మరో చింతమనేని కాక తప్పేట్లు లేదే?

రాజ‌కీయాల్లో మాస్ లీడ‌ర్‌గా, స్టేట్ లీడ‌ర్‌గా ఎద‌గాలంటే దూకుడు ఉండాలి.. ఈ విష‌యాన్ని ఎవ్వరూ కాద‌న‌రు. అయితే మితిమీరిన దూకుడు, మ‌నం వాడే భాష‌ను కూడా ప్రజ‌లు [more]

Update: 2021-01-23 15:30 GMT

రాజ‌కీయాల్లో మాస్ లీడ‌ర్‌గా, స్టేట్ లీడ‌ర్‌గా ఎద‌గాలంటే దూకుడు ఉండాలి.. ఈ విష‌యాన్ని ఎవ్వరూ కాద‌న‌రు. అయితే మితిమీరిన దూకుడు, మ‌నం వాడే భాష‌ను కూడా ప్రజ‌లు ఎప్పుడూ ఓ కంట గ‌మ‌నిస్తూ ఉంటారు. అధికారం వ‌చ్చే వ‌ర‌కు ఒక‌లా అధికారం వ‌చ్చాక మ‌రోలా వ్యవ‌హ‌రించే వారిని ప్రజ‌లు పాతాళంలోకి తొక్కేస్తారు. ఈ విష‌యంలో ఎవ్వరూ మిన‌హాయింపు కాదు. తెలుగు రాజ‌కీయ చ‌రిత్రను మార్చిన ఎన్టీఆర్ కావొచ్చు.. దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన ఇందిరాగాంధీ కావొచ్చు… వీళ్లే ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఏపీ మంత్రి కొడాలి నాని సైతం మితిమీరిన అధికార అహంకారంతో దుందుడుకుగా ముందుకు వెళుతోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

వైసీపీలో చేరిన నాటి నుంచే…..

కొడాలి నాని వైసీపీలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి చంద్రబాబును తిట్టడ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి అయ్యాక టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఏ టీడీపీ నేత‌ను అయినా కొడాలి నాని త‌న నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు బూతులు తిడుతూనే ఉన్నారు. చివ‌ర‌కు హ‌ద్దులు మీరిపోయిన నాని పూర్తిగా విచ‌క్షణ కోల్పోతున్న ప‌రిస్థితి. ఇక కొడాలి నానిని సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా సీఎం జ‌గ‌న్‌తో పాటు వైసీపీ కీల‌క నేత‌లు ఎంట‌ర్టైన్ చేస్తోన్న ప‌రిస్థితి. వైసీపీ ప్రభుత్వం క‌మ్మల‌ను టార్గెట్ చేస్తోంద‌న్న విమ‌ర్శలు ఎక్కువే. ఈ క్రమంలోనే ఆ వ‌ర్గ ప్రతినిధిగా నానిని ప‌దే ప‌దే రంగంలోకి దింపుతూ అవ‌స‌రం ఉన్నప్పుడ‌ల్లా వాడుకుంటోన్న ప‌రిస్థితి.

వైసీపీ ట్రాప్ లో…..

జ‌గ‌న్‌, వైసీపీ వాళ్ల ట్రాప్ లో కొడాలి నాని పూర్తిగా ప‌డిపోయిన ప‌రిస్థితే ఉంది. సేమ్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఏ రీతిలో అధికారం ఉన్నప్పుడు అహంకారంతో వ్యవ‌హ‌రించి గ‌త ఎన్నిక‌ల్లో బొక్క బోర్లా ప‌డ్డారో ఇప్పుడు కొడాలి నాని కూడా అదే పంథాలో ముందుకు వెళుతున్నారు. మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక కూడా కొడాలి నాని సైలెంట్ అయిన సంద‌ర్భాలు… చివ‌ర‌కు ఆయ‌న శాఖ‌పై స‌మీక్షలు చేయ‌ని సంద‌ర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లు కొడాలి నాని శాఖ‌పై స‌మీక్షలు పేర్ని నాని నిర్వహించారు కూడా..! దీనిని బ‌ట్టే నానిని ఎలాంటి విలువ ఉందో అర్థమ‌వుతోంద‌నే వాళ్లు కూడా ఉన్నారు.

నాని కాకుంటే ఇంకొకరు….

జ‌గ‌న్‌కు ఈ క‌మ్మ కొడాలి నాని కాక‌పోతే మ‌రో అబ్బయ్య చౌద‌రో.. మ‌రో వ‌సంత కృష్ణ ప్రసాద్‌ను తెచ్చుకుని కేబినెట్లో పెట్టుకుంటాడు. అంత మాత్రానా జ‌గ‌న్ ప్రాప‌కం కోస‌మో.. త‌న మంత్రి ప‌దవి ఐదేళ్లు కాపాడుకునేందుకో మ‌రీ విలువ‌లు మ‌ర‌చిన రాజ‌కీయాలు చేయాలా ? గుడివాడ‌లో అనేక స‌మీక‌ర‌ణ‌లు కొడాలి నాని వ‌రుస విజ‌యాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇక్కడ నుంచి గొప్ప రాజ‌నీతిజ్ఞుడిగా పేరున్న వేముల కూర్మయ్య, ఎన్టీఆర్‌, రావి ఫ్యామిలీ విజ‌యం సాధించినా వీరు ఎప్పుడూ ఇంత చెత్త రాజ‌కీయాలు చేయ‌లేద‌న్న విమ‌ర్శలూ తీవ్రంగా వ‌స్తున్నాయి.

రాజకీయ అవసరాల కోసం…..

కొడాలి నానిని త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం వైసీపీ అధిష్టాన పెద్దలు చ‌క్కగా వాడుకుంటున్నార‌ని, ఈ ఎంక‌రేజ్‌మెంట్‌తో నాని రెచ్చిపోతున్నా ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక‌త వ‌స్తోంది. నాడు చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఎఫెక్ట్ కేవ‌లం దెందులూరుకే ప‌రిమ‌తం కాదు.. రాష్ట్రంలో చాలా మంది సామాన్య ప్రజ‌ల్లోనూ ఆలోచ‌న‌కు కార‌ణ‌మైంది. ఇప్పుడు కొడాలి నాని విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ప్రభాక‌ర్ ప‌ద‌వి, అధికారం ఉన్నన్ని రోజులు మామూలుగా ఎగ‌ర‌లేదు. ఒక్క ఓట‌మితో ట‌పా క‌ట్టేసి సైలెంట్ అయిపోయారు. రేపు గుడివాడ‌లో కొడాలి నాని ఒక్కసారి ఓడితే టీడీపీ వాళ్లే కాదు… చివ‌ర‌కు సొంత పార్టీ వాళ్లు కూడా కొడాలి నానిని తొక్కేసేందుకు రెడీగా ఉన్న మాట వాస్తవం. ఆ ఒక్క ఓట‌మి అంత‌ర‌మే ఇప్పుడు నాని పేట్రేగిపోయేందుకు అడ్డుగోడ‌గా నిలిచింది. ఇక గుడివాడ‌లోనూ కొడాలి నానిపై సామాన్య ప్రజ‌ల్లోనూ వ్యతిరేక‌త వ‌చ్చేసింది. కొడాలి నాని పంథా మార్చుకుంటాడా ? తానింతే అనుకుంటాడా ? అన్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News