కొండా వ్యూహమేంటి… తెలియడం లేదే?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీనియర్ రాజకీయ నేత కాదు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పారిశ్రామిక వేత్తగా గుర్తింపు [more]

Update: 2021-04-24 09:30 GMT

కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీనియర్ రాజకీయ నేత కాదు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పారిశ్రామిక వేత్తగా గుర్తింపు ఉంది. ఆ కుటుంబానికి రాజకీయ గుర్తింపు ఉంది. అన్నీ కలసి రావడంతో టీఆర్ఎస్ ఎంపీీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 నాటికి ఆయన మనసు మారింది. స్వతహాగా పారిశ్రామికవేత్త కావడం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉండటంతోనే టీఆర్ఎస్ తో విభేదాలు తలెత్తాయి.

కేసీఆర్ తీరుకు హర్ట్ అయి…..

నిజానికి కేసీఆర్ తో పార్లమెంటు సభ్యులు అతి తక్కువ సార్లు కలుస్తుంటారు. కేవలం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగే సమయంలోనే కేసీఆర్ దర్శనం లభిస్తుంది. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలా ఆలోచించలేదు. తన ఎంపీ పదవిని వ్యాపారాల కోసం వినియోగించుకోలేదు. సమస్యలపై ముఖ్యమంత్రిని కలవాలని పదే పదే ప్రయత్నించారు. విఫలం కావడంతో హర్ట్ అయి కాంగ్రెస్ లో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని…..

ఇక కాంగ్రెస్ లో కొన్నాళ్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్టివ్ గానే ఉన్నారు. అయితే వరస ఎన్నికల్లో ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ నేతలేనని గ్రహించారు. గ్రూపుల గోలతో ఆయనకు తలబొప్పి కట్టింది. ఇక కాంగ్రెస్ కు భవిష‌్యత్ లేదని గ్రహించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. బీజేపీలో చేరాలనుకున్నా అక్కడ చేర్చుకోవడంలేదని ఆయనే చెబుతున్నారు. షర్మిల పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని తాను అందులో చేరే ప్రసక్తి లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

సొంత పార్టీ పెడతారా?

అయితే రేవంత్ రెడ్డితో కలసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బాగా కనెక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడు కూడా ఆయనకు బాగా నచ్చింది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారంటున్నారు. మరి ఇది ఎంతవరకూ సాధ్యమో ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన వ్యూహం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News