ప్రమాద ఘంటికలు మోగుతున్నా…?

ప్రపంచం నేర్పుతున్న పాఠం వారికి తలకెక్కలేదు. ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే కరోనా రక్కసి పోయినట్లు భావించారో ఏమో కానీ ఇక పోలీసులు కఠిన ఆంక్షలు అమలు [more]

Update: 2020-03-24 11:00 GMT

ప్రపంచం నేర్పుతున్న పాఠం వారికి తలకెక్కలేదు. ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే కరోనా రక్కసి పోయినట్లు భావించారో ఏమో కానీ ఇక పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయక తప్పని పరిస్థితిని ప్రజలే కొనితెచ్చుకుంటున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సర్కార్లు కొరడా ను ఖాకీలకు ఇచ్చేయాలిసి వచ్చింది. ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల కోసం ఎగబడటం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, వాహనాలపై విచ్చల విడి సంచారం, గుంపులు గుంపులుగా తిరగడం తెలంగాణ, ఏపీలలో సోమవారం దర్శనం ఇవ్వడం అందరిలో ఆందోళన పెంచింది. దాంతో అంతా కఠిన ఆంక్షలు అమలు చేసి తీరాలని సోషల్ మీడియా వేదికలపై గళం ఎత్తక తప్పలేదు.

అలెర్ట్ అయిన తెలుగు రాష్ట్రాలు …

ఒక పక్క కేంద్రం లాక్ డౌన్ పై స్పష్టమైన ఆదేశాలు, సూచనలు చేసింది. వెంటనే తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు వేగంగానే స్పందించి చర్యలు చేపడుతున్నా ఒక్కరోజు మాత్రమే క్రమశిక్షణ చూపిన జనతా రెండో రోజు నుంచి పూర్తిస్థాయిలో రోడ్డెక్కిసింది. ముఖ్యంగా బాధ్యతాయుతంగా వుండాలిసిన యువత మరింత బరితెగిస్తుంది. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ విచ్చలవిడితనం చాటుతుంది. అందుకే ఇక కఠిన చర్యలకు దిగక తప్పలేదు ప్రభుత్వానికి. పోలీసులకు పూర్తి స్థాయిలో పౌరులను కంట్రోల్ చేసే బాధ్యతను అప్పగించేసారు తెలుగురాష్ట్రాల అధినేతలు. దాంతో ఎక్కడికక్కడ వాహనాలను సీజ్ చేయడంతో బాటు జరిమానాలు విధించడం మొదలు పెట్టారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారికి ఇకపై చుక్కలు చూపించాలనే నిర్ణయం అమల్లో పెట్టేశారు పలు ప్రాంతాల్లో ఖాకీలు.

చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు …

నిత్యావసరాల్లో కూరగాయలకు చాలా ప్రాధాన్యత కలిగినవి. అవకాశం దొరికిందని రైతు బజార్లలో ఒక్కసారిగా ధరలు పెంచడంతో వినియోగదారులతో పలుచోట్ల యుద్ధాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో అయితే ఒక రైతు బజార్ లో వినియోగదారులు షాప్ లో ఉన్న మొత్తం కాయగూరలు లూటీనే చేసి పారేశారు. రెండు రోజుల క్రితం ఉన్న ధరలకు నేటి ధరలకు తేడా చూపిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇవన్నీ పోలీస్ పంచాయితీలకు దారి తీశాయి. ఇవన్నీ పక్కన పెడితే నిత్యావసరాలకోసం వచ్చే వారు షోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఒకరిపై మరొకరు సమూహాలుగా పడిపోవడం ఆందోళనకర పరిణామం. దీనిపై కూడా దృష్టి పెట్టిన ఎపి సర్కార్ ఇప్పుడు జనతా బజార్లను పెద్ద పెద్ద స్థలాల్లో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇకపై వారం రోజులు కీలక తరుణం కావడంతో వైరస్ అడ్డుకట్టకు స్వీయ నిర్బంధాన్ని ప్రతిఒక్కరు పాటిస్తేనే సత్ఫలితాలు కనిపిస్తాయి. లేనిపక్షంలో పరిస్థితిని ఊహించడమే కష్టం.

Tags:    

Similar News