికీ బాగా తెలుసు. అయితే ఎత్తుగడల రాజకీయంలో వారిరువురూ తీసుకుంటున్న నిర్ణయాలు వికటించడం ప్రారంభమైనట్లు తాజా ఉదాహరణలు తేటతెల్లం చేస్తున్నాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం చంద్రబాబు అవరోహణం మొదలైంది. రాజకీయ పిల్లిమొగ్గలు అందుకు కారణంగా నిలిచాయి.
ముంచేస్తున్న మీడియా…
మీడియాను సామదానభేదోపాయాలతో గుప్పెట్టో పెట్టుకోవడంలో వీరిద్దరిదీ అందెవేసిన చెయ్యి. ప్రధానమైన ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ సీఎంగా, ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబుకు బలమైన మద్దతుగా నిలిచాయి. చంద్రబాబు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ విషయం బయటికి రాకుండా దాచేశాయి. ఫలితంగా మూడు సార్లు ఘోర పరాభవం ఎదురైనప్పటికీ మీడియా ఎప్పుడూ నిజాన్ని వెల్లడించలేదు. సూచన ప్రాయంగానూ చెప్పడానికి ప్రయత్నించలేదు. అదే విధంగా తెలంగాణలో కనుసైగతో మీడియాను శాసిస్తున్నారు కేసీఆర్. టీఆర్ ఎస్ కు, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజావాణిని వినిపించడానికి కూడా సాహసించడం లేదు ప్రధాన స్రవంతి మీడియా.టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజాస్పందన వెల్లువెత్తుతున్నప్పటికీ దానిని సరిగ్గా రిఫ్లెక్ట్ చేయాలని భావించడం లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు చాటిచెప్పిన సత్యమిదే. చంద్రబాబు నాయుడు మీడియాలో నెగటివ్ అంశాలను సహించరు. కేసీఆర్ కూడా అంతే. ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టడానికే వారు ఇష్టపడతారు.
మారని వైఖరి…
చంద్రబాబు బీజేపీతో రెండుసార్లు చేతులు కలిపి, రెండు సార్లు విడిపోవడంలో పక్కా రాజకీయమే కనిపిస్తుంది. ఒకసారి కాంగ్రెసుతోనూ చేతులు కలిపారు. బీజేపీతో విడిపోయిన రెండు సందర్భాల్లోనూ పరాజయం మూటగట్టుకున్నారు. కాంగ్రెసుతో చేతులు కలిపి తెలంగాణలో పార్టీకి మంగళం పాడేశారు. ఢిల్లీలో ప్రస్తుతం చంద్రబాబును బీజేపీ ఆదరించే స్థితి లేదు. వైసీపీ సర్కారు ఉక్కు పాదం మోపడంతో తెలుగుదేశం పార్టీ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. ఇది చంద్రబాబు స్వయంకృతం. ప్రతిపక్షమైన వైసీపీని బలహీనపరచాలనే ఎత్తుగడతో అనేకమంది శాసనసభ్యులను చేర్చుకుని వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. కేసీఆర్ ముందుగానే దీనిని చేసి చూపించారు. ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనపరచాలనుకుని కొత్త శత్రువును తెచ్చి పెట్టుకున్నారు. బీజేపీ రూపంలో బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకున్నారు. చంద్రబాబు లేని ప్రత్యర్థిని ప్రధాన శత్రువుగా ప్రజల ముందు నిలపాలని ప్రయత్నించి దారుణంగా దెబ్బతిన్నారు. వైసీపీని మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ది కూడా అదే పరిస్థితి. అయితే ఒకరు ఇంకా అధికారంలో ఉన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏకపక్ష వైఖరి, అధికారం శాశ్వతమనుకునే భ్రమలు, తమకు ప్రత్యామ్నాయమే లేదనే ధోరణి వీరిరువురి రాజకీయానికి చెక్ పెడుతున్నాయి. అనూహ్యమైన ఎత్తుగడలు, రాజకీయ అవకాశాలను కల్పించుకునే చాకచక్యం ఉన్నప్పటికీ నేల విడిచి సాము చేయాలనుకోవడమే వీరికి పరీక్ష పెడుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్