మాఫియా 2.0కి కళ్లెం వేసేదెవరు?…

ఒకవైపు ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మరోవైపు వైద్యరంగంలో యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. కరోనా తొలిదశలో ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే చికిత్స అందించాయి. క్రమేపీ ప్రయివేటు వైద్యాన్ని [more]

Update: 2021-04-18 16:30 GMT

ఒకవైపు ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మరోవైపు వైద్యరంగంలో యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. కరోనా తొలిదశలో ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే చికిత్స అందించాయి. క్రమేపీ ప్రయివేటు వైద్యాన్ని అనుమతించారు. రోగి ఆర్థిక స్తోమతను అనుసరించి లక్షల రూపాయల్లోనే దండుకున్నారు. అనేక అవకతవకలు, అక్రమాలు, చికిత్సల పరంగా లోపాలు సైతం చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ప్రజలు సహించారు. వైద్యం అంటే విశ్వాసం. తమకు ఏరకమైన వైద్యం అందుతుందో తెలియదు. ఎందుకు స్థాయిని మించి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారో సామాన్యునికి అర్థం కాదు. అయినప్పటికీ వేరే గత్యంతరం లేక భరించాల్సి వచ్చింది. ప్రభుత్వాలకు బోలెడంత అనుభవం వచ్చింది. ప్రజలకూ కరోనా తో సహజీవనం తెలిసొచ్చింది. రెండో దశలో ఇప్పుడు కరోనా విరుచుకు పడుతోంది. ప్రజల ఆర్థిక స్థితిగతులు మరింతగా చితికిపోయి ఉన్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ ఏ తీరుగా సాగుతుందో ప్రభుత్వానికీ స్పష్టంగా తెలుసు. అయినా నిరోధక చర్యలు లోపించాయి. ఫలితంగా గతంలో కంటే ఈ విడత మరింతగా రోగుల దోపిడీ సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు చట్టపరమైన చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోకపోవడం విషాదం. నామమాత్రపు హెచ్చరికలే తప్ప ఆసుపత్రులను తనిఖీలు చేసి, రోగులకు వేస్తున్న బిల్లులపై నిఘా పెట్టడం లేదు.

కేంద్రం సలహాలే…

కరోనాకు సంబంధించి కేంద్రం బాధ్యత చాలా కీలకమైనది. లాక్ డౌన్ లు, నియంత్రణలే కాదు. ఏ వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశాలనూ , సరపరాను కేంద్రమే నియంత్రిస్తోంది. నిర్దిష్టమైన ఛార్జీలను మాత్రం కేంద్రం సూచించడం లేదు. సగటు మనిషి లక్షల రూపాయలు వైద్యానికి వెచ్చించలేడు. ఫీజుల విషయంలో నిర్దిష్ట పరిమితి దాటిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు ఆయా ఆసుపత్రులకు కళ్లెం వేయాలి. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ప్రయివేటు ఆసుపత్రులు ధనార్జన కు ప్రయత్నించడం వ్రుత్తి నియమాలకే సిగ్గు చేటు. అయితే అందివచ్చిన అవకాశాన్ని ఎవరూ విడిచిపెట్టడం లేదు. నిన్నామొన్నటి వరకూ చికిత్సకు వినియోగించే రెమ్ డెసివర్ మందు అయిదు వేల నుంచి 15వేల రూపాయల వరకూ విక్రయించారు. తాజాగా కేంద్రం జోక్యంతో దాని ధర కంపెనీలను బట్టి తొమ్మిది వందల రూపాయల వరకూ దిగివచ్చింది. ప్రకటన అయితే కంపెనీలు చేశాయి. అయితే ఆచరణలో దీనిని ఎంతవరకూ అమలు చేస్తాయో వేచి చూడాలి. ఆసుపత్రులు, ఫార్మాకంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి సామాన్యుని జేబుకు చిల్లు పొడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిండికేట్ గా మారితే మాత్రం నియంత్రిత ధరలను అమలు చేయడం సాధ్యం కాదు. కేవలం కాగితాలకే తగ్గింపు ధరలు పరిమితమవుతాయి. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్రుష్టి పెట్టాలి. అత్యధికంగా రెమ్ డెసివర్ పేరుతోనే ఆసుపత్రులు అధిక చార్జీలకు తెర తీస్తున్నాయి.

సర్కారీ నియంత్రణ శూన్యం..

అప్పుడప్పుడు మంత్రులు, అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దోపిడీని సహించమంటూ మాటవరస హుంకరింపులు వినిపిస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రులను సందర్శించి , అక్కడ అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకుంటున్న దాఖలాలు లేవు. బాధిత కుటుంబాలు రుణాల ఊబిలో కూరుకుపోతూ ఏ మేరకు ఛార్జీలు చెల్లిస్తున్నాయో తెలుసుకోవడం లేదు. అసలు ఇటువంటి తీవ్ర రుగ్మతల విషయంలో ప్రజారోగ్యానికి పూర్తి పూచీకత్తు ప్రభుత్వాలే వహించాలి. ప్రయివేటు ఆసుపత్రుల ఫీజులుసైతం సర్కారే చెల్లించాలి. కరోనా సేవలకు నిర్దేశిత రుసుమును మాత్రమే విధించేలా చూడాలి. నిజానికి నూటికి తొంభై అయిదు శాతం కేసులు హోమ్ ఐసోలేషన్ తోనే నయమవుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క. కానీ రకరకాల భయాల కారణంగా ప్రజలు ఎగబడుతున్నారు. ఎవరిని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలనే దానిపై నియంత్రణ లేదు. డబ్బులు చెల్లించే స్తోమత ఉంటే చాలు ప్రయివేటు ఆసుపత్రులు అడ్మిసన్లు ఇచ్చేస్తున్నాయి. ప్రతి ప్రయివేటు ఆసుపత్రిని రెవిన్యూ, మునిసిపల్ యంత్రాంగం పరిధిలోకి తెచ్చి ఫీజులు, అడ్మిషన్ల విషయంలో అదుపు చేయడం తక్షణ అవసరంగా కనిపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్య పద్ధతులపై నిఘా పెట్టాలి.

అంతా కలిస్తేనే…

దేశంలో అందరికీ వాక్సిన్ లభించి భద్రతతో కూడిన, భరోసాతో నిండిన సాధారణ జీవనం ఇప్పట్లో లభించేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఒక డోసు వాక్సిన్ ఇచ్చిన వారికి రెండో డోసు ఇవ్వడానికే వెదుకులాట కొనసాగుతోంది. 45 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సిన్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. యూనివర్శల్ వాక్సినేషన్ చేసేందుకు అవసరమైనన్ని యూనిట్లు మన వద్ద లేవు. ఉత్పత్తి చేయాలంటే కూడా రెండు సంవత్సరాల వరకూ పట్టవచ్చంటున్నారు. తొలిదశలో క్రమేపీ తగ్గుముఖం పట్టినట్లే మలి విడత విజృంభణ కూడా సహజమైన విధానంలోనే కనుమరుగు కావచ్చు. అంతవరకూ జాగ్రత్తగా ఉండటమే అత్యుత్తమం. ప్రభుత్వాలు అంతవరకూ ప్రజల ఆర్థిక భద్రతకు సైతం భరోసాను ఇవ్వాలి. మెడికల్ మాపియా కట్టుతప్పకుండా తన ప్రజలను వారి నుంచి కాపు కాచుకోవాలి. లేకపోతే భయాందోళనలను మరింతగా నగదుగా మార్చుకునేందుకు తెగిస్తాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News