హస్తిన వరకూ తీసుకెళ్లారుగా?

ఏపీ మంత్రి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం తర్వాత మళ్లీ మాట్లాడటం లేదు. పెద్దగా కన్పిచడం లేదు అయితే కొడాలి [more]

Update: 2020-10-19 08:00 GMT

ఏపీ మంత్రి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం తర్వాత మళ్లీ మాట్లాడటం లేదు. పెద్దగా కన్పిచడం లేదు అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అధినాయకత్వం మందలించిందన్న వార్తలు కూడా వచ్చాయి. కొడాలి నాని తొలి నుంచి చంద్రబాబు, టీడీపీపై దూకుడుగా వెళుతుంటారు. ఆయన టార్గెట్ అంతా చంద్రబాబుపైనే ఉంటుంది.

బీజేపీని కూడా…..

కానీ మొన్న మాత్రం బీజేపీని కూడా కొడాలి నాని టార్గెట్ చేయడంతోనే అధిష్టానం మందలించిందని చెబుతున్నారు. వరసగా హిందూ దేవాలయాలపై దాడులు, అంతర్వేదిలో రధం దగ్దం, దుర్గమ్మ రధంలో వెండి సింహాల చోరీ వంటి అంశాలతో పాటు జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ ఇవ్వాలన్న టీడీపీ డిమాండ్ పై కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు హయాంలోనే జగన్ అనేక సార్లు తిరుమల వెళ్లారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు.

భగ్గుమన్న నేతలు….

అంతటితో ఆగకుండా అయోధ్య రామాలయ భూమి పూజకు మోదీ, యోగిఆదిత్యానాధ్ భార్యలు లేకుండా ఎలా వెళ్లారని ప్రశ్నించారు. దీంతో బీజేపీ నేతలంతా కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలను కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా కొందరు బీజేపీ నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీలో తెలుగుదేశం పార్టీ అనుకూలురుగా ఉన్న కొందరు నేతలు నేరుగా కేంద్ర నాయకత్వానికి తర్జుమా చేసి చెప్పినట్లు తెలిసింది.

కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు….

దీనిపై కేంద్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీని వివరణ కోరిందని, అయితే కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా తాము ఆందోళన చేసినట్లు వీడియో క్లిప్పింగ్ లను జత చేస్తూ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై వైసీపీ అధినాయకత్వం సీరియస్ కావడంతోనే కొడాలి నాని మౌనంగా ఉంటున్నారని కూడా అంటున్నారు. కానీ అదేమీ కాదని, ఏదైనా అంశం వచ్చినప్పుడే కొడాలి నాని స్పందిస్తారని, అంతే తప్ప ఆయనను ఎవరూ ఏ విషయంలో మందలించలేదన్నది కొడాలి నాని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద కొడాలి నాని అంశం ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News