కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జంప్.. రీజ‌న్ ఇదేనా ?

కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన సోద‌రులుగా గుర్తింపు సాధించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. [more]

Update: 2019-06-18 14:30 GMT

కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన సోద‌రులుగా గుర్తింపు సాధించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా నే రాజ‌కీయాల్లో ఉన్నారు. అయితే, తాజాగా ఈబ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేందుకు రెడీ అయ్యారు. వాస్త‌వానికి గ‌డిచిన నాలుగేళ్లుగా కూడా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ఈ బ్ర‌ద‌ర్స్ ఆరితేరారు. పీసీసీ ప‌ద‌వి స‌హా కొన్ని కీల‌క‌మైన పార్టీ ప‌ద‌వుల‌పై క‌న్నేసిన ఈ ఇద్ద‌రు కూడా ఆయా ప‌ద‌వులు ల‌భించ‌క పోవ‌డంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. నిత్య అసంతృప్తితో ఉండే ఈ బ్ర‌ద‌ర్స్ పీసీపీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని ఎప్పుడూ ఒప్పుకోవ‌డం లేదు. పీసీసీ అధ్య‌క్ష పీఠాన్ని సొంతం చేసుకుని ఎలాగైనా తెలంగాణ సీఎం రేసులో ఉండాల‌న్న‌దే వీరి ప్లాన్‌. మూడు నాలుగేళ్లుగా ఈ ప్ర‌య‌త్నాలు అన్ని ఫెయిల్ అవుతున్నాయి.

ఇక గ‌తేడాది చివ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఓడిపోయినా.. సోద‌రుడు రాజ్‌గోపాల్‌రెడ్డి మాత్రం గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. భువ‌న‌గిరి ఎంపీ టికెట్‌ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. మూడేళ్ల క్రితం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ్‌గోపాల్‌రెడ్డి కేసీఆర్‌తో స‌వాల్ చేసి మ‌రీ ఎమ్మెల్సీగా గెలిచారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్‌ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి ఆవేద‌న‌.

కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్‌ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌గోపాల్ రెడ్డి.. పోతూపోతూ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డిని కూడా బ‌య‌ట‌కురావాల‌ని పిలుపునిచ్చారు. ఒక్క జ‌గ్గారెడ్డే కాదు వీలుంటే త‌మ‌తో పాటు ఎంత మంది కాంగ్రెస్ నేత‌లు వ‌స్తే అంత‌మందిని క‌మ‌లం గూటికి చేర్చేసి అక్క‌డ స‌త్తా చాటాల‌న్న‌దే ఈ బ్ర‌ద‌ర్స్ ప్లాన్‌గా తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్తు లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్ర‌త్య‌ర్థి అంటూ రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలకు స‌మాధానం రావాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News