ఎవరు ఎవరికి చెక్.
బలమైన శత్రువుతో యుద్ధం చేయడం కంటే చేతులు కలపడం ఉత్తమమని రాజనీతి చెబుతుంది. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాలను విస్తరించుకోవడానికి, కాపాడుకోవడానికి వియ్యమందడం, సామంతులుగా వ్యవహరించడం వంటి [more]
బలమైన శత్రువుతో యుద్ధం చేయడం కంటే చేతులు కలపడం ఉత్తమమని రాజనీతి చెబుతుంది. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాలను విస్తరించుకోవడానికి, కాపాడుకోవడానికి వియ్యమందడం, సామంతులుగా వ్యవహరించడం వంటి [more]
బలమైన శత్రువుతో యుద్ధం చేయడం కంటే చేతులు కలపడం ఉత్తమమని రాజనీతి చెబుతుంది. పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాలను విస్తరించుకోవడానికి, కాపాడుకోవడానికి వియ్యమందడం, సామంతులుగా వ్యవహరించడం వంటి ఏర్పాట్లు చేసుకునేవారు. ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలోనూ అది పునరావృతమవుతూనే ఉంది. బలమైన శత్రువు బలాన్ని సగానికి కుదించి వేయాలంటే స్నేహహస్తం అందిస్తే చాలు , మిత్రత్వంతో తన బలం సగం మన వశమైపోతుంది. ఇదే పాయింట్ ఇప్పుడు పాలిటిక్స్ లో బాగా చెల్లుబాటవుతోంది. దక్షిణభారతంలో చిన్న రాష్ట్రం తెలంగాణ. దానికి అధినేత కేసీఆర్. బలమైన జాతీయ పార్టీ బీజేపీ. మతపరమైన అజెండాతో కేసీఆర్ కు సవాల్ విసురుతోంది. ఎంఐఎం వంటి మతవాద పార్టీతో స్నేహం చేసి అది తన బలంగా భావించారు. కేసీఆర్. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కు బలహీనతగా మారింది. కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోంది. విరుగుడు మంత్రంతో రాష్ట్రంపై తన పట్టును నిలుపుకునే ప్రయత్నాల్లో పడ్డారు కేసీఆర్. కేంద్రంతో చెలిమి, అనేక నిర్ణయాల్లో యూ టర్న్ లు చాటిచెబుతున్న సత్యమిదే. రాష్ట్రంలో బీజేపీ పెరగకుండా చెలిమి మంత్రంతో చెక్ పెట్టాలని చూస్తున్నారు కేసీఆర్.
మోడీ, షా మంత్రం వేశారా..?
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా లను కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్ మారిపోయారంటూ రాజకీయ వర్గాల్లో విస్త్రుత చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం ప్రభావితం చేసేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఎవరితో కలిసినా తన ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. మోడీ, షాలు ప్రభావితం చేయడం కంటే ఈ భేటీని టీఆర్ఎస్ కు అనుకూలంగా వాడుకోవడానికే కేసీఆర్ చూస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న తంతు అదే. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అధికారికంగా బంద్ చేయించిన కేసీఆర్ వాటిని పరోక్షంగా తాజాగాసమర్థిస్తున్నారు. కనీస మద్దతు ధర మా వల్ల కాదు, ప్రభుత్వ కొనుగోళ్లు కూడా ఉండవంటూ నేరుగా చట్టాల్లోని సారాన్ని అమల్లోకి తెస్తామని చెప్పేశారు. మరి బంద్ ఎందుకు చేశారంటే సమాధానం లభించదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలోనే విరుచుకు పడేవారు. కానీ బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న విషయాన్ని గ్రహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుల దూకుడును టీఆర్ఎస్ నేతలు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు. మతపరమైన అజెండాను సైతం సమర్థంగా బీజేపీ అమలు చేయగలుగుతోంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ మైత్రిని బీజేపీ నేతలు ప్రచారంలోకి తెస్తున్నారు. ఇదే అజెండాతో కమలం పార్టీ పక్కాగా ముందుకు వెళితే తన సీటు కిందకు నీళ్లు వచ్చినట్లేనన్న సత్యం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. 2018 వరకూ బీజేపీతో క్లోజ్ గా ఉండటం వల్ల టీఆర్ఎస్ అనేక రకాలుగా లబ్ధి పొందింది. ముందస్తు ఎన్నికలు ఫలించాయి. కేంద్ర నాయకుల కితాబులు లభిస్తుండేవి. అన్నిటికీ మించి అప్పట్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వీర్యమైపోయింది. కేంద్రంలో ఉన్న నాయకుల వైఖరి అర్థం గాక కేసీఆర్ తో బీజేపీ రాష్ట్ర నాయకులు సమర్థంగా పోరాటం చేయలేకపోయారు. ప్రస్తుతం అధికారానికి అవసరమైన వేగంతో బీజేపీ నాయకులు కదులుతున్నారు. అన్నిటా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెసు, టీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
కేసీఆర్ ట్రాప్…
బీజేపీతో తనకు విభేదాలు లేవని చెప్పడం కేసీఆర్ కు ఇప్పుడు చాలా అవసరం. అందువల్ల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు నుంచి పార్టీ మారి బీజేపీలో చేరాలనుకుంటున్న నాయకులు డైలమాలో పడతారు. బీజేపీకి ఒక రకంగా ఇది నష్టం చేకూరుస్తుంది. పార్టీ బలపడాల్సిన స్థితిలో అయోమయానికి గురవుతుంది. శత్రువును మైత్రి ద్వారా బలహీనపరచవచ్చనేందుకు ఇదొక పెద్ద ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే రకమైన వ్యూహంతో బీజేపీని తన అవసరాలకు వాడుకున్నారు. బీజేపీ రాష్టరంలో బలపడే పరిస్థితుల్లో దానితో చేతులు కలిపారు. బీజేపీ ఎదుగుదల కుచించుకుపోయి టీడీపీకి మిత్రపక్షంగా సహాయపాత్రకు పరిమితమై పోయింది. అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు సైతం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. అదే జరిగితే తెలంగాణలో శాశ్వతంగా బీజేపీ ఎదుగుదలకు సమాది కట్టేసినట్లే. విద్యుత్ సంస్కరణలు, పట్టణ పాలక సంస్తల్లో సేవల పన్నుల సంస్కరణల వంటి వాటికి కూడా కేసీఆర్ పచ్చ జెండా ఊపితే చెలిమికి మార్గం క్లియర్ అయిపోయినట్లే.
ఫైనల్ క్లాష్…
ఎంఐఎంకు తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలున్నాయి. కానీ పాతబస్తీకే పరిమితమవుతూ ప్రధాన పార్టీలకు సహకరిస్తూ వచ్చింది. గతంలో కాంగ్రెసుతో ఆ పార్టీకి అవగాహన ఉంటుండేది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ,ఎంఐఎంల మధ్య బలమైన మైత్రి కుదిరింది. తెలంగాణలో పాత బస్తీ కాకుండా 32 నియోజకవర్గాలలో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అయిదు వేల నుంచి 25 వేల వరకూ ముస్లిం ఓట్లు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావశీల పాత్ర పోషిస్తున్నాయి. కేసీఆర్ ఎంఐఎం మైత్రితో దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. బీజేపీ ఈవిషయంపై ఫోకస్ పెట్టి, హిందూ ఓట్ల పోలరైజేషన్ కు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, ఎంఐఎం ల కలయిక కమలం పార్టీ ఎదుగుదలకు బంగారు బాటలు వేస్తోంది. దీంతో ఎంఐఎం ను దూరం పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కేసీఆర్ గ్రహించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నట్లు బహిరంగంగా కనిపిస్తే ఆ పార్టీ బలాన్ని అదుపులో ఉంచవచ్చు. తాజాగా ఎంఐఎం సైతం టీఆర్ఎస్ అధినేతపై చేసిన వ్యాఖ్యలు నొప్పించేవిధంగా ఉన్నాయి. అందువల్ల ఎంఐఎం విచ్చలవిడి తనాన్ని కూడా అదుపు చేయకపోతే రాజ్యాంగేతర శక్తులుగా ఎంఐఎం నేతలు చెలరేగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తన వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కేంద్రం పట్ల సానుకూల ద్రుక్పథాన్ని కనబరుస్తున్నారని చెప్పవచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్