కూన… జస్ట్ మిస్ ?

అవును. అధికులమని అహంకారం పోతే బ్రేకులు ఇలాగే పడతాయి. శ్రీకాకుళం జిలాల్లో టీడీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కూడా ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ [more]

Update: 2020-06-08 00:30 GMT

అవును. అధికులమని అహంకారం పోతే బ్రేకులు ఇలాగే పడతాయి. శ్రీకాకుళం జిలాల్లో టీడీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కూడా ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన స్టయిల్ వేరు అని రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చగొట్టుడు రాజకీయం అధినేతకు ఇష్టమని తనకు తానుగా అనుకుని తెగించేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వంటి వారు ఉండడంతో కూన రవికుమార్ ఇలా తన దారి రహదారి అనుకున్నారు. కానీ గిర్రున ఏడాది తిరిగేసరికి ఒక్కసారిగా చతికిలపడ్డారు. ఆయన రాజకీయం జోరు అలా తిరగబడిపోయింది. ఇపుడు కూన రవికుమార్ మీద పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. అధికారుల మీద ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నందుకు ఫలితమిది.

పక్కన పెట్టారా…?

బాగా ఊపు మీద ఉన్నపుడు ప్రోత్సహించిన అధినాయకత్వం ఇపుడు కేసుల బారిన పడి కూన తిరుగుతూంటే మాత్రం పట్టించుకోవడంలేదని అంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకసారి చేస్తే తప్పు అయినా ఒప్పు అయినా ఎవరైనా వెనకేసుకువస్తారు. పదే పదే అదే చేస్తూంటే మాత్రం ఎంతటివారు అయినా ఆలోచిస్తారు. అదే ఇపుడు జరుగుతోంది. కూన రవికుమార్ లో భవిష్యత్తు టీడీపీ నేతను చూసుకున్న పసుపు పార్టీ హై కమాండ్ ఇపుడు ఆలోచిస్తోందట. ఆయన్ని జిల్లా ప్రెసిడెంట్ పదవికి ఒక దశలో పరిశీలించినా కూడా ఇపుడు మాత్రం వద్దు అనుకుంటున్నారుట. ఎందుకంటే ఆయన తరచూ వివాదాలతో ఉంటే అది పార్టీ మీద నేరుగా పడుతుందని అంటున్నారు.

ఆమెకు ఛాన్స్ …..

జిల్లాకు చెందిన ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు పదవి ఇక మళ్ళీ లేదని, రాదని నిన్నటి వరకూ అంతటా వినిపించింది. దానికి తోడు తన తండ్రికి కంచుకోటగా ఉన్న పలాస నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కూడా పదికి కేవలం రెండు సీట్లే గెలవడంతో ఆమె వైఫల్యంగా భావించిన అధినాయకత్వం తప్పిస్తారని అప్పట్లో జోరుగా వినిపించిన మాట. అయితే ఇపుడు ఆ పదవికి కూన రవికుమార్ పేరును తప్పించడంతో శిరీషకు అదే ప్లస్ అయిందని అంటున్నారు. ఆమెకు పోటీ లేకుండా పోయిందని కూడా చెబుతున్నారు. పైగా బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం మరో అడ్వాంటేజ్ అంటున్నారు.

అడ్డుకుంటారా….?

అయితే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అచ్చెన్నాయుడు మాత్రం తన వర్గం వారికే ఈ పదవి దక్కాలని చూస్తున్నారు. కూన రవికుమార్ పేరుని ఆయన అందుకే గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే కూన వివాదాల్లో కూరుకుపోవడంతో ఇపుడు మరో నేత, గతంలో జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన చౌదరి బాబ్జీ పేరుని తెర మీదకు తెస్తున్నారని అంటున్నారు. చౌదరి బాబ్జీకి ఈ పదవి ఇవ్వాలని అచ్చెన్న సిఫార్స్ చేస్తున్నారుట. అయితే బాబ్జీ పనితీరు పట్ల బాబు అంత సంతృప్తిగా లేరని, అందుకే శిరీష వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. మరి అచ్చెన్న చక్రం అడ్డుపడకపోతే ఆమె మరోమారు ప్రెసిడెంట్ అవుతారు. కూన రవికుమార్ మాత్రం కేసులతోనే అలా తిరుగుతూంటారని జిల్లా టీడీపీలో వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News