ఆ రెడ్డి నేతపై జగన్ ఆగ్రహానికి కారణమిదేనా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? చెప్పడం క‌ష్టం. నాయ‌కులు ఎలా ఉన్నా.. అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా ప‌డాలి. ఒక్కసారి క‌నుక త‌ప్పు చేస్తే.. ఇక‌, [more]

Update: 2020-12-01 02:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? చెప్పడం క‌ష్టం. నాయ‌కులు ఎలా ఉన్నా.. అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా ప‌డాలి. ఒక్కసారి క‌నుక త‌ప్పు చేస్తే.. ఇక‌, కోలుకోవ‌డం చాలా చాలా క‌ష్టం. గ‌త రాజ‌కీయ చ‌రిత్ర .. ప్రస్తుతం రాజ‌కీయ చ‌రిత్ర కూడా ఇదే స‌త్యాన్ని తేట‌తెల్లం చేస్తోంది. ఇప్పుడు ఈ విష‌యాలు ఎందుకు చ‌ర్చనీయాంశంగా మారాయంటే.. గుంటూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుడికి సంబంధించి.. ఇటీవ‌ల ఓ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మిత్రులు పోగ‌య్యారు. ఇంట్లోనే కార్యక్రమం ఉండ‌డంతో అంద‌రూ హుషారుగా వ‌చ్చారు. ఈ క్రమంలోనే పిచ్చాపాటీ రాజ‌కీయాలు స‌హ‌జంగానే వారి మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చాయి.

చివరి నిమిషంలో…..

“మ‌నోడు.. ఎక్కడో ఉండాలి.. కానీ ఏం చేస్తాం“ అని స‌ద‌రు రెడ్డి నాయ‌కుడి ఓ మిత్రుడు అంద‌రిముందే అనేశాడు. దీంతో ఈ విష‌యంపై అంద‌రూ ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్రస్తుతం ఇది వైసీపీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి.. వైఎస్‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి ఆయ‌న ఈ కుటుంబానికి మిత్రుడిగా సాగుతున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ పెట్టిన వైసీపీకి అండ‌గా ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. ఈయ‌న టికెట్ ఇస్తార‌ని స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఇక్కడ రాజకీయం మారిపోయింది. మాజీ డీఐజీ చంద్రగిరి వెంక‌ట‌ర‌త్నం పేరును జ‌గ‌న్ ప‌రిశీల‌నకు తీసుకుని ఈయ‌న‌ను పక్కన పెట్టారు.

అవే జగన్ ఆగ్రహానికి…..

అదే స‌మ‌యంలో పార్టీ వ్యూహ‌క‌ర్త.. విజ‌య‌సాయిరెడ్డిని పంపి.. లేళ్ల అప్పిరెడ్డితో రాజీకుదుర్చుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామ‌న్నారు. క‌ట్ చేస్తే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఏడాదిన్నర స‌మ‌యం కూడా అయిపొయింది. కానీ.. ఇప్పటి వ‌ర‌కు లేళ్ల అప్పిరెడ్డి ముఖం చూసిన నాయ‌కులు ఎవ‌రూ లేరు. దీనికి కార‌ణం ఏంటి ? ఇప్పటి వ‌రకు ఎవ‌రూ పెద్దగా ఈ విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. అయితే.. తాజాగా లేళ్ల అప్పిరెడ్డి ఇంట్లో జ‌రిగిన ఓ ఫంక్షన్‌లో ఆయ‌న మిత్రుడు దీనిపై చూచాయ‌గా కొన్ని కామెంట్లు చేశారు. వాటిని బ‌ట్టి.. అప్పిరెడ్డి రెండు త‌ప్పులు చేశార‌ని అంటున్నారు. ఇవే .. జ‌గ‌న్ ఆగ్రహానికి గురిచేశాయ‌ని చెబుతున్నారు.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా….

ఒక‌టి.. త‌నకు టికెట్ ఇవ్వక‌పోవ‌డంపై కొన్ని రోజులు అల‌గ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియాలో త‌న‌కు పాజిటివ్‌గా వార్తలు రాయించుకున్నార‌ట‌. అదే స‌మ‌యంలో పార్టీ కార్యాల‌యంలోనూ త‌న అనుచ‌రుల‌తో పార్టీ వ్యతిరేకంగా ఆందోళ‌న‌లు చేయించార‌ట‌. ఈ రెండు విష‌యాల‌ను లేళ్ల అప్పిరెడ్డి మ‌రిచిపోయినా.. పార్టీ అధిష్టానం మరిచిపోలేద‌ని అంటున్నారు. ఇక‌, రెండోది.. ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వెంక‌ట‌ర‌త్నం త‌ర‌ఫున వ్యతిరేక ప్రచారం చేయించార‌ని, దీనికి కూడా సోష‌ల్ మీడియాను వాడుకున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్యర్థి మ‌ద్దాలి గిరితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నార‌ని ఇది కూడా పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింద‌ని.. అందుకే లేళ్లకు ఇన్నాళ్లయినా.. ఎలాంటి ప‌ద‌వీ ద‌క్కలేద‌న్నది మిత్రుడి మాట‌.

ప్రత్యక్ష రాజకీయాలకు….

ఇక పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన లీకుల‌ను నాడు టీడీపీ అనుకూల మీడియాకు ఇచ్చేవార‌ని కొంద‌రు పార్టీ నేత‌లే జ‌గన్‌కు ఫిర్యాదు చేశారు. ఇక సీటు త్యాగం చేసినందుకు లేళ్ల అప్పిరెడ్డికి జ‌గ‌న్ మిర్చియార్డు చైర్మన్ ఇస్తాన‌ని చెప్పారు. అప్పిరెడ్డి మాత్రం త‌న‌కు చ‌ట్టస‌భ‌ల్లోకి వెళ్లాల‌న్న కోరిక ఉంద‌ని ఎమ్మెల్సీయే కావాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌ట్టారు. అయితే ఇప్పుడు ఏ ప‌ద‌వి లేకుండా తాడేపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాల‌య నిర్వహ‌ణ బాధ్యత‌ను అప్పిరెడ్డికి అప్పగించారు. దీంతో అప్పిరెడ్డి ఉద‌యం లేచిన వెంట‌నే పార్టీ కార్యాల‌యానికి రావడం.. రాత్రి ఇంటికి వెళ్లడం చేస్తుండ‌డంతో అప్పిరెడ్డి ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి కూడా ఉందంటున్నారు. ఇక లేళ్ల అప్పిరెడ్డిని జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంట‌న్నది ఇప్పటి వ‌ర‌కు లోక‌ల్ లీడ‌ర్లకు కూడా తెలియ‌ద‌ని అంటున్నారు. కానీ.. ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే.. ఏదో బ‌ల‌మైన కార‌ణం లేక‌పోతే.. వైఎస్ కుటుంబానికి అత్యంత అనుచ‌రుడైన లేళ్లను సైతం జ‌గ‌న్ ప‌ట్టించుకోకుండా ఉంటారా ? అనే కామెంట్ వినిపిస్తోంది. ఇప్పుడు కొంత క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News