ఎంజీఆర్ రికార్డును అన్నాడీఎంకే అధిగమించగలదా?

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ గల నాయకుల్లో మొదటివారు దివంగత ఎంజీ రామచంద్రన్. ఏడో దశకం ప్రారంభంలో నాటి డీఎంకే అధినేత కరుణానిధితో విబేధించి బయటకు వచ్చి [more]

Update: 2021-04-24 16:30 GMT

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ గల నాయకుల్లో మొదటివారు దివంగత ఎంజీ రామచంద్రన్. ఏడో దశకం ప్రారంభంలో నాటి డీఎంకే అధినేత కరుణానిధితో విబేధించి బయటకు వచ్చి సొంతంగా అన్నా డీఎంకేని ప్రారంభించి విజయవంతంగా నడిపిన నాయకుడు ఆయన. వరుసగా మూడుసార్లు తన నాయకత్వంలో 1977, 1980, 84 ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపడటం విశేషం. గతంలో ఏ ముఖ్యమంత్రి వరుసగా మూడుసార్లు పార్టీకి విజయం సాధించి పెట్టలేదు. ద్రవిడ ఉద్యమ నిర్మాతలైన అన్నాదొరై, కరుణానిధి సైతం ఈ ఘనతను సాధించలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో కాంగ్రెస్ కూడా వరుసగా మూడుసార్లు గెలుపొందింది. చక్రవర్తుల రాజగోపాలచారి నాయకత్వంలో ఒకసారి, కామరాజ్ నాడార్ సారథ్యంలో రెండుసార్లు పోటీచేసి అధికారాన్ని అందుకుంది.

వరసగా మూడుసార్లు….

కానీ ఎంజీఆర్ మాదిరిగా వరుసగా మూడుసార్లు ఇంతవరకూ ఏ పార్టీ ప్రజల ఆదరణను చూరగొనలేదు. 2011, 2016ల్లో వరుసగా నాటి పార్టీ అధినేత్రి జయలలిత సారథ్యంలో పార్టీ విజయఢంకా మోగించింది. ఆమె బతికి ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి ఎంజీఆర్ రికార్డును సమం చేసి ఉండేవారని అన్నా డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికి ఈనెల 6న జరిగిన ఎన్నికల్లో పళని స్వామి ఆధ్వర్యంలో ఎన్నికలను ఎదుర్కొన్న తమ పార్టీ మళ్లీ విజయం సాధించి పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ రికార్డును సమం చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

రెండోసారి గెలవడమంటే?

అయితే ఈ ధీమా ఎంతవరకు వాస్తవమన్న విషయంలో రాజకీయ వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు. 1989 నుంచి అధికార పార్టీ రెండోసారి గెలిచిన సంప్రదాయం తమిళనాడులో లేదు. ఒక్క 2016లోనే జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే గెలిచి ఈ సంప్రదాయాన్ని పూర్వపక్షం చేసింది. ఇప్పుడు పళనిస్వామి సారథ్యంలో ఎంతవరకు గెలుపు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకమే. జయలలిత మరణానంతరం సీఎం పీఠంపై కూర్చొన్న పళనిస్వామి ప్రభుత్వ మనుగడపైనే తొలుత సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికి అనేక ఆటంకాలను అధిగమించి అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. పార్టీని కేంద్రంలో అధికారంలో గల భాజపాతో
సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. శాసనసభలో తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ భాజపాను దూరం చేసుకోలేదు. కొన్ని విషయాల్లో ప్రదాని మోదీ తో విభేదించినప్పటికీ అవి ముదరకుండా జాగ్రత్తపడ్డారు. కమలంతో స్నేహం ఉన్నప్పటికీ ద్రవిడ పునాదులకు పార్టీ కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపారు.

రాజీ పడకుండా….

శ్రీ లంకలో తమిళుల హక్కులు, మాత్రుభాషలో నిర్ణయాలు, విద్యారంగంలో కేంద్రం చొరబాటు, పౌరసత్వ సవరణ చట్టం, మూడు వ్యవసాయ చట్టాలు తదితర విషయాల్లో రాజీ పడలేదు. కేంద్రాన్ని వ్యతిరేకించారు. అలాగని భాజపాతో పొత్తునూ వదలుకోలేదు. ఒకపక్క తమిళ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, మరోపక్క దిల్లీతో సత్సంబంధాలు నెరిపారు. ఎన్నికల ఫలితాల్లో ఒకింత తేడా వచ్చినప్పటికీ కేంద్రంతో గల సంబంధాల కారణంగా గవర్నర్ సాయంతో గట్టెక్కవచ్చన్నది పళనిస్వామి అభిప్రాయం. అయితే ఇదంతా అనుకున్నంత తేలిక కాదన్నది డీఎంకే, రాజకీయ విశ్లేషకుల అంచనా. 2016 ఎన్నికల్లోనే 80కి పైగా సీట్లు సాధించిన డీఎంకే విజయానికి దగ్గరగా వచ్చిందని, 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 39కి గాను 38 సీట్లు డీఎంకే కూటమి గెలుచుకుందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి సంప్రదాయ, కనీస ఓటుబ్యాంకు గల పార్టీలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని భాజపాకు సరైన పునాదులే లేవు. దీనికితోడు ఒక్కసారి స్టాలిన్ వంటి నేతకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని, అందువల్ల పళనిస్వామి ప్రయత్నాలు ఫలించవని వారు అంచనా వేస్తున్నారు. సర్వేలు కూడా పార్టీ గెలుపు గురించి చెబుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఎవరి వాదన నెగ్గతుందో తెలియాలంటే మే 2వరకు ఆగాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News