బ్రదర్స్ విడిపోతున్నారా?

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నిన్న మొన్నటి వరకూ పార్టీలోనూ, నల్లగొండ జిల్లాలోనూ గట్టి పట్టు ఉండేది. అయితే ఇద్దరి మధ్య తేడాలు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కోమటిరెడ్డి [more]

Update: 2021-01-09 09:30 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నిన్న మొన్నటి వరకూ పార్టీలోనూ, నల్లగొండ జిల్లాలోనూ గట్టి పట్టు ఉండేది. అయితే ఇద్దరి మధ్య తేడాలు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతానని చెప్పడం బ్రదర్స్ మధ్య విభేదాలను బయటపెట్టినట్లయింది. ఎవరూ అడగకపోయినా బీజేపీ గురించి, దాని బలం గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించడాన్ని బట్టి ఆయనకు, సోదరుడికి మధ్య విభేదాలు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.

దానిని నమ్ముకునే….

కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడూ నల్లగొండ జిల్లాను నమ్ముకునే రాజకీయాలు చేశారు. తొలుత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేవారు. గత ఎన్నికలలో ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ లో ఓటమిపాలు కాగా, రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వెంకటరెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఎప్పటినుంచో ప్రచారం….

అయితే కాంగ్రెస్ శాసనసభ్యులు 12 మంది టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఒక ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనం కావడంతో ఆయన బీజేపీలో చేరతారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన ఆగారు. గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ రేసులో ఉండటం కారణంగానే ఆయన ఇంకా పార్టీలో కొనసాగుతున్నారని చెబుతున్నారు. అయితే బ్రదర్స్ మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు.

బీజేపీ లో చేరడం…..

తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేేసిన ప్రకటనతో పీసీసీచీఫ్ పదవికి, తాను బీజేపీలో చేరేందుకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. ఆయన మనసంతా బీజేపీపైనే ఉంది. భవిష్యత్ తెలంగాణలో బీజేపీదేనని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరేందుకే సిద్ధమవుతున్నారు. ఒకవేళ తన సోదరుడికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే మాత్రం ఆయన ఆలోచనలో పడతారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సఖ్యత అంతగా లేదని ఇట్టే అర్థమవుతుంది.

Tags:    

Similar News